డ్రగ్స్ కేసు వివాదంలో చిక్కుకున్న శాండిల్ వుడ్ బ్యూటీ సంజనా గల్రానీ ఇప్పుడిప్పుడే మామూలు మనిషి అవుతోంది. అంతేకాదు… కరోనా సెకండ్ వేవ్ సమయంలో ఇబ్బందులు పడుతున్న సినీ కార్మికులకు తన వంతు సాయం అందించింది. తాను వాక్సిన్ వేయించుకోవడమే కాకుండా అవసరం అయిన వాళ్ళకు ఉచితంగానూ వాక్సినేషన్ చేయించింది. దానికి తోటు ఇప్పుడు నటిగానూ తిరిగి తన ప్రస్థానాన్ని ప్రారంభించబోతోంది. అందులో భాగంగా సంజనా తాజాగా ఓ మల్టీలింగ్వల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘మణిశంకర్’ పేరుతో తెరకెక్కబోతున్న ఈ సినిమాను జి. వెంకట కృష్ణన్ డైరెక్ట్ చేయబోతున్నారని, వచ్చే నెలలో మూవీ సెట్స్ పైకి వెళుతుందని సంజనా చెబుతోంది. ఆంధ్రప్రదేశ్ లోని మారుమూల ప్రాంతాలలో ఈ సినిమా షూటింగ్ జరుగుతుందని, దీనిని తెలుగు, కన్నడ, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తారని చెప్పింది.
Read Also : రష్మిక కోసం 900 కిమీ నడిచిన అభిమానికి నిరాశ… స్టార్ హీరోయిన్ రిక్వెస్ట్
112 ఎపిసోడ్స్ ‘సువర్ణ ఖడ్గం’ సీరియల్ లో నటించిన సంజనా… దాని కోసం గుర్రపు స్వారీ, కత్తియుద్ధాలను నేర్చుకుంది. ఆ సీరియల్ తర్వాత ఉమెన్ సెంట్రిక్ మూవీస్ చేయాలని తాను భావించానని, దానికి తగ్గట్టే తన చుట్టూనే తిరిగే కథతో ‘మణిశంకర్’ మూవీ రూపుదిద్దుకోబోతందని సంజనా తెలిపింది. చాలామంది కథానాయికలు ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్న ప్రస్తుత తరుణంలో తాను దక్షిణాదిలోని నాలుగు భాషా చిత్రాలలోనూ, హిందీలోనూ నటించానని, నటిగా 50వ చిత్రానికి దగ్గరగా ఉన్నానని సంజనా చెప్పింది. పేండమిక్ సిట్యుయేషన్ లో శరీరాకృతిని కాస్తంత నిర్లక్ష్యం చేసిన తాను ఇప్పుడు పర్ ఫెక్ట్ ఫిజిక్ కోసం కృషి చేస్తున్నానని, ‘మణిశంకర్’ చిత్రంలోని పాత్రకు అనుగుణంగా సన్నబడటానినే తన తొలి ప్రాధాన్యమని సంజనా చెబుతోంది.
