సినీ నటుడు శివాజీ చుట్టూ కొత్త వివాదం అలుముకుంది. ఇటీవలే జరిగిన దండోరా సినిమా వేడుకలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చట్టపరమైన చిక్కులకు దారితీశాయి. మహిళల గౌరవానికి భంగం కలిగించేలా ప్రసంగించారన్న ఆరోపణలపై తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ తీవ్రంగా స్పందించింది. నటుడు శివాజీ ప్రధాన పాత్రలో నటిస్తున్న ‘ధండోరా’ సినిమా ఈవెంట్ సందర్భంగా ఆయన చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వ్యాఖ్యలు మహిళలను కించపరిచేలా ఉన్నాయని భావించిన తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్, దీనిని సుమోటో (Suo Motu) కేసుగా స్వీకరించింది. ప్రాథమిక విచారణ అనంతరం, ఆయన ప్రసంగంలో మహిళల పట్ల అవమానకర ధోరణి ఉందని కమిషన్ నిర్ధారించింది.
Also Read: Shivaji: సామాన్ల కామెంట్లపై ఎట్టకేలకు వెనక్కి తగ్గిన శివాజీ.. ‘సోషల్ మీడియా సాక్షిగా క్షమాపణలు
మహిళా కమిషన్ తన అధికారాలను ఉపయోగించి, తెలంగాణ మహిళా కమిషన్ చట్టం 1998లోని సెక్షన్ 16(1)(b) ప్రకారం ఈ విచారణను ప్రారంభించింది. కేవలం నోటీసులతోనే సరిపెట్టకుండా, ఈ వ్యవహారాన్ని లోతుగా విచారించాలని కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు ఇప్పటికే నటుడు శివాజీకి అధికారికంగా నోటీసులు జారీ అయ్యాయి. మహిళా కమిషన్ జారీ చేసిన ఆదేశాల ప్రకారం డిసెంబర్ 27వ తేదీన ఉదయం 11:00 గంటలకు హైదరాబాద్‌లోని బుద్ధ భవన్‌లో ఉన్న మహిళా కమిషన్ కార్యాలయంలో శివాజీ స్వయంగా కమిషన్ ఎదుట హాజరై తన వివరణ ఇచ్చుకోవాలని కమిషన్ స్పష్టం చేసింది. అంతేకాకుండా, సదరు వ్యాఖ్యలకు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలు లేదా వివరణాత్మక పత్రాలను కూడా వెంట తీసుకురావాలని ఆదేశించింది.
Also Read:Shivaji : శివాజీ మైండ్‌సెట్‌పై జాలి పడుతున్నా..!” అనసూయ స్ట్రాంగ్ కౌంటర్!
ఈ విచారణ ప్రక్రియకు సంబంధించి మహిళా కమిషన్ ఇప్పటికే స్థానిక (లేక్) పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించింది. విచారణ సమయంలో శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా చూడటంతో పాటు, చట్టపరమైన తదుపరి చర్యల కోసం సమన్వయం చేసుకుంటోంది. సమాజంలో బాధ్యతాయుతమైన పదవుల్లో లేదా సెలబ్రిటీ హోదాలో ఉన్న వ్యక్తులు మహిళల పట్ల మాట్లాడేటప్పుడు సంయమనం పాటించాలని, లేనిపక్షంలో ఇలాంటి కఠిన చర్యలు తప్పవని ఈ ఉదంతం ద్వారా మహిళా కమిషన్ గట్టి హెచ్చరిక పంపినట్లయింది. అయితే ఈ అంశం మీద ఇప్పటికే శివాజీ క్షమాపణలు చెబుతూ వీడియో రిలీజ్ చేశారు. అయితే మరి డిసెంబర్ 27న కమిషన్ ఎదుట శివాజీ ఎలాంటి వివరణ ఇస్తారో వేచి చూడాలి.
