రాజశేఖర్.. ‘యాంగ్రీ యంగ్ మ్యాన్’గా గుర్తింపు పొందిన ఆయన, వృత్తిరీత్యా డాక్టర్ అయినప్పటికీ నటనపై మక్కువతో వెండితెరకు పరిచయమయ్యారు. ఫ్యామిలి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకున్నా.. ఆయన వివాహ విషయం సినీ ఇండస్ట్రీలో ఒక సెన్సేషన్. అప్పట్లో కుల కట్టుబాట్లు, కుటుంబ ఒత్తిళ్లు ఉన్నప్పటికీ రాజశేఖర్-జీవితల జంట, ఇప్పటికీ టాలీవుడ్‌లో మోస్ట్ సక్సెస్‌ఫుల్ సెలబ్రిటీ కపుల్‌గా కొనసాగుతున్నారు. కానీ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గోన్న రాజశేఖర్ గత జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ, తన వివాహ బంధం వెనుక ఉన్న ఆసక్తికరమైన సంఘటనలను బయటపెట్టారు.
రాజశేఖర్ మాట్లాడుతూ.. ‘మొదట నను పెళ్లి చేసుకోవాలని అడిగింది శ్రీదేవి. కానీ మా కుటుంబంలో కుల కట్టుబాట్లు చాలా ఎక్కువగా ఉండేవి, ఖచ్చితంగా సొంత కులానికి చెందిన అమ్మాయినే వివాహం చేసుకోవాలని ఒత్తిడి చేశారు. నా కెరీర్ వ్యక్తిగత జీవితంలో కీలక దశలో ఉన్నప్పుడు ఇలాంటి కుటుంబపరమైన సవాళ్లు ఎదురయాయి. కుటుంబం ఒత్తిడి చేస్తున్న క్రమంలో నేను ఈ విషయాన్ని నటి జీవిత వద్ద ప్రస్తావించా. ఆ సమయంలో జీవిత, ఒకవేళ నువ్వు వేరే ఎవరినైనా వివాహం చేసుకోవాలని అనుకుంటే అది నీ వ్యక్తిగత నిర్ణయం నాకెలాంటి అభ్యంతరం లేదని చేప్పింది. అంతే కాదు రాజశేఖర్ వేరొకరిని పెళ్లి చేసుకుంటే, నేను మాత్రం జీవితాంతం ఒంటరిగానే ఉండిపోతా అని ఆమె స్పష్టం చేసింది’ అంటూ ఆయన వెల్లడించారు. ఆమె మాటలతో తన జీవిత భాగస్వామి జీవితనే కావాలని ఆయన నిర్ణయించుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరిద్దరూ టాలీవుడ్‌లో ఒక అదర్శ దంపతులుగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం రాజశేఖర్ చేసిన ఈ పాత విషయాలు సోషల్ మీడియాలో మరోసారి ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
