418 Trailer: నేను కచ్చితంగా తల్లినై తీరాలి.. బయపెట్టేస్తున్న ‘418’ ట్రైలర్‌!

418 Trailer

418 Trailer

418 Movie Trailer Thrills: టాలీవుడ్ ప్రేక్షకులకు సరికొత్త భయానక అనుభూతిని కలిగించేందుకు మరో సినిమా సిద్దమైంది. స్టార్ డైరెక్టర్ ప్రశాంత్‌ నీల్‌ సమర్పణలో హారర్‌ థ్రిల్లర్‌ మూవీ ‘418-ది నైట్‌మేర్ బిగిన్స్’ వస్తోంది. కీర్తన్ నడగౌడ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని, వై.రవిశంకర్‌ నిర్మించారు. అక్టోబరు 23న 418 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ట్రైలర్‌ను చిత్ర బృందం తాజాగా విడుదల చేసింది.

ఒక నిమిషం 54 సెకండ్ల నిడివిగల ట్రైలర్.. ‘నేను తల్లినై తీరాలి.. కచ్చితంగా తల్లినై తీరాలంతే’ అనే డైలాగ్‌తో ఆరంభం అయింది. ప్రతి సీన్ భయపెట్టేలా ఉంది. ట్రైలర్‌ను అత్యంత ఉత్కంఠభరితంగా రూపొందించారు. నటి చైత్ర ఆచార్ నటన, ఆమె పలికించిన భయానక హావభావాలు ట్రైలర్‌లో ప్రత్యేకంగా నిలిచాయి. విభిన్నమైన సీరియస్‌ ఇంటెన్స్‌ హారర్‌ థ్రిల్లర్‌గా తీర్చిదిద్దినట్లు ట్రైలర్‌ చూస్తే అర్థమవుతోంది. ట్రైలర్‌ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ సినిమాపై భారీ అంచనాలను పెంచేస్తోంది.

సుమారు 15 ఏళ్లుగా ఎవరికీ ప్రవేశం లేకుండా మూసి ఉన్న ఒక భవనంలోని ‘418’ నంబర్ గది చుట్టూ తిరిగే భయానక రహస్యాల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఆ రూమ్ వెనుక ఉన్న మిస్టరీని చేధించడానికి ప్రయత్నించే విద్యార్థులకు ఎదురయ్యే భయానక అనుభవాలే ఈ చిత్ర కథ. వెంకీ జీజీ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్, దినేష్ దివాకరన్ సినిమాటోగ్రఫీ అదనపు బలంగా నిలిచాయి. ఇందులో చైత్ర ఆచార్, సూర్య రాజ్ వీరభతిని, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడాల, శశాంక్ పాటిల్, రమేష్ ఇందిర తదితరులు కీలక పాత్రలు చేశారు. 418 మూవీ తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో విడుదల కానుంది.