Site icon NTV Telugu

పదేళ్ళ ‘బద్రినాథ్’

ఓ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సాధించగానే, అదే పంథాలో పయనించడం తెలుగు సినిమా జనానికి అలవాటే! రాజమౌళి రూపొందించిన ‘మగధీర’ ఘనవిజయంతో పలువురు రచయితలు ఆ తరహా కథలు అల్లారు. ‘మగధీర’తో రామ్ చరణ్ స్టార్ డమ్ చేజిక్కించుకున్నాడు. దాంతో పలువురు యువకథానాయకులు ‘మగధీర’ను పోలిన ఫాంటసీ స్టోరీస్ కు ప్రాధాన్యమిచ్చారు. ఎవరు అవునన్నా కాదన్నా, ‘మగధీర’ ఇన్ స్పిరేషన్ తో రెండు భారీ తెలుగు చిత్రాలు రూపొందాయి. వాటిలో ఒకటి జూనియర్ యన్టీఆర్ నటించిన ‘శక్తి’ కాగా, మరోటి ‘మగధీర’ నిర్మాత అల్లు అరవింద్ తన తనయుడు అర్జున్ హీరోగా తెరకెక్కించిన ‘బద్రినాథ్’. ఈ రెండు చిత్రాలు 2011లోనే జనం ముందు నిలిచాయి. ‘బద్రినాథ్’ కంటే ముందుగా జూ.యన్టీఆర్ ‘శక్తి’ విడుదలయింది. ఆ తరువాత ‘బద్రినాథ్’ జూన్ 10న ప్రేక్షకులను పలకరించింది. ఈ రెండు చిత్రాలలో ఏదీ కూడా ‘మగధీర’ స్థాయిని అందుకోలేకపోవడం గమనార్హం!

స్ఫూర్తి…
‘బద్రినాథ్’ కథకుడు చిన్నికృష్ణ. ఈయన రచనతో రూపొందిన ‘నరసింహనాయుడు, ఇంద్ర, గంగోత్రి’ వంటి చిత్రాలు తెలుగువారిని విశేషంగా అలరించాయి. చిన్నికృష్ణ రచనతో తెరకెక్కిన ‘గంగోత్రి’ చిత్రం ద్వారానే అల్లు అర్జున్ హీరోగా పరిచయం కావడం విశేషం. ఆ సెంటిమెంట్ తోనే కాబోలు ‘మగధీర’ స్థాయి కథగా ‘బద్రినాథ్’ను రూపొందించారు చిన్నికృష్ణ. అంతకు ముందు ‘సమరసింహారెడ్డి, నరసింహనాయుడు’ చిత్రాలు ఫ్యాక్షనిజమ్ డ్రామాల్లో ఓ ట్రెండ్ క్రియేట్ చేశాయి. వీటిలో ‘సమరసింహారెడ్డి’ కథను విజయేంద్రప్రసాద్ రాయగా, ‘నరసింహనాయుడు’ను చిన్ని కృష్ణ పలికించారు. ఈ రెండు చిత్రాల మిశ్రమం అన్న తీరున ‘ఇంద్ర’కథను రాసింది చిన్నికృష్ణనే. అందువల్ల ఆ సెంటిమెంట్ ప్రకారం కూడా ‘మగధీర’ కథ రాసిన విజయేంద్ర ప్రసాద్ స్ఫూర్తితోనే ‘బద్రినాథ్’ రూపొందించారు చిన్నికృష్ణ.

గుర్తుకొస్తాయి…
‘బద్రినాథ్’ కథలో కథానాయకుడు బద్రి ఆ శ్రీమన్నారాయణుని నమ్ముకొని తన జీవితాన్ని బద్రినాథ్ పుణ్యక్షేత్ర సేవకే అంకితం చేసి ఉంటాడు. అలకనంద అనే అమ్మాయి, అక్కడకు వచ్చి, హీరోను ప్రేమిస్తుంది. అతను మాత్రం తన నియమం ప్రకారం జీవితాన్ని దేవుని సేవకే అంకితం చేస్తానని అంటాడు. అతని గురువు, తన తరువాత బద్రినాథ్ రక్షకుడు బద్రియే అని నిర్ణయించి ఉంటాడు. గురువు సైతం ఈ శిష్యుణ్ని అపార్థం చేసుకుంటాడు. అతను అలకానంద ప్రేమలో పడ్డాడని భావిస్తాడు. అయితే అసలు విషయం తెలుసుకున్న గురువు, ఆపదలో ఉన్న ఆ అమ్మాయిని రక్షించమని, తానే హీరోను పురమాయిస్తాడు. చివరకు దుష్టశిక్షణ చేసి, గురువు ఆజ్ఞ మేరకు అలకానంద చేయి అందుకుంటాడు హీరో.

చివరలో గురువు వారికి పుట్టబోయే బిడ్డను తన వద్ద శిక్షణకు పంపమని చెప్పడంతో కథ ముగుస్తుంది. ఈ కథ టూకీగా చెబితేనే పలు పాత కథలు గుర్తుకు వస్తాయి. అందులో ముఖ్యంగా ‘మగధీర’ గుర్తుకు రాకమానదు. హీరో గెటప్ అచ్చు జపాన్ యోధులు సమురాయ్ ని తలపిస్తుంది. ‘మగధీర’లో హీరో పొడవాటి జుట్టుతో అలరించినట్టుగానే, ఇందులో కూడా హీరో హెయిర్ స్టైల్ ను మలిచారు అనిపిస్తుంది. ‘మగధీర’లో మిత్రవిందను విలన్ వచ్చి, తీసుకుపోయినట్టుగానే, ఇందులోనూ అలకానందను ఆమె బంధువులు వచ్చి బలవంతంగా లాక్కుపోతారు. బద్రిగా అల్లు అర్జున్, అలకానందగా తమన్నా, గురువు భీష్మనారాయణగా ప్రకాశ్ రాజ్ అభినయించిన ఈ చిత్రంలో బ్రహ్మానందం, ప్రగతి, తనికెళ్ళ భరణి, కోవై సరళ, సయాజీ షిండే, ఎమ్మెస్ నారాయణ, రావు రమేశ్, సుధ, మాస్టర్ భరత్, ధర్మవరపు సుబ్రహ్మణ్యం, కెల్లీ డోర్జీ, రఘుబాబు, వేణుమాధవ్ తదితరులు నటించారు.

ఆ పాటే హైలైట్…
‘బద్రినాథ్’ చిత్రాన్ని అత్యంత భారీగా నిర్మించారు. ఈ సినిమా కోసం హైదరాబాద్ స్టూడియోస్ లో భారీ సెట్స్ వేశారు. స్పెయిన్, ఇటలీ, జర్మనీ వంటి విదేశాలలోనూ చిత్రీకరణ జరుపుకుంది. ‘బద్రీనాథ్’ మొదట్లో మంచి వసూళ్ళు చూసింది. ‘మగధీర’కు స్వరకల్పన చేసిన ఎమ్.ఎమ్.కీరవాణి ఈ చిత్రానికి కూడా సంగీతం అందించారు. “కన్నుమూస్తే బద్రీనాథ్… నాథ్… నాథ్… నీతో బద్రీనాథ్…” అనే పాట విశేషాదరణ పొందడమే కాదు, చిత్రీకరణ పరంగానూ ఆకట్టుకుంది. ఈ పాటలో మోకాళ్ళతో హీరో అల్లు అర్జున్ చేసిన డాన్స్ జనాన్ని భలేగా ఆకర్షించింది. “ఓంకారేశ్వరి…” అంటూ మొదలయ్యే గీతం, “నచ్చావురా…”, “చిరంజీవా…” అంటూ సాగే పాటలు కూడా ఆకట్టుకున్నాయి. వేటూరి, చంద్రబోస్, చైతన్య ప్రసాద్, శ్రావణ భార్గవి, కీరవాణి పాటలు రాశారు. గీతా ఆర్ట్స్ పతాకంపై నిర్మితమైన ఈ చిత్రానికి వి.వి.వినాయక్ దర్శకత్వం వహించారు.

Exit mobile version