NTV Telugu Site icon

రవితేజ కొత్త సినిమాకు రెమ్యూనరేషన్ ఎంత!?

Raviteja Remneration for his Next Movie

ప్రస్తుతం రవితేజ ‘ఖిలాడీ’ చిత్రంలో నటిస్తున్నాడు. అది అతనికి 67వ చిత్రం. రమేశ్ వర్మ దర్శకత్వంలో కోనేరు సత్యనారాయణ నిర్మిస్తున్న ఈ సినిమా అన్ని అనుకున్నట్టు జరిగితే, మే 28న విడుదల కావాలి. అయితే… ప్రస్తుతం పలు చిత్రాల విడుదల వాయిదా పడుతున్న నేపథ్యంలో ‘ఖిలాడీ’ పరిస్థితి ఏంటనేది ఇప్పుడే చెప్పలేం. ఇదిలా ఉంటే… ‘ఖిలాడీ’ తర్వాత రవితేజ 68వ చిత్రాన్ని త్రినాథ రావు నక్కిన దర్శకత్వంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ నిర్మిస్తామని చెప్పాయి. దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. కానీ ఇప్పుడు ఆ వరస మారింది. తన 68వ చిత్రంగా రవితేజ… సుధాకర్ చెరుకూరి నిర్మాతగా శరత్ మండవ దర్శకత్వంలో ఓ యాక్షన్ థ్రిల్లర్ చేయబోతున్నాడు. ఇందులో ‘మజిలీ’ ఫేమ్ దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటించబోతోంది. విశేషం ఏమంటే… ఈ సినిమాకు రవితేజ కేవలం 30 రోజులే కేటాయించాడట. ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా పూర్తి చేయడంతో పాటు షూటింగ్ ను కూడా నాన్ స్టాప్ గా కంప్లీట్ చేయడానికి టీమ్ మొత్తం సిద్ధమైపోయిందని తెలుస్తోంది. ఇప్పటి వరకూ రవితేజ ఏ సినిమా చేసినా, ఆయన రెమ్యూనరేషన్, ఆ మూవీ బడ్జెట్ కు సంబంధించిన అంశాలకే ఎక్కువ ప్రచారం జరిగింది. రవితేజ రెమ్యూనరేషన్ కారణంగానే కొన్ని సినిమాలు ఆగిపోయాయనీ వార్తలు వచ్చాయి. అయితే ఈ యేడాది సంక్రాంతికి వచ్చిన ‘క్రాక్’ గ్రాండ్ సక్సెస్ తర్వాత మాస్ మహరాజా డిమాండ్ అమాంతంగా పెరిగిపోయింది. అతను అడిగినంత పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు సిద్ధమౌతున్నారు. ఇక ఈ కొత్త సినిమాకైతే రవితేజ అక్షరాల ఎనిమిది కోట్లు తీసుకుంటున్నాడట. దానికి అదనంగా వైజాగ్, నైజామ్ ఏరియా రైట్స్ లో యాభై శాతం వాటా అడుగు తున్నాడట. అంటే ఈ లెక్కన రవితేజ రెమ్యూనరేషన్ రోజుకు పాతిక లక్షలపైమాటే! మాస్ మహరాజా… మజాకానా అంటున్నారు ట్రేడ్ అనలిస్టులు!!