NTV Telugu Site icon

నిర్మాతగా మారుతున్న షాహిద్ కపూర్ !

Shahid Kapoor Turns as Producer

బాలీవుడ్ నటుడు షాహిద్ కపూర్ ఇప్పుడు యమా బిజీగా ఉన్నాడు. ‘జెర్సీ’ రీమేక్ విడుదలకు సిద్ధంగా ఉండగా, రాజ్, డీకే కొత్త చిత్రంతో పాటు సూర్య నటించిన ‘సూరారై పోట్రు’ రీమేక్ కూ షాహిద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు వార్తలు వస్తున్నాయి. అదే సమయంలో శశాంక్ ఖైతాన్ ‘యోధా’ చిత్రం నుండి షాహిద్ తప్పుకోవడం కూడా బాలీవుడ్ లో చర్చనీయాంశంగా మారిపోయింది. దానికి అసలైన కారణం ఇదీ అని తెలియకపోవడంతో దర్శకుడు మాత్రం తన వంతు ప్రయత్నం తాను చేస్తున్నాడని అంటున్నారు. ఇదిలా ఉంటే… అమెజాన్ ప్రైమ్ తో షాహిద్ కపూర్ డిజిటల్ మీడియా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అలానే నెట్ ఫ్లిక్స్ తోనూ ఓ ట్రయాలజీకి షాహిద్ అగ్రిమెంట్ చేశాడని అంటున్నారు. దీనికి కోసం 70- 80 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ ను నెట్ ఫ్లిక్స్ ఇస్తోందని అంటున్నారు. విశేషం ఏమంటే ఈ ప్రాజెక్ట్ లోనే నిర్మాణ భాగస్వామిగా షాహిద్ కపూర్ వ్యవహరించబోతున్నాడట. ‘బాహుబలి’ తరహాలో మైథలాజికల్ వార్ డ్రామాగా దీనిని తీయబోతున్నారట. నిజానికి నిర్మాతగా మారాలన్నది షాహిద్ కపూర్ చిరకాల కోరిక. డింగ్కో సింగ్ పాత్ర తానే పోషిస్తూ, బయోపిక్ నిర్మించాలని షాహిద్ ఆ మధ్యలో అనుకున్నాడు కానీ ఆ ప్రాజెక్ట్ మెటీరియలైజ్ కాలేదు. అయితే.. రాకేశ్ ఓంప్రకాశ్ మెహ్రా దర్శకత్వంలో షాహిద్ ‘కర్ణ’ చిత్రంలో నటిస్తున్నాడు. దాని తర్వాత అతను చేసే మైథలాజికల్ వెబ్ సీరిస్ నెట్ ఫ్లిక్స్ దే కానుండటం విశేషం.