రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, నరేశ్ అగస్త్య, సముతిర ఖని, బ్రహ్మానందం, స్వాతిరెడ్డి కీలక పాత్రలు పోషించిన సినిమా ‘పంచతంత్రం’. హర్ష పులిపాక రచన, దర్శకత్వంలో అఖిలేష్ వర్థన్, సృజన్ ఎరబోలు నిర్మించిన ఈ సినిమా పూజా కార్యక్రమాలు ఫిబ్రవరిలో జరిగాయి. అప్పుడే రెగ్యులర్ షూటింగ్ నూ మొదలు పెట్టారు. గురువారం శివాత్మిక పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్ లోగోతో పాటు ఆమెకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. దీనిని అడివి శేష్ తన సోషల్ మీడియా అక్కౌంట్ ద్వారా విడుదల చేసి, చిత్ర యూనిట్ కు శుభాకాంక్షలు తెలిపారు. ‘కలర్ ఫోటో’తో దర్శకుడిగా మారిన సందీప్ రాజ్ ఈ చిత్రానికి మాటలు రాయడం విశేషం. అలానే ప్రముఖ సంగీత దర్శకుడు ప్రశాంత్ ఆర్ విహారి ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. కథ గురించి దర్శకుడు హర్ష పులిపాక చెబుతూ, ‘‘ప్రతి జీవికి అవసరమైన పంచేంద్రియాలు – చూపు, వినికిడి, రుచి, స్పర్శ, వాసన… ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ అల్లుకున్న కథతో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాం. ఐదు భావోద్వేగాల మిళితమైన చక్కటి కథ ఇది. యువతరం ఆలోచనలు, వాళ్ల దృక్పథాలకు అద్దం పట్టేలా కథ, కథనాలు ఉంటాయి” అని అన్నారు.
అడివి శేష్ ఆవిష్కరించిన ‘పంచతంత్రం’ టైటిల్ పోస్టర్
