(మార్చి 28న చిత్తూరు వి.నాగయ్య జయంతి)
మహానటుడు చిత్తూరు వి.నాగయ్య పేరు వినగానే ఆయన బహుముఖ ప్రజ్ఞ ముందుగా మనల్ని పలకరిస్తుంది. నటునిగా, గాయకునిగా, సంగీత దర్శకునిగా, రచయితగా, నిర్మాతగా, దర్శకునిగా ఇలా తనలోని ప్రతిభను చాటుకుంటూ సాగారు నాగయ్య. ఆ రోజుల్లో తెలుగునాటనే కాదు, యావద్భారతంలోనూ అంతటి ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన నటులు మరొకరు కనిపించలేదు. తెలుగు చిత్రసీమలో తొలిసారి ‘పద్మశ్రీ’ అవార్డు అందుకున్న ఘనత నాగయ్య సొంతం. మన దేశంలో ఒక్కో సినిమాకు లక్ష రూపాయల పారితోషికం పుచ్చుకున్న ఘనత కూడా ఆయనకే దక్కింది.
ఉప్పలదడియం నాగయ్య ఆయన అసలు పేరు. గుంటూరు జిల్లా రేపల్లెలో 1904 మార్చి 28న ఆయన జన్మించారు. ఆ రోజుల్లో నాటకాలు వేస్తూ అలా అలా నాగయ్య భక్తి భావంలోనూ మునిగారు. ఒకానొక దశలో యోగిగా మారాలని భావించారు. ఆ సమయంలోనే చిత్తూరు నగరంలోని ‘రామవిలాస సభ’ నాటక సమితితో ఆయనకు పరిచయం ఏర్పడింది. ఆ సంస్థలో పలు నాటకాలలో నాగయ్య నటించారు. కొన్ని స్వయంగా రాసి, దర్శకత్వం వహించి, నటించిన నాటకాలున్నాయి. నాగయ్య నాటకాలు బహుళ ప్రచారం పొందాయి. దాంతో ఆయనను అందరూ చిత్తూరు నాగయ్య అనే పిలవసాగారు. తనలోని నటునికి మరో జన్మనిచ్చిన చిత్తూరు నగరం ఇంటిపేరుగా మారడాన్ని ఆయన కూడా ఎంతగానో సంతోషిస్తూ స్వాగతించారు. ఆ సమయంలోనే టాకీ పులి హెచ్.ఎమ్.రెడ్డి, ఆయనతో పాటు బి.యన్.రెడ్డి ప్రతిభావంతులైన నటీనటుల కోసం అన్వేషించసాగారు. అలా వారికి నాగయ్య తారసపడ్డారు. ఆయన ప్రతిభాపాటవాలు తెలుసుకొని చిత్రసీమకు ఆహ్వానించారు. హెచ్.ఎమ్.రెడ్డి రూపొందించిన ‘గృహలక్ష్మి’ (1938) చిత్రంతో సినిమా రంగంలో అడుగుపెట్టారు నాగయ్య.
చిత్తూరు నాగయ్యకు బి.యన్.రెడ్డి చిత్రాలు “వందేమాతరం, సుమంగళి, దేవత, స్వర్గసీమ” వంటి చిత్రాలు నటునిగా ఎనలేని పేరు సంపాదించి పెట్టాయి. ఇక కేవీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘భక్త పోతన’ (1943) లో టైటిల్ రోల్ ధరించి భక్తిభావాన్ని జనాల్లో నాటారు. ‘భక్త పోతన’ చిత్రం ఆ రోజుల్లోనే రజతోత్సవం జరుపుకున్న చిత్రంగా చరిత్ర సృష్టించింది.
‘భక్త పోతన’ సాధించిన విజయం నాగయ్యలో ఉత్సాహం నెలకొల్పింది. దాంతో స్వీయ దర్శకత్వంలో ‘త్యాగయ్య’ చిత్రాన్ని నటించి, నిర్మించి, సంగీతం సమకూర్చారు. ఈ సినిమా విడుదలై అనూహ్య విజయాన్ని మూటకట్టుకుంది. ఈ సినిమా ప్రభావంతో ఎంతోమంది తెలుగునేలపై సంగీతం పట్ల అభిమానం పెంచుకున్నారు. ముఖ్యంగా త్యాగరాజు కీర్తనలు తెలుగునేలపై మరింత ప్రాచుర్యం పొందడానికి ఈ సినిమా ఎంతగానో దోహదపడింది. ఈ సినిమాను పండితపామర భేదం లేకుండా అందరూ ఆదరించారు. ఎందరో ఆ నాటి సంస్థానాధీశులు నాగయ్యను తమ సంస్థానాలకు ఆహ్వానించి, ఘనంగా సన్మానించారు. గజారోహణ చేశారు. అలా చిత్రసీమలో గజారోహణ అందుకున్న తొలి నటునిగా నాగయ్య నిలచిపోయారు. ఆ సినిమా తరువాత నాగయ్య కనిపిస్తే చాలు అందరూ పాదాభివందనాలు చేయడం ఆరంభించారు. ఒకానొక సమయంలో నాటి మేటి విద్యావేత్త, తరువాతి కాలంలో భారతదేశ రాష్ట్రపతిగా రాణించిన సర్వేపల్లి రాధాకృష్ణన్ కు ఎవరో పాదాభివందనం చేశారట. ఆ పక్కనే నాగయ్య కూడా ఉన్నారట. అప్పుడు “నాలాంటి వారికి పాదాభివందనం చేసే బదులు నాగయ్యగారి లాంటి వారికి ప్రణమిల్లండి. పుణ్యమైనా దక్కుతుంది” అంటూ సర్వేపల్లి రాధాకృష్ణన్ అన్నారట. ఈ విషయాన్ని ఇప్పటికీ ఆ నాటి వారు గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు.
‘త్యాగయ్య’ తరువాత కేవీ రెడ్డి దర్శకత్వంలో నాగయ్య నటించిన ‘యోగి వేమన’ విడుదలయింది. ఈ చిత్రం పోతన, త్యాగయ్య స్థాయిలో విజయం సాధించలేకపోయినా, నాగయ్య నటన జనాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాను చూసిన ఓ బాలుడు బాలయోగిగా మారి తరువాత లక్షలాదిమందితో పూజలు అందుకున్నారు. దీనిని బట్టే నాగయ్య నటనలోని మహత్తు ఏమిటో అర్థం చేసుకోవచ్చు.
తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలోనూ నాగయ్య నటించి మెప్పించారు. చేతికి ఎముక లేకుండా దానధర్మాలు చేసిన నాగయ్య, తరువాతి రోజుల్లో ఆర్థికంగా ఇబ్బందులు పడ్డారు. వాటిని అధిగమించడానికి అన్నట్టు తన స్థాయికి తగని పాత్రల్లోనూ నటించాల్సి వచ్చింది. ఏది ఏమైనా తెలుగు చిత్రసీమలో నటునిగా నాగయ్య వేసిన ముద్ర మరచిపోలేనిది. మరపురానిది. ఇప్పటికీ ఆయన స్థానాన్ని మరెవ్వరూ భర్తీ చేయలేకపోయారు.
