NTV Telugu Site icon

Master Movie: పాతికేళ్ళ ‘మాస్టర్’!

Master

Master

Master Movie: ‘మాస్టర్’ సినిమా టైటిల్ చూస్తే, ఈ తరం వాళ్ళు అది తమిళ హీరో విజయ్ సినిమా అనుకుంటారేమో! కానీ, పాతికేళ్ళ క్రితం మెగాస్టార్ చిరంజీవి హీరోగా రూపొందిన ‘మాస్టర్’ సినిమా ఘనవిజయం సాధించింది. తెలుగునాట ‘మాస్టర్’ అంటే చిరంజీవి అనే ఈ నాటికీ అభిమానులు ఆనందిస్తూ ఉంటారు. 1996లో కథల ఎంపిక కోసం కాసింత గ్యాప్ తీసుకున్న చిరంజీవి, 1997లో సంక్రాంతి కానుకగా వచ్చిన ‘హిట్లర్’తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ పైకి వచ్చి ఫ్యాన్స్ ను పరవశింప చేశారు. అదే యేడాది చిరంజీవి ‘మాస్టర్’ అక్టోబర్ 3న జనం ముందు నిలచింది. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించిన ఈ చిత్రానికి సురేశ్ కృష్ణ దర్శకత్వం వహించారు.

ఇంతకూ ఈ ‘మాస్టర్’ కథ ఏమిటంటే- క్రమశిక్షణకు ప్రాణమిచ్చే కాలేజ్ ప్రిన్సిపల్ జనార్దన రావు. తన కాలేజ్ లో కుర్రాళ్ళు మంచి మార్గంలో నడిచేందుకు, వారిని సక్రమంగా సాగేందుకు రాజ్ కుమార్ అనే తెలుగు లెక్చరర్ ను తీసుకు వస్తాడు. రాజ్ కుమార్ కాలేజ్ స్టూడెంట్స్ తో ఎంతో బాగా కలసిపోతాడు. కుర్రాళ్ళకు ఏ కష్టం వచ్చినా ముందుండి వారికి సాయం చేస్తూంటాడు రాజ్ కుమార్ మాస్టర్. దాంతో అతనంటే అందరికీ అభిమానం పెరుగుతుంది. కాంచన అనే అమ్మాయి అతడిని పెళ్ళాడాలనీ ఆశిస్తుంది. అందుకు రాజ్ కుమార్ అంగీకరించడు. ఆమెకు అర్థం కావాలని తన గతం గురించి చెబుతాడు రాజ్ కుమార్. అతను ఢిల్లీలో చదువుతున్న రోజుల్లో జనార్దనరావు కూతురు ప్రీతిని ప్రేమించి ఉంటాడు. ప్రీతిని విక్రమ్ అనేవాడు కూడా ప్రేమిస్తాడు. ప్రీతి తన ప్రేమను అంగీకరించలేదని విక్రమ్ ఆమెను చంపేస్తాడు. రాజ్ కుమార్ వాడిని చంపేసి జైలుకు వెళతాడు. ఐదేళ్ళు శిక్ష అనుభవించి లెక్చరర్ గా వస్తాడు. తన గతం వివరించి, తాను ప్రీతిని తప్ప వేరెవ్వరినీ ప్రేమించలేననీ చెబుతాడు. తరువాత ఓ రోజు విక్రమ్ అన్న డి.ఆర్. అనేవాడు రాజ్ కుమార్ ను చూస్తాడు. అదే కాలేజ్ లో చదివే ఓ కుర్రాడు డి.ఆర్. కూతురును ప్రేమించి ఉంటాడు. వాడికి వార్నింగ్ ఇవ్వడానికి వచ్చిన డి.ఆర్. ను రాజ్ కుమార్ అక్కడ నుండి వెళ్ళమని చెబుతాడు. వాడు ఎలాగైనా మాస్టర్ ను చంపాలని నిశ్చయించుకుంటాడు. అయితే రాజ్ కుమార్ ను ఏ మాత్రం వదలుకోవడానికి ఇష్టం లేని అతని గురువు జానర్దనరావు మరోమారు డి.ఆర్.తో గొడవపడవద్దని మాట తీసుకుంటాడు. కానీ, తన స్టూడెంట్ భవిష్యత్ కోసం డి.ఆర్.తో తలపడతాడు. అదే సమయంలో తాను చంపానని భావిస్తున్న డి.ఆర్. తమ్ముడు విక్రమ్ బ్రతికే ఉన్నాడనీ రాజ్ కుమార్ కు తెలుస్తుంది.డి.ఆర్.కూతురుకు బలవంతపు పెళ్ళి జరిపిస్తూ ఉంటే, వెళ్ళి, వాడిని వాడి తమ్ముడిని చంపేస్తాడు. ప్రేమికులకు పెళ్ళి జరిపిస్తాడు. మళ్ళీ కోర్టు రాజ్ కుమార్ కు ఐదేళ్ళు శిక్ష విధిస్తుంది. ఐదేళ్ళ తరువాత విడుదలైన రాజ్ కుమార్ స్టూడెంట్స్ లో చాలామంది అతని స్ఫూర్తితోనే మంచి ఉద్యోగాలు సంపాదించి ఉంటారు. వారందరూ తమ మాస్టర్ కు వెల్ కమ్ చెబుతారు. మాస్టర్ కు కారు గిఫ్ట్ గా ఇస్తారు. కారులో కాంచన కూర్చొని ఉంటుంది. తాను కెమిస్ట్రీ లెక్చరర్ గా పనిచేస్తున్నానని చెబుతుంది. ఆమె అభ్యర్థనను కాదనకని జనార్దనరావు అంటాడు. వారిద్దరి చేతులు కలిపి ఆశీర్వదిస్తారు జనార్దనరావు. అలా కథ సుఖాంతమవుతుంది.

ఈ చిత్రంలో సాక్షి శివానంద్, రోషిణి, విజయ్ కుమార్, పునీత్ ఇస్సార్, సత్యప్రకాశ్, శివాజీ, వేణుమాధవ్, ఉత్తేజ్, తిరుపతి ప్రకాశ్, బండ్ల గణేశ్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి కథను భూపతిరాజా సమకూర్చగా, సత్యానంద్ సంభాషణలు పలికించారు. దేవా స్వరకల్పనలో సీతారామశాస్త్రి, చంద్రబోస్ పాటలు రాశారు. “తమ్ముడు ఒరె తమ్ముడు…” అంటూ సాగే పాటను సీతారామశాస్త్రి పలికించగా, చిరంజీవి తొలిసారి గాయకునిగా ఈ గీతాన్ని ఆలపించారు. మిగిలిన నాలుగు పాటలనూ చంద్రబోస్ రాశారు. “ఇంటిలోకి వెల్కమంటూ గేట్ తీసినాడే మాస్టర్…”, “తిలోత్తమా…”, “బావున్నారా బావున్నారా…”, “బియస్సీ అయినాగానీ…” అని సాగిన పాటలు ఫ్యాన్స్ ను అలరించాయి. ఈ సినిమా ద్వారా భూపతి రాజాకు బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ గా నంది అవార్డు లభించింది. డి.టి.యస్. లో రూపొందిన తొలి తెలుగు చిత్రంగా ‘మాస్టర్’ నిలచింది. అనేక కేంద్రాలలో ‘మాస్టర్’ శతదినోత్సవం జరుపుకుంది. విజయవాడ – రాజ్ లో ఈ సినిమా డైరెక్ట్ సిల్వర్ జూబ్లీ జరుపుకోవడం విశేషం! ఈ సినిమాలో గాయకునిగా పరిచయమైన చిరంజీవి ‘మృగరాజు’లోనూ “ఛాయ్ చటుక్కున తాగరా భాయ్…” అనే పాటను పాడారు. ఈ చిత్రం తరువాత చిరంజీవితో దర్శకుడు సురేశ్ కృష్ణ, అల్లు అరవింద్ నిర్మించిన ‘డాడీ’ చిత్రానికి దర్శకత్వం వహించారు.