Chiranjeevi: వయసు పెరిగినా ఎనర్జీ తగ్గని మెగాస్టార్… 71 ఏళ్ల వయసులోనూ ఫిట్‌నెస్ తో అదరగొడుతున్న ‘కాకా’

Chiranjeevi 2 300kb

Chiranjeevi 2 300kb

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో చిరంజీవి పేరు ఒక శకం. ఏడు పదుల వయసుకు చేరుకున్నా ఆయనలోని ఎనర్జీ, డ్యాన్స్‌పై ఉన్న పట్టు, యాక్షన్ సీక్వెన్స్ లో కనిపించే చురుకుదనం ఇప్పటికీ అభిమానులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. ఆగస్టు 22న 71వ పుట్టినరోజు జరుపుకున్న మెగాస్టార్‌కు సినీ ప్రముఖులు, అభిమానుల నుంచి భారీగా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. అయితే ఈ వయసులోనూ ఆయన ఇంత ఫిట్‌గా ఎలా ఉంటున్నారు అనేది ఇప్పుడు మరోసారి చర్చగా మారింది. ముఖ్యంగా వరుసగా యాక్షన్ సినిమాలు చేస్తూ, యాక్షన్ సీక్వెన్స్ పాత్రలకు సిద్ధమవుతున్న చిరంజీవి ఫిట్‌నెస్ విషయంలో ఎంత క్రమశిక్షణ పాటిస్తున్నారో ఆయన సోషల్ మీడియా పోస్టులు చెప్పాల్సింది స్పష్టంగా చెబుతున్నాయి.

చిరంజీవి ఫిట్‌నెస్ రొటీన్‌ను గమనిస్తే అందులో వెయిట్ ట్రైనింగ్‌కు ప్రత్యేక స్థానం ఉన్నట్లు కనిపిస్తుంది. డంబెల్స్, బార్బెల్స్‌తో ఆయన చేసే వ్యాయామాలకు సంబంధించిన వీడియోలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చేతులు, భుజాలు, ఛాతీ వంటి కండరాలపై పనిచేసే రెసిస్టెన్స్ ఎక్సర్‌సైజ్‌లతో పాటు శరీరాన్ని చురుకుగా ఉంచే కండిషనింగ్ వర్కౌట్స్ కూడా ఆయన రొటీన్‌లో కనిపిస్తాయి. వయసు పెరిగే కొద్దీ శరీరంలో సహజంగా వచ్చే మార్పులను ఎదుర్కోవడానికి బాడి ఫిట్ నెస్ ఎంత ముఖ్యమో ఆయన లైఫ్ స్టైల్ ఒక ఉదాహరణగా నిలుస్తోంది. 60 ఏళ్లు దాటిన తర్వాత బరువును కంట్రోల్ చేయడమే కాకుండా, మెటబాలిక్ ఆరోగ్యాన్ని కాపాడుకోవడం కూడా ముఖ్యమని వైద్య నిపుణులు చెబుతున్నారు. వయసు పెరగడం సహజమే అయినప్పటికీ శరీర సామర్థ్యం అదే స్థాయిలో తగ్గిపోవాల్సిన అవసరం లేదనే విషయాన్ని చిరంజీవి ఫిట్‌నెస్ జర్నీ గుర్తుచేస్తోంది. ఇక చిరంజీవి కూడా తన ఫిట్‌నెస్‌పై ఎన్నో సందర్భాల్లో స్పందించారు. ఇదే క్రమశిక్షణ ఆయన సినిమాల్లో కనిపించే ఎనర్జీకి కూడా కారణంగా మారుతోంది.

ప్రస్తుతం చిరంజీవి బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘కాకా’ కోసం సిద్ధమవుతున్నారు. గతంలో ఈ ప్రాజెక్ట్‌ను ‘మెగా158’ అనే వర్కింగ్ టైటిల్‌తో పిలిచారు. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాలో చిరంజీవి సత్యం అనే పాత్రలో కనిపించనున్నారు. ఆక్వా ఇండస్ట్రీలో సూపర్‌వైజర్‌గా పనిచేసే వ్యక్తికి సంబంధించిన కథగా ఈ సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. అయితే ఇందులో అతని గతం మరో కోణంలో ఉండనున్నట్లు తెలుస్తోంది. ‘కాకా’ 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. అంటే 71 ఏళ్ల వయసులోనూ చిరంజీవి ఇంకా శారీరకంగా డిమాండ్ చేసే పాత్రలను ఎంచుకుంటూ ముందుకు సాగుతున్నారు. అందుకే ఆయన ఫిట్‌నెస్ ఇప్పుడు కేవలం అభిమానులకు స్ఫూర్తినిచ్చే అంశం మాత్రమే కాదు.. వయసు పెరిగిన తర్వాత కూడా శరీరాన్ని చురుకుగా ఉంచుకోవాలనుకునే ప్రతి ఒక్కరికీ ఒక ఉదాహరణగా మారుతోంది.