Chiranjeevi Denies Those Remake Rumours: మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కీలక పాత్ర పోషించిన ‘భీష్మ పర్వం’ మూవీ మల్లూవుడ్ లో సరికొత్త రికార్డులు సృష్టించింది. అమల్ నీరద్ దర్శకత్వం వహించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ తెలుగులో చిరంజీవి హీరోగా రీమేక్ కాబోతోందనే ప్రచారం గత కొంతకాలంగా జరుగుతోంది. అయితే దీనిని చిరంజీవి ఖండించారు. ‘భీష్మ పర్వం’ మూవీ రీమేక్ ఆలోచన తనకు లేదని, అలాంటి ప్రపోజల్ కూడా తన దగ్గరకు రాలేదని తెలిపారు. అలానే ‘బ్రో డాడీ’ మూవీ రీమేక్ గురించి తనతో ఆ చిత్ర దర్శకుడు, నటుడు పృథ్వీరాజ్ గతంలో చర్చించాడని, కానీ అలాంటి థిన్ లైన్ సబ్జెక్ట్ ను తన లాంటి నటుడు చేయడం సముచితం కాదని భావించి, సున్నితంగా తిరస్కరించానని అన్నారు.
ఇదిలా ఉంటే… చిరంజీవి తాజా చిత్రం ‘గాడ్ ఫాదర్’ మాతృక ‘లూసిఫర్’ను తెరకెక్కించింది పృథ్వీరాజే. ఇప్పుడు అతను ‘లూసిఫర్’కు ప్రీక్వెల్ ప్లాన్ చేస్తున్నాడు. దానిని ఎలా చిత్రీకరించాలనుకుంటోంది కూడా పృథ్వీరాజ్ తనతో చర్చించాడని, ఆ ప్రాజెక్ట్ ఎంతో ఆసక్తికరంగా ఉందని, అన్నీ అనుకూలిస్తే… ‘లూసిఫర్’ ప్రీక్వెల్ గురించి ఆలోచిస్తానని, ఏది ఏమైనా… వచ్చే మార్చి నెల వరకూ ఇప్పటికే కమిట్ అయిన సినిమాలను పూర్తి చేయాల్సి ఉంటుందని చిరంజీవి ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.
