ప్రముఖ సినీ నటుడు, మెగాస్టార్ కొణిదెల చిరంజీవికి అనుకూలంగా హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలకమైన అడ్-ఇంటరిమ్ ఇంజంక్షన్ (మధ్యంతర ఉత్తర్వులు)ను మంజూరు చేశారు. ఈ ఉత్తర్వు చిరంజీవి వ్యక్తిత్వ, ప్రచార హక్కుల ఉల్లంఘనను నిషేధిస్తూ, అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటోలు, వాయిస్, ఇతర ప్రత్యేక లక్షణాలను వాణిజ్య ప్రయోజనాల కోసం వినియోగించడాన్ని తక్షణమే నిలిపి వేయనుంది.
కోర్టు ఉత్తర్వుల ముఖ్యాంశాలను పరిశీలిస్తే
26 సెప్టెంబర్ 2025 తేదీ నాటి I.A. No.6275 of 2025 in O.S. No.441 of 2025లో జారీ చేసిన ఈ ఉత్తర్వు ద్వారా, పిటిషన్‌లో పేరు పొందిన 33 మంది ప్రతివాదులతో పాటు జాన్ డో (ఎవరైనా వ్యక్తి/ఏ సంస్థైనా)కు ఈ నిషేధం వర్తిస్తుంది.
నిషేధ పరిధి: చిరంజీవి పేరు, స్టేజ్ టైటిల్స్ (ఉదా: “MEGA STAR”, “CHIRU”, “ANNAYYA”), వాయిస్, ఫోటో (ఫొటో) లేదా ఆయనకు మాత్రమే ప్రత్యేకమైన ఇతర వ్యక్తిత్వ లక్షణాలను ఏ రూపంలోనైనా, ఏ మాధ్యమంలోనైనా, వ్యక్తిగత లేదా వాణిజ్య లాభం కోసం అనుమతి లేకుండా ఉపయోగించటంపై నిషేధం.
* AI దుర్వినియోగంపై ప్రత్యేక దృష్టి: ముఖ్యంగా, కృత్రిమ మేధస్సు (AI) ద్వారా మార్ఫ్ చేసిన ఫోటోలు, వీడియోలను ప్రచారం చేయడం, అలాగే ఆన్‌లైన్ ప్లాట్‌ఫార్మ్స్ వేదికలపై అనుమతి లేని వినియోగాన్ని ఆపేందుకు కోర్టు జోక్యం కోరారు. ఈ క్రమంలో నలభై ఏళ్లకు పైగా చలనచిత్ర రంగంలో విశిష్ట సేవలందించిన చిరంజీవి ఖ్యాతి, గౌరవానికి ప్రతివాదుల ఉల్లంఘనలు నష్టం కలిగిస్తున్నాయని కోర్టు గుర్తించింది. డిజిటల్, AI ద్వారా జరిగే వాణిజ్యపు దోపిడి, తప్పుడు ప్రతి సృష్టి వల్ల అపరిమిత నష్టం సంభవించే ప్రమాదాన్ని కోర్టు పరిగణించింది.
ఈ ఉత్తర్వుల ద్వారా, TRPs కోసం, వ్యూస్ కోసం చిరంజీవి వ్యక్తిత్వ లక్షణాలను అనుమతి లేకుండా ఉపయోగించినా, తప్పుగా వక్రీకరించినా కఠినమైన పరిహారాలు అమలు చేయబడతాయని కోర్టు స్పష్టంగా హెచ్చరించింది. టెలివిజన్ ఛానళ్లు, డిజిటల్ ప్లాట్‌ఫార్ములు, మీడియా సంస్థలు సహా అందరూ దీనికి కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు. ఈ ఉత్తర్వుల అనంతరం మెగాస్టార్ చిరంజీవి గారు అక్టోబర్ 11న హైదరాబాద్ పోలీసు కమిషనర్ వి.సి. సజ్జనార్ ని కలసి కోర్టు ఉత్తర్వుల ప్రతిని అందజేశారు. తదుపరి విచారణ అక్టోబర్ 27, 2025కు వాయిదా పడింది.
