Chiranjeevi: ‘వాల్తేరు వీరయ్య’ మూవీ ప్రమోషన్ లో భాగంగా ప్రింట్ అండ్ వెబ్ మీడియాతో చిరంజీవి బుధవారం ఉదయం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ‘ఆర్.ఆర్.ఆర్.’మూవీలోని ‘నాటు నాటు…’ సాంగ్ కు గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ రావడంపై ఆయన స్పందించారు. చిరంజీవి మాట్లాడుతూ, ”ఈ రోజు నిద్ర లేవడం తోనే ఓ హుషారైన న్యూస్ తో నా డే మొదలైంది. అది ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ గర్వపడేలాగా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ ‘ఆర్ ఆర్ ఆర్’ కోసం కీరవాణి గారు కంపోజ్ చేసిన సాంగ్ కు రావడం అందరూ గర్వపడే విషయం. వాళ్ళందరికీ ఉదయమే ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలిపాను. మరోసారి మీడియా ద్వారా వారికి మరోసారి నా అభినందనలు తెలియచేస్తున్నాను. కీరవాణి గారికి, రాజమౌళి గారికి, దానయ్య గారికి, గీత రచయిత చంద్రబోస్ కు, గాయకులకు ఆ పాటకు అద్భుతంగా నర్తించి వావ్ అనిపించిన తారక్ అండ్ చరణ్ కూ అభినందనలు. దిస్ ఈజ్ వెరీ ప్రౌడ్ మూమెంట్, ముఖ్యంగా నాకు” అని అన్నారు.
”మీ అబ్బాయి చిత్రానికి అవార్డు వచ్చి, మీకు రాకపోవడం పట్ల ఏమైనా అసంతృప్తితో ఉన్నారా?” అనే ప్రశ్నకు చిరంజీవి చిరునవ్వుతో బదులిస్తూ, ”నిజానికి ఈ క్షణం వరకూ ఈ అవార్డు నాకు వచ్చినట్టే భావిస్తూ ఉన్నాను. మీరు ప్రత్యేకంగా ఈ ప్రశ్న అడిగే సరికీ నిజమే కదా! వచ్చింది నాకు కాదు కదా! అని అనిపించింది. ఈ మధ్య కొందరు దర్శకులు మంచి మంచి కథలు నాకు చెబుతున్నారు. అయితే అవన్నీ కాలేజీకి వెళ్ళే స్టూడెంట్ స్టోరీస్… ఈ వయసులో నేనీ పాత్ర చేస్తే బాగుంటుందా అనే చిన్న సందేహం వాటిని వింటూ ఉంటే నాకు వస్తుండేది. అయితే అంతా అయిన తర్వాత ‘ఇది మీ కోసం రాసిన కథ కాదు సార్… చరణ్ కోసం’ అని చెప్పగానే… నాలిక కరుచుకుంటాను. ఎప్పుడైనా ఏ విషయంలో అయినా నా ఇన్వాల్వ్ మెంట్ అంత ఉంటుంది” అని సరదాగా బదులిచ్చారు చిరంజీవి.