నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా తెరకెక్కుతున్న యూనిక్ స్పై డ్రామా చిత్రానికి సంబంధించిన బిగ్ అప్‌డేట్ బయటికొచ్చింది. అక్కి విశ్వనాధ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా శరవేగంగా కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటివరకు ‘చైనా పీస్’ అనే ఆసక్తికర టైటిల్‌తో ప్రచారంలో ఉన్న ఈ మూవీ పేరును తాజాగా ‘సీక్రెట్ సోల్జర్’గా మారుస్తున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలను నెలకొల్పాయి. ఆకట్టుకునే ప్రెజెంటేషన్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సమపాళ్లలో యాక్షన్, హ్యూమర్ మేళవించిన ఈ సినిమా తాజాగా సెన్సార్ ప్రక్రియను కూడా దిగ్విజయంగా పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ చిత్రానికి ‘U/A 16+’ సర్టిఫికెట్ జారీ చేసింది.
మూన్ లైట్ డ్రీమ్స్ పతాకంపై నిర్మితమవుతున్న ఈ స్పై థ్రిల్లర్‌ను అన్ని పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి సెప్టెంబర్‌లో ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురావడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో నిహాల్ కోదాటి, సూర్య శ్రీనివాస్ ప్రధాన పాత్రల్లో నటిస్తుండగా, హర్షిత బండ్కమూరి, కమల్ కామరాజు, తులసి, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. కథకు తగ్గట్టుగా ప్రముఖ సాంకేతిక నిపుణులు ఈ ప్రాజెక్ట్ కోసం పనిచేశారు. కొత్త తరహా స్పై కాన్సెప్ట్‌తో వస్తున్న ‘సీక్రెట్ సోల్జర్’ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయి సంచలనం సృష్టిస్తుందో చూడాలి!

