ప్రస్తుతం సినిమాలకు యువత రాజపోషకులని పలువురి అభిప్రాయం. యువత ఏ చిత్రాన్నైనా తొలి రోజు, మొదటి ఆట చూడాలని తపిస్తుంది, నిజమే! కానీ, ఇంటిల్లి పాదిని సినిమాకు తీసుకు రాగల సత్తా ఒక్క బాలలకే ఉంది. ఇది ఈ నాటి నిజం కాదు! బాలలను ఆకట్టుకోవడం వల్లే అనేక చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా భారీ విజయాలు మూటకట్టుకోగలిగాయి. ఇక బాలలను ఆకర్షించే అంశాలతో తెరకెక్కిన చిత్రాలు మరింతగా వసూళ్ళ వర్షం కురిపించాయి. ఈ మధ్య విజయాలను తరచిచూచినా, అందులో ఏదో ఒక విధంగా బాలలను ఆకర్షించే అంశాలు ఉన్నాయని అంగీకరించక తప్పదు. మన తెలుగు సినిమాను తీసుకుంటే, బాలలను విశేషంగా అలరించే జానపద కథతో తెరకెక్కిన ‘బాహుబలి’ సిరీస్ సాధించిన విజయం ఏ స్థాయిదో చెప్పక్కర్లేదు. మన తెలుగు సినిమాను ప్రపంచ యవనికపై నిలిపిన చిత్రంగా ‘బాహుబలి’ జేజేలు అందుకుంది. ఇక ప్రపంచవ్యాప్తంగా బాలలను విశేషంగా అలరించిన ‘హ్యారీ పోటర్’ నవలలు, వాటి ఆధారంగా తెరకెక్కిన చిత్రాలు ఏ రీతిన మురిపించాయో తెలిసిందే. జానపద కథ ఆధారంగానే తెరకెక్కిన ‘లార్డ్ ఆఫ్ ద రింగ్స్’, పిల్లలను ఇట్టే పట్టేసిన జేమ్స్ కేమరాన్ ‘అవతార్’, ‘అవెంజర్స్’ ‘లయన్ కింగ్’, ‘స్టార్ వార్స్’… ఇలా చెప్పుకుంటూ పోతే పిల్లలను విశేషంగా ఆకర్షించిన చిత్రాల జాబితా చేంతాడంత అవుతుంది.
మన తెలుగులో….
మన తెలుగు సినిమా విషయానికి వస్తే, మహానటులు చిత్తూరు నాగయ్య, యన్టీఆర్, ఏయన్నార్ మొదలు, తరువాతి తరం హీరోలు కృష్ణ, శోభన్ బాబు, కృష్ణంరాజు, ఆ పై వచ్చిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేశ్ చిత్రాలలోనూ బాలలను ఆకర్షించే అంశాలున్నవే బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయి. నాగయ్య హీరోగా రూపొందిన ‘భక్త పోతన’లో పోతన కూతురు ముద్దు ముద్దు మాటలు, పోతన పద్యాల తీయదనం బాలలను విశేషంగా అలరించాయి. అలాగే నాగయ్య ‘త్యాగయ్య’లోని భక్తి గీతాలను ఆ రోజుల్లో తమ పిల్లలచేత భట్టీయం వేయించారు పెద్దవాళ్ళు. అలా ఆ రెండు చిత్రాలు జనాన్ని ఎంతగానో మురిపించాయి. ఇక జెమినీ వారి ‘బాలనాగమ్మ’లో బాలవర్ధి రాజు చేసే సాహసాలు పిల్లలను విశేషంగా అలరించాయి. యన్టీఆర్ ను సూపర్ స్టార్ గా నిలిపిన ‘పాతాళభైరవి’లో అయితే బాలలను ఆకర్షించే అంశాలు ఎన్నో ఉన్నాయి. అంతకు ముందు ఏయన్నార్ ను జానపద నాయకునిగా నిలిపిన ‘బాలరాజు, కీలుగుర్రం’లోనూ పిల్లలను మురిపించిన బోలెడు అంశాలున్నాయని చెప్పవచ్చు.
ఇక రామారావు పౌరాణిక చిత్రాలలోని కథ, కథనాలు, పద్యాలు బాలలను విశేషంగా ఆకట్టుకొనేవి. ముఖ్యంగా పౌరాణిక గాథలు పాఠ్యాంశాలుగా ఉండడం వల్ల యన్టీఆర్ నటించిన “నర్తనశాల, పాండవవనవాసము, శ్రీకృష్ణ పాండవీయం, దానవీరశూర కర్ణ” వంటి చిత్రాలను బాలలు పదే పదే చూసేలా చేశాయి. ఆయన జానపద చిత్రాలు “పాండురంగ మహాత్యం, జగదేకవీరుని కథ, భట్టి విక్రమార్క, పరమానందయ్య శిష్యుల కథ, బందిపోటు, గండికోట రహస్యం” తదితరాలు కూడా పిల్లలను థియేటర్లకు పరుగు తీసేలా చేశాయి. యన్టీఆర్ “రాము, ఉమ్మడి కుటుంబం, కథానాయకుడు, అడవిరాముడు” వంటి చిత్రాలలోనూ చైల్డ్ సెంటిమెంట్, బాలలను ఆకట్టుకొనే అంశాలు పుష్కలంగా ఉన్నాయి. అందువల్లే సదరు చిత్రాలు బ్లాక్ బస్టర్స్ గా నిలిచాయనీ చెప్పవచ్చు. అలాగే ఏయన్నార్ హిట్ మూవీస్ “చెంచులక్ష్మి, సువర్ణసుందరి, దసరా బుల్లోడు” లోనూ బాలలను మురిపించే అంశాలు చోటు చేసుకున్నాయి
తరువాతి తరం హీరో కృష్ణ యాక్షన్ మూవీస్ లో గుర్రంపై వస్తూ, పిస్తోల్ తో విలన్లను జడిపిస్తూ సాగడం పిల్లలను కట్టి పడేసింది. అలా ‘మోసగాళ్ళకు మోసగాడు’ వంటి యాక్షన్ థ్రిల్లర్స్ తో పాటు “పండంటి కాపురం, మాయదారి మల్లిగాడు” వంటి కుటుంబకథాచిత్రాలూ బాలలను థియేటర్లకు పరుగులు తీసేలా చేశాయి. శోభన్ బాబు “సిసింద్రీ చిట్టిబాబు, మంచి మనుషులు” వంటి సినిమాలు ఆయనను బాలలకు చేరువ చేశాయి. చిరంజీవి ‘పసివాడి ప్రాణం’, బాలకృష్ణ ‘ముద్దుల మావయ్య’, వెంకటేశ్ ‘బొబ్బిలిరాజా’, నాగార్జున ‘సిసింద్రీ’ సినిమాల్లోనూ బాలలను మురిపించిన అంశాలు ఉన్నాయి. ఇలా చెప్పుకుంటూ పోతే నవతరం హీరోలు సైతం పిల్లలను ఆకర్షించే అంశాలు తమ చిత్రాలలో చోటు చేసుకొనేలా చూస్తున్నారు. ఎటు చూసినా టిక్కెట్స్ బాగా తెగాలంటే బాలలను థియేటర్లకు రప్పించాలి అన్నదే అసలు సూత్రంగా నిలచింది.
కరోనా ప్యాండమిక్ కారణంగా ఇల్లే పదిలం అయింది. దాంతో థియేటర్లకు జనం రావడం తగ్గింది. ఈ నేపథ్యంలో ఓటీటీల్లో బాలలు తమకు నచ్చిన చిత్రాలకు అడిక్ట్ అయిపోయారు. కావున, రాబోయే రోజుల్లో మళ్ళీ థియేటర్లకు బాలలు రావాలి అంటే, వారిని ఆకట్టుకొనే కథాంశాలతో చిత్రాలను రూపొందించి తీరాలి.
బాలలకు సినిమాలపై అవగాహన కలిగించే నిమిత్తమై మన కేంద్రప్రభుత్వం నవంబర్ 14న ‘బాలలదినోత్సవం’ సందర్శాన్ని పురస్కరించుకొని ‘అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవం’ నిర్వహించేది. ప్రతి రెండేళ్ళ కొకసారి జరిగే ఈ అంతర్జాతీయ బాలల చలనచిత్రోత్సవాలకు ఒకప్పుడు మన హైదరాబాద్ నగరాన్నే శాశ్వత వేదికగా నిర్ణయించారు. ఈ చిత్రోత్సవాలు 2017 వరకు ఇక్కడే జరిగాయి. తరువాత గోవాలో జరుపుతామన్నారు. కానీ, అది ఎందుకనో కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు కరోనా అడ్డు వచ్చింది. మరి అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాలు మళ్ళీ ఎప్పుడు ఊపందుకుంటాయో? అదీగాక మన దేశంలో బాలల చిత్ర నిర్మాణం కూడా బాగా తగ్గిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో బాలలను అలరించడానికి మన స్టార్ హీరోసే తమ చిత్రాలలో వారిని ఆకట్టుకొనే అంశాలకు ప్రాధాన్యమిస్తూ సినిమాలు తెరకెక్కిస్తే బాగుంటుంది. ఈ విషయంలో స్టార్ హీరోస్ ఓ సారి ఆలోచిస్తే మరింత బాగు!
