ARYA : తమిళ హీరో ఆర్యపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు

Arya Cheating

Arya Cheating

ప్రముఖ తమిళ నటుడు ఆర్యపై హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో చీటింగ్ కేసు నమోదైంది. సినిమా షూటింగ్ నిమిత్తం అద్దెకు తీసుకున్న అత్యాధునిక కెమెరాలు, లైటింగ్ పరికరాలకు సంబంధించిన రూ. 1.80 కోట్లకు పైగా బకాయిలను చెల్లించకుండా మోసానికి పాల్పడ్డారంటూ సదరు సంస్థ పోలీసులను ఆశ్రయించింది.పోలీసుల కథనం ప్రకారం.. ఆర్య కథానాయకుడిగా నటిస్తున్న ‘అనంతన్ కాడు’ అనే మలయాళ చిత్ర చిత్రీకరణ కోసం గతేడాది ఫిబ్రవరిలో చిత్రబృందం జూబ్లీహిల్స్ వెంకటగిరి పరిధిలోని హైలాంకాలనీకి చెందిన ‘తాహెర్ సినీ టెక్నిక్’ సంస్థ నుండి షూటింగ్ కోసం డిజిటల్ కెమెరాలు, లైటింగ్ యూనిట్లను అద్దెకు తీసుకున్నారు.

దీంతో సదరు సంస్థ తన స్వంత ఖర్చులతో షూటింగ్ పరికరాలను హైదరాబాద్ నుండి కేరళలోని షూటింగ్ కు తరలించింది. మొత్తం రూ. 2.12 కోట్ల అద్దెకు గానూ.. షూటింగ్ పూర్తయిన తర్వాత మెజారిటీ వాటా అయిన రూ. 1.80 కోట్లకు పైగా బకాయిలను నటుడు ఆర్య, నిర్మాత వినోద్ చెల్లించలేదు. సినిమా విడుదలకు ముందే మొత్తం బకాయిలు చెల్లించి ‘నో డ్యూస్ సర్టిఫికేట్’ తీసుకుంటామని లిఖితపూర్వకంగా అంగీకరించినప్పటికీ, చిత్రబృందం ఆ మాట నిలబెట్టుకోలేదని బాధితులు పేర్కొన్నారు. బకాయిల చెల్లింపు విషయమై పలుమార్లు ఫోన్ కాల్స్, వాట్సప్ సందేశాల ద్వారా సంప్రదించినా స్పందించలేదని, పైగా బాకీ డబ్బులు అడిగిన తమ సంస్థ మేనేజర్‌ను నటుడు ఆర్య, నిర్మాత వినోద్, ఆర్య వ్యక్తిగత సహాయకుడు కిశోర్ కలిసి బెదిరింపులకు గురిచేశారని సంస్థ అకౌంటెంట్ జావేద్ అలీ తన ఫిర్యాదులో ఆరోపించారు. వాస్తవాలను కప్పిపుచ్చి కేరళలోని న్యాయస్థానం నుండి వీరు మధ్యంతర ఉత్తర్వులు కూడా పొందినట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేశారు.