NTV Telugu Site icon

40 ఏళ్ళ ‘చట్టానికి కళ్ళు లేవు’

అప్పటి దాకా సైడ్ హీరోగానూ, విలన్ గానూ, బిట్ రోల్స్ లోనూ, స్పెషల్ అప్పియరెన్స్ తోనూ సాగిన చిరంజీవి కొన్ని చిత్రాలలో హీరోగానూ అలరించారు. నటునిగా చిరంజీవికి 36వ చిత్రం ‘చట్టానికి కళ్ళు లేవు’. హీరోగా 16వ సినిమా అది. తమిళంలో విజయ్ కాంత్ ను స్టార్ హీరోగా నిలిపిన ‘సట్టమ్ ఒరు ఇరుట్టారై’ ఆధారంగా ‘చట్టానికి కళ్ళు లేవు’ తెరకెక్కింది. తమిళంలో దర్శకత్వం నెరపిన ఎస్.ఏ.చంద్రశేఖర్ దర్శకత్వంలోనే ‘చట్టానికి కళ్ళు లేవు’ రూపొందింది. 1981వ సంవత్సరం చిరంజీవికి బాగా అచ్చివచ్చిందనే చెప్పాలి. ఆ యేడాది ఆయన నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించిన ‘న్యాయం కావాలి’ మంచి విజయం సాధించి, రజతోత్సవం చూసింది. అలాగే ఈ ‘చట్టానికి కళ్ళు లేవు’ కూడా రజతోత్సవం జరుపుకుంది. ఆ సంవత్పరం యన్టీఆర్, ఏయన్నార్ తరువాత రెండు సిల్వర్ జూబ్లీస్ చూసిన నటుడిగా చిరంజీవి నిలిచారు. 1981 అక్టోబర్ 30న విడుదలైన ‘చట్టానికి కళ్ళు లేవు’ చిత్రం తెలుగువారిని విశేషంగా అలరించింది.

‘చట్టానికి కళ్ళు లేవు’ కథ ఏమిటంటే – విజయ్, అతని అక్క దుర్గ చిన్నతనంలోనే ముగ్గురు దుర్మార్గుల కారణంగా తండ్రిని, అక్కను కోల్పోతారు. దాంతో వారిని ఎలాగైనా శిక్షించి కక్ష సాధించాలని భావిస్తారు. దుర్గ పోలీస్ ఇన్ స్పెక్టర్ అవుతుంది. తన తండ్రిని, అక్కను పొట్టన పెట్టుకున్నవారిని చట్టానికి పట్టించాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అయితే ఆమె తమ్ముడు విజయ్ మాత్రం చట్టాన్ని నమ్ముకుంటే పగసాధించలేమని భావిస్తాడు. దాంతో ఉపాయం పన్ని ఆ ముగ్గురిలో ఇద్దరు వారికి వారు చచ్చేలా చేస్తాడు. ఈ ప్లాన్ లో ఓ సారి విజయ్ కి సహాయం చేసిన అతని మిత్రుడు రంగ కన్నుమూస్తాడు. విజయ్, డాన్సర్ రేఖ ప్రేమించుకుంటారు. ఆమె కూడా అతనికి సాయపడుతుంది. అయితే చట్టాన్నే నమ్ముకున్న దుర్గ కొన్నిసార్లు తమ్ముడు తప్పు దారిలో పడుతున్నాడని, అతణ్ణి కూడా చట్టానికి పట్టించాలని చూస్తుంది. ముగ్గురిలో మిగిలిన దుర్మార్గుడు ఆమెనే చంపబోతే, విజయ్ వచ్చి, వాణ్ణి చంపి అక్కను రక్షించుకుంటాడు. తరువాత కూడా చట్టంపై గౌరవం చంపుకోని అక్క, తమ్ముణ్ణి చట్టానికి పట్టించాలనే చూస్తుంది. అయితే కోర్టులో సరైన సాక్ష్యాధారాలు లేని కారణంగా విజయ్ నిర్దోషిగా బయటపడతాడు. అక్కాతమ్ముడు వేరు మార్గాల్లోనే విడిపోవడంతో కథ ముగుస్తుంది.

ఈ చిత్రంలో విజయ్ గా చిరంజీవి, అతని అక్క దుర్గగా లక్ష్మి, ప్రేయసి రేఖగా మాధవి, సాయపడే మిత్రునిగా నారాయణరావు నటించారు. ముగ్గురు దుర్మార్గుల పాత్రల్లో కన్నడ ప్రభాకర్, సిలోన్ మనోహర్, హేమసుందర్ అభినయించారు. ప్రభాకర్ రెడ్డి, రమణమూర్తి, రావి కొండలరావు, పి.జె.శర్మ, సారథి, మాడా, పండరీబాయి, జయశీల ఇతర ముఖ్యపాత్రధారులు. ఈ చిత్ర దర్శకుడు ఎస్.ఏ.చంద్రశేఖర్ సతీమణి శోభ కథ రాయగా, మాటలు పాటలు మైలవరపు గోపీ రచించారు. సినిమా టైటిల్ కార్డ్స్ లో కూడా నటీనటుల కంటే ముందుగానే కథ: శోభ అని వేయడం విశేషం! అలాగే ఇంటర్వెల్ బ్రేక్ సమయంలో డైరెక్టర్ గా చంద్రశేఖర్ పేరు కనిపిస్తుంది. చక్రవర్తికి అనేక చిత్రాలకు అసోసియేట్స్ గా పనిచేసిన కృష్ణ-చక్క ఈ సినిమాకు సంగీతం సమకూర్చారు. “ఈ సొగసేం చేయను…”, “కలిసిపో కళ్ళలో… కరిగిపో కౌగిళ్ళలో…”, “ఎవ్వరికీ చెప్పొద్దూ… ఇది దేవరహస్యం…” వంటి పాటలు అలరించాయి. అన్నిటినీ మించి “చట్టానికి కళ్ళు లేవు తమ్ముడూ…” పాట భలేగా ఆకట్టుకుంది. అట్లూరి పూర్ణచంద్రరావు సమర్పణలో శ్రీకర్ ప్రొడక్షన్స్ పతాకంపై వంకినేని సత్యనారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు.

‘చట్టానికి కళ్ళు లేవు’ చిత్రం మంచి విజయం సాధించింది. ఐదు కేంద్రాలలో డైరెక్టుగా, ఓ కేంద్రంలో షిఫ్ట్ పై, మరో నాలుగు కేంద్రాలలో మ్యాట్నీలతో మొత్తం పది కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. షిఫ్టులమీద రజతోత్సవం పూర్తి చేసుకుంది. ఈ సినిమా కథతోనే హిందీలో అమితాబ్ బచ్చన్, రజనీకాంత్ తో ‘అంధా కానూన్’ రూపొందింది. కన్నడలో ‘న్యాయ ఎల్లిదే’గా, మళయాళంలో ‘మాట్టువిన్ చట్టంగలే’గా, సింహళలో ‘ఇన్ స్పెక్టర్ గీత’గా రీమేక్ అయిందీ కథ. 2012లో ‘సట్టమ్ ఒరు ఇరుట్టారై’పేరుతోనే ఓ చిత్రాన్ని ఎస్.ఏ.చంద్రశేఖర్ మనవరాలు స్నేహ బ్రిట్టో తెరకెక్కించింది. ఎస్.ఏ.చంద్రశేఖర్, ఈ చిత్ర కథారచయిత్రి శోభ తనయుడే ప్రస్తుతం తమిళనాట టాప్ హీరోగా సాగుతున్న విజయ్. అతను కూడా ఇలాంటి పగ, ప్రతీకారం మార్కు చిత్రాలలో నటించి, స్టార్ అయ్యారు. ఇక చట్టంలోని లొసుగులను ఉపయోగించుకుంటూ నేరాలు చేసే కథలతో ఎస్.ఏ.చంద్రశేఖర్ శిష్యుడు ‘జెంటిల్ మేన్’ శంకర్ కూడా అనేక చిత్రాలు రూపొందించడం విశేషం. ‘చట్టానికి కళ్ళు లేవు’ తరువాత చంద్రశేఖర్ తెలుగులో ఆరు చిత్రాలకు దర్శకత్వం వహించారు. వాటిలో చిరంజీవితో తీసిన ‘దేవాంతకుడు’ ఒకటి. ‘చట్టానికి కళ్ళు లేవు’లో ముఖ్యపాత్ర పోషించిన నారాయణరావు ‘దేవాంతకుడు’ చిత్రాన్ని నిర్మించడం విశేషం!

Show comments