(సెప్టెంబర్ 13న సిహెచ్. నారాయణరావు జయంతి)
తెలుగు తెరపై అందాల నటుడు అనగానే అందరికీ ముందుగా గుర్తుకు వచ్చేది నటరత్న యన్టీఆర్. ఆ తరువాత శోభన్ బాబు. వీరిద్దరి కంటే ముందే ‘అందాల నటుడు’ అన్న టైటిల్ సంపాదించారు చదలవాడు నారాయణరావు. చిత్రసీమలో సిహెచ్. నారాయణరావుగా ప్రసిద్ధి చెందిన ఆయన తెలుగువారి తొలి గ్లామర్ హీరో. నవలల్లో నాయకుని వర్ణించినట్టుగా ఉండే కోటేరు లాంటి ముక్కు, విశాలనేత్రాలు, పసిమిఛాయ నారాయణరావు సొంతాలు. ఇక ఆయన అభినయం ఇట్టే కట్టిపడేసేది. ఆంగ్ల చిత్రాలలో లాగా పాత్రకు తగినట్టుగా నటించాలన్నది ఆయన భావన. ఓవర్ యాక్షన్ చేయడం సరికాదు అనేవారు నారాయణరావు. అయితే అప్పటి నటీనటుల్లో అనేకులు రంగస్థలం నుండే వచ్చినవారు కావడం వల్ల కెమెరా ముందు కూడా వారు అతిగానే అభినయించేవారు. దానిని నారాయణరావు తప్పు పట్టేవారు. ఎందుకంటే ఆయనకు నాటకానుభవం తక్కువ. అందువల్ల కొందరు నాటకాల్లో నటించి చూపమని ఆయనకు సవాల్ విసిరారు. పట్టుదలతో కొన్ని నాటకాల్లో నటించి మెప్పించారు. అయితే ఆ తరువాత కెమెరా ముందు నటించే సమయంలో నారాయణ రావు సైతం కంట్రోల్ కావడానికి సతమతం కావలసి వచ్చింది. అప్పుడు నాటకాల్లో నటన కూడా అంత సులువైనది కాదని, నిజానికి ప్రత్యక్షంగా జనం ముందు ప్రదర్శించి మెప్పించడం కత్తిమీద సాములాంటిదేనని ఆయన అంగీకరించారు. అదీ నారాయణరావులోని నిజాయితీ అని తరువాతి తరం సినీజనం కథలుగా చెప్పుకున్నారు.
చదలవాడ నారాయణరావు 1913 సెప్టెంబర్ 13న కర్ణాటకలోని హుబ్లీ సమీపాన మధుగిరిలో జన్మించారు. అంతకు ముందు దక్షిణభారత మంతటా ఉన్న రాజ్యాలలో తెలుగువారు ఉన్నత పదవుల్లో ఉండేవారు. అలా నారాయణరావు పూర్వికులు మైసూర్ మహారాజా వారి ఆస్థానంలో దివాన్లుగా పనిచేసేవారు. అందువల్ల ఆయన కన్నడ నాట జన్మించారు. అనంత పద్మనాభ వ్రతం రోజున జన్మించడం వల్ల ఆయన పేరును చదలవాడ అనంతపద్మనాభ దత్తాత్రేయ సత్యనారాయణరావుగా నిర్ణయించారు. ఆ పేరు వెండితెరపై సిహెచ్. నారాయణరావుగా మారింది. ఆయన బాల్యం అంతా ఏలూరులో గడిచింది. సోషలిస్టు భావాలతో పలు కార్మిక సంఘాలకు అధ్యక్షునిగా, కార్యదర్శిగా పనిచేశారు. కొంతకాలం ఏలూరు వెంకట్రామా అండ్ కో లో నూ గడిపారు. తలవని తలంపుగా మదరాసులో ఓ హోటల్ లో భోంచేస్తూండగా దర్శకుడు ద్రోణంరాజు చిన కామేశ్వరరావు కలిశారు. ఆయన ప్రోత్సాహంతో 1940లో రూపొందిన ‘జీవనజ్యోతి’ చిత్రంలో నాటి ప్రముఖ నాయిక కృష్ణవేణి సరసన హీరోగా నటిస్తూ చిత్రసీమలో అడుగు పెట్టారు సిహెచ్ .నారాయణరావు.
నటరత్న యన్టీఆర్ తొలి చిత్రం ‘మనదేశం’లో నాగయ్య తమ్మునిగా కథానాయకుని పాత్రలో నటించారు నారాయణరావు. “ముగ్గురు మరాఠీలు, లక్ష్మమ్మ, వీలునామా, జీవితం” వంటి చిత్రాల్లో ప్రధాన భూమికలు ధరించి అలరించారు. ఆ రోజుల్లో కొన్ని ఊళ్ళలో నారాయణరావుకు అభిమాన సంఘాలు కూడా ఉండేవి. “దీనబంధు, చెంచులక్ష్మి, దేవత, తాసిల్దార్” వంటి చిత్రాలలో తనకు తగిన పాత్రల్లో కనిపించారు. నాగయ్య హీరోగా రూపొందిన ‘స్వర్గసీమ’లో నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో కనిపించి అలరించారు. అయితే ఈ అందాల నటుడు 1950లలో రామారావు ఆగమనంతో మెల్లగా మసకబారి పోయారు. తరువాతి రోజుల్లో “శ్రీకృష్ణతులాభారము, రహస్యం, అర్ధరాత్రి, ఒకే కుటుంబం, కలెక్టర్ జానకి, దేశోద్ధారకులు” వంటి చిత్రాలలో కనిపించారు సిహెచ్. నారాయణరావు. చిత్రమేమంటే యన్టీఆర్ తొలి చిత్రం ‘మనదేశం’లో ఆ నాటి మేటి నటులు నాగయ్య, నారాయణరావు ఇద్దరూ ప్రధాన పాత్రలు పోషించారు. తరువాతి రోజుల్లో రామారావు హీరోగా రూపొందిన ‘ఒకే కుటుంబం’లో నాగయ్య, నారాయణరావు కేరెక్టర్ రోల్స్ చేశారు. అనారోగ్య కారణంగా 1984 ఫిబ్రవరి 14న మద్రాసులో సిహెచ్. నారాయణరావు కన్నుమూశారు. తెలుగువారి తొలి గ్లామర్ హీరోగా సిహెచ్. నారాయణరావు చరిత్రలో నిలిచారు.
