Celebrities Reacts On Naatu Naatu For Oscar Nominations: ఆర్ఆర్ఆర్ సినిమా సంచలనం సృష్టించింది. ఆస్కార్స్‌కు నామినేట్ అయిన తొలి దక్షిణాది సినిమాగా చరిత్రపుటలకెక్కింది. బెస్ట్ ఒరిసినల్ సాంగ్ విభాగంలో ఈ సినిమాలోని ‘నాటు నాటు’ పాట నామినేట్ అయ్యింది. దీంతో.. అందరి కల నెరవేరింది. ఏదైనా ఒక్క విభాగంలో అయినా ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్స్‌లో నామినేట్ అయితే బాగుంటుందనుకున్న భారతీయుల ఆకాంక్ష తీరింది. ఈ నేపథ్యంలోనే సినీ ప్రముఖులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదివరకే గోల్డెన్ గ్లోబ్ పురస్కారాన్ని కైవసం చేసుకున్న ఈ పాట.. ఇప్పుడు ఆస్కార్స్‌కే నామినేట్ అవ్వడంతో ప్రతిఒక్కరూ అభినందనలు తెలియజేస్తున్నారు. ఎవరెవరు ఏమన్నారంటే..
చిరంజీవి: టాలీవుడ్ సినిమా వైభవాన్ని చాటిచెప్పేందుకు ఒక్క అడుగు దూరంలోనే ఉన్నాం. మార్చి 12వ తేదీన కోట్లాది మంది ఆకాంక్ష, ప్రార్థనలు ఫలించాలని కోరుకుంటున్నా. నాటు నాటు పాట ఆస్కార్ నామినేషన్స్‌లో చోటు దక్కించుకున్నందుకు ఎంఎం కీరవాణి, దర్శకుడు రాజమౌళితోపాటు చిత్రబృందానికి శుభాకాంక్షలు.
బాలకృష్ణ: బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో నాటు నాటు నామినేట్ కావడం గొప్ప ఆనందాన్నిచ్చింది. చిత్రబృందానికి నా అభినందనలు.
జూ. ఎన్టీఆర్: నాటు నాటు పాట మరో ఘనత సాధించినందుకు గర్వంగా ఉంది. ఎంఎం కీరవాణి, రచయిత చంద్రబోస్‌లకు నా అభినందనలు. నా మనసులో ఈ పాటకు ఎల్లప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది.
రామ్ చరణ్: ఇదో అద్భుతమైన వార్త. ఆస్కార్స్‌కు నాటు నాటు పాట నామినేట్ అవ్వడం గౌరవంగా ఉంది. చిత్రబృందానికి, భారత్‌కి ఇది నిజంగా గర్వించదగిన విషయం. ఎంఎం కీరవాణి, రాజమౌళి, తారక్, చిత్రబృందానికి శుభాకాంక్షలు.
ఎంఎం కీరవాణి: నా టీమ్‌కి శుభాకాంక్షలు. అందరికీ బిగ్ హగ్స్.
ప్రేమ్ రక్షిత్: నాటు నాటు ఆస్కార్ అర్హత సాధించడం ఆనందంగా ఉంది. ఆర్ఆర్ఆర్ సినిమా వల్లే నా పాట ఆస్కార్ వరకు చేరింది. రాజమౌళి నాటు నాటును ఆదరించిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు. రాజమౌళి, కీరవాణి, చంద్రబోస్, కాలభైరవకు కృతజ్ఞతలు. ఆస్కార్ వేదికపై ఎన్టీఆర్, రామ్ చరణ్ నాటు నాటు పాటకు డ్యాన్స్ వేయాలని ఆకాంక్షిస్తున్నా.
పవన్ కల్యాణ్: ఆర్ఆర్ఆర్ చిత్రంలోని ‘నాటు నాటు’ గీతం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో ఆస్కార్ పురస్కారానికి నామినేట్ కావడం ఎంతో ఆనందాన్ని కలిగించింది. మన తెలుగు పాట ఆస్కార్ కోసం తుది బరిలో పోటీపడటం అందరికీ గర్వ కారణం. గీతాన్ని స్వరపరచిన శ్రీ ఎంఎం కీరవాణికి హృదయపూర్వక అభినందనలు. ఈ పాట ఆస్కార్ అవార్డు దక్కించుకోవాలని ఆకాంక్షిస్తున్నాను.
రవితేజ: ఇక నాటు దెబ్బ డైరెక్ట్ ఆస్కార్‌కి. ఎంఎం కీరవాణి స్క్రీన్ మీద తారక్, చరణ్‌లతో పాటు మొత్తం ప్రపంచంతో నాటు నాటు వేపించారు. రాజమౌళి, చంద్రబోస్‌తో పాటు చిత్రబృందానికి శుభాకాంక్షాలు.
