Cab Driver Ravi Surrenders In Renuka Swamy Murder Case: నటుడు దర్శన్ లివిన్ పార్ట్నర్ పవిత్ర గౌడకు అసభ్యకరమైన ఫోటోలు, సందేశాలు పంపినందుకు చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామిని బెంగళూరు తీసుకొచ్చి దర్శన్ అండ్ గాంగ్ హత్య చేశారు. ఈ కేసులో నటుడు దర్శన్, పవిత్ర గౌడ సహా 13 మంది నిందితులను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేశారు. కాగా, జూన్ 13న మరో నిందితుడు రవి అలియాస్ రవిశంకర్ చిత్రదుర్గలో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. ఇంతకీ, ఈ రవి ఎవరు? రేణుకాస్వామి హత్య కేసుతో అతడికి సంబంధం ఏమిటి? అనే వివరాల్లోకి వెళితే
Darshan Son: బూతులు, అసభ్య కామెంట్లకు థాంక్స్.. దర్శన్ కొడుకు ఎమోషనల్
చిత్రదుర్గలోని కురుబరహట్టి గ్రామానికి చెందిన రవి కారు డ్రైవర్. అద్దెకు కారు నడుపుతున్నాడు. రేణుకా స్వామిని రవి కారులో చిత్రదుర్గ నుంచి బెంగళూరుకు తీసుకొచ్చారు. తొలుత ఈ కేసులో 13 మంది పేర్లు వినిపించాయి. ఆ తర్వాత మరో నలుగురి పేర్లను చేర్చారు. ఈ కేసులో తన పేరు వినిపించడంతో రవి చిత్రదుర్గ డీవైఎస్పీ కార్యాలయానికి వెళ్లి పోలీసు అధికారి దినకర్ ఎదుట లొంగిపోయాడు. దర్శన్ కేసులో తన పేరు వినిపించిన వెంటనే భయాందోళనకు గురైన రవి చిత్రదుర్గ ట్యాక్సీ ఓనర్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్‌లను కలిసి అనంతరం వారందరి సమక్షంలో చిత్రదుర్గ డీవైఎస్పీ కార్యాలయానికి వెళ్లి లొంగిపోయాడు. అనంతరం రవి ఇచ్చిన సమాచారాన్ని టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లు మీడియాతో పంచుకున్నారు. రాఘవేంద్ర, ఇతర నిందితులు రేణుకా స్వామిని బెంగళూరు తీసుకెళ్లేందుకు రవి కారును అద్దెకు తీసుకున్నారు.
చిత్రదుర్గలోని కుంచిగనాల్ సమీపంలోని జగలూరు మహాలింగప్ప పెట్రోల్ బంకు సమీపంలో రాఘవేంద్ర ఆటో డ్రైవర్ జగ్గు, అనుకిరణ్, రాజుతో పాటు రేణుకాస్వామిని కారులో ఎక్కించుకుని తుమకూరు దగ్గర భోజనం చేశారు. అక్కడి నుంచి నేరుగా కెంగేరికి వచ్చిన వారు పట్టనగెరెలోని షెడ్డు వద్దకు వెళ్లారు. రాఘవేంద్ర చెప్పినట్లుగా రవి కారును పట్టనగెరెలోని షెడ్డుకు తీసుకు వెళ్ళాడు. షెడ్‌కి వెళ్లగానే అక్కడ చాలా మంది ఉండడం రవి గమనించాడు. రాఘవేంద్ర కారులోంచి రేణుకా స్వామిని తీసుకుని షెడ్డులోకి తీసుకెళ్లాడు. రవిని కారులోనే ఉండమని చెప్పాడు. రవి అక్కడ ఏం జరుగుతుందో తెలియక కారులోనే నిద్రపోయాడు. ఈ షెడ్‌లోనే రేణుకాస్వామి హత్యకు గురయ్యాడు. అనంతరం ఈ కేసులో కొందరు లొంగిపోవాలని కూడా ప్లాన్ చేశారు.
రవి తదితరులు అర్ధరాత్రి వరకు షెడ్డు బయట వేచి ఉండగా ఆ తర్వాత వచ్చి రేణుకాస్వామి మృతి గురించి చెప్పి కేసులో నిందితుడిగా లొంగి పోయేలా ఒప్పించే ప్రయత్నం చేశారు. అప్పుడు డ్రైవర్ రవి కంగారుపడి.. తన డబ్బు తనకి ఇస్తే వెళ్లిపోతానని అనడంతో 4 వేలు ఇచ్చేసి పంపేశారు. రవి, జగ్గు, అనుకిరణ్, రాజులతో కలిసి జూన్ 9వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు అక్కడి నుంచి చిత్రదుర్గకు తిరిగి వచ్చాడు. ఈ విషయాన్ని రవి స్వయంగా తమతో చెప్పారని టాక్సీ ఓనర్స్ అసోసియేషన్ ఆఫీస్ బేరర్లు తెలిపారు. చిత్రదుర్గలో లొంగిపోయిన రవిని ఇప్పుడు బెంగళూరు తీసుకొచ్చారు. ఈ కేసులో అనుకిరణ్ అనే నిందితుడు కూడా బెంగళూరు పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం. అయితే జగ్గు, రాజు ఇంకా లొంగిపోలేదు.