Site icon NTV Telugu

Anikha Surendran: కాస్తంత ఆలస్యంగా రాబోతున్న ‘బుట్టబొమ్మ’!

Buttabomma (1)

Buttabomma (1)

Butta Bomma: మలయాళ చిత్రం ‘కప్పెలా’కు తెలుగు రీమేక్ ‘బుట్టబొమ్మ’. అనిక సురేంద్రన్ టైటిల్ రోల్ ప్లే చేస్తున్న ఈ సినిమాలో అర్జున్ దాస్, సూర్య వశిష్ఠ కథానాయకులుగా నటించారు. ఈ మూవీతో శౌరి చంద్రశేఖర్ రమేశ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ శ్రీనివాస్ శ్రీమతి సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ నెల 26న విడుదల కావాల్సిన ‘బుట్టబొమ్మ’ను ఓ వారం రోజుల వాయిదా వేసినట్టు చిత్ర నిర్మాతలు తెలిపారు. ‘సినిమా విడుదలలో కొద్దిపాటి జాప్యం జరుగుతోందని, అయితే ఈ ఎదురుచూపులకు తగిన విధంగా చిత్రం ఉంటుంద’ని వారు హామీ ఇస్తున్నారు. ఇప్పుడీ చిత్రాన్ని ఫిబ్రవరి 4న విడుదల చేయబోతున్నారు. అయితే ఈ వారం షారుఖ్‌ ఖాన్ ‘పఠాన్’ తెలుగు డబ్బింగ్ వర్షన్ 25న విడుదల కాబోతోంది. అలానే సుధీర్ బాబు ‘హంట్’, ‘సిందూరం’ చిత్రాలు 26న విడుదల కాబోతున్నాయి. అదే రోజున మలయాళ డబ్బింగ్ సినిమా ‘మాలికాపురం’ కూడా తెలుగులో వస్తోంది.

ఇదిలా ఉంటే ఫిబ్రవరి 3వ తేదీన సందీప్ కిషన్ ‘మైఖేల్’తో పాటు సుహాస్ ‘రైటర్ పద్మభూషణ్‌’ విడుదల అవుతున్నాయి. సో… ఫిబ్రవరి 4వ తేదీన రాబోతున్న ‘బుట్టబొమ్మ’ వీటితో పోటీ పడబోతోందన్న మాట. ఈ చిత్రంలో నవ్య స్వామి, నర్రా శ్రీను, పమ్మి సాయి, కార్తీక్ ప్రసాద్, వాసు ఇంటూరి, ప్రేమ్ సాగర్, మిర్చి కిరణ్, ‘కంచెరపాలెం’ కిషోర్, మధుమణి తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.

Exit mobile version