బ్రూస్ విల్లీస్ – ఈ పేరు వింటే డై హార్డ్ సిరీస్ మన మదిలో మెదలుతాయి. 1980ల చివరలో రూపొందిన డై హార్డ్ ఫ్రాంచైజ్ లో హీరోగా నటించిన బ్రూస్ విల్లీస్ నిజజీవితంలోనూ అదే రీతిన ప్రవర్తించారు. తన కుటుంబాన్ని ఉమ్మడిగా ఉంచడానికి డై హార్డ్గానే వ్యవహరించారు. అలాంటి విల్లీస్ 67 ఏళ్ళ వయసులో అఫేసియా వ్యాధికి గురయ్యారు. ఆ వ్యాది ప్రభావం వల్ల మెదడులోని కణాలు నెమ్మదిగా దెబ్బతింటాయి. తత్ఫలితంగా వినికిడి శక్తి లోపిస్తుంది. ఉచ్చరణ లోపం కూడా తలెత్తుతుంది. ఇప్పటికే బ్రూస్ కు ఈ లక్షణాలు పొడసూపుతున్నాయని బ్రూస్ కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ కారణంగా ఇకపై బ్రూస్ నటించబోరని చెప్పారు. బ్రూస్ లాంటి ప్రతిభావంతుడైన నటుడు ఇకపై నటించబోరన్న వార్త ఆయన అభిమానులకు ఆవేదన కలిగిస్తోంది.
Read Also : Kaathu Vaakula Rendu Kaadhal : ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన సామ్
భారత మూలాలున్న మనోజ్ నైట్ శ్యామలన్ తెరకెక్కించిన సిక్స్త్ సెన్స్ మూవీలో బ్రూస్ నటించిన తీరు, అలరించిన వైనం మన భారతీయులను సైతం కట్టి పడేసింది. ఆ తరువాత మనోజ్ తెరకెక్కించిన అన్ బ్రేకబుల్లోనూ బ్రూస్ తనదైన అభినయం ప్రదర్శించారు. ఆ తీరున భారత్ లోని సీనీ ఫ్యాన్స్ సైతం బ్రూస్ ఇకపై నటించరన్న చేదు నిజం తెలుసుకొని వేదనకు గురవుతున్నారు.
బ్రూస్ విల్లీస్ తొలుత కామెడీ యాక్టర్ గా పేరొందారు. తరువాత డై హార్డ్ మూవీలో నటించాక హాలీవుడ్ లో టాప్ స్టార్ గా ఎదిగారు. యాక్షన్ హీరోగా పేరు సంపాదించిన తరువాత 1987లో తన 32వ యేట ఆ నాటి మేటి అందాల తార డెమీ మూర్ ను వివాహమాడారు. ఈ దంపతులకు రూమర్ విల్లీస్ జన్మించారు. 13 ఏళ్ళ తరువాత బ్రూస్, డెమీ విడిపోయారు. రూమర్ విల్లీస్ తల్లిదండ్రుల బాటలో నడుస్తూ మంచి నటిగా పేరు సంపాదించారు. 2009లో బ్రూస్, ఎమ్మా హెమింగ్ ను వివాహమాడారు. మొత్తం రూమర్ తో కలిపి ఐదు మంది సంతానం. బ్రూస్ కన్నవారు డేవిడ్ విల్లిస్ ఆర్మీలో పనిచేశారు. ఆయన తల్లి మార్లిన్ విల్లీస్ సినిమా నటి. విల్లీస్ కుటుంబం చిత్రసీమలో తమదైన బాణీ పలికించారు. ఉమ్మడి కుటుంబంగా మెలగడం అన్నది విల్లీస్ వంశం శైలి. ప్రస్తుతం బ్రూస్ తో ఆయన కుటుంబ సభ్యులందరూ ఉండడం పెద్ద ఊరట. అయితే బ్రూస్ వంటి మేటి నటుడు నటనకు గుడ్ బై చెప్పడం అన్నది అభిమానులకు ఆవేదన కలిగిస్తూనే ఉంది.
బ్రూస్ విల్లీస్ నటించిన లాస్ట్ బాయ్ స్కౌట్, 12 మంకీస్, పల్ప్ ఫిక్షన్, లాస్ట్ మేన్ స్టాండింగ్, టియర్స్ ఆఫ్ ద సన్, సరోగేట్స్, మూన్ రైజ్ కింగ్ డమ్, మదర్ లెస్ బ్రూక్లిన్ వంటి చిత్రాలే ఆయనను చూసుకొనే వీలు కల్పిస్తాయి. ఏది ఏమైనా బ్రూస్ లాంటి నటుడు 67 ఏళ్ళకే నటనకు దూరం కావడం అన్నది విచారకరం!
