Mega158: బర్త్‌డే స్పెషల్‌గా ‘మెగా158’ బీహైండ్ ది సీన్స్ వీడియో.. బాబీ కొల్లి విజన్‌పై మెగా టీమ్ ప్రశంసలు

Mega1581

Mega1581

Mega158: మెగాస్టార్ చిరంజీవి హీరోగా భారీ అంచనాలతో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘మెగా158’. ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మరోసారి దర్శకుడు బాబీ కొల్లి, చిరంజీవి కలయికలో వస్తున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సినిమా నుంచి చిన్న అప్‌డేట్ వచ్చినా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది కూడా. ఈ రోజు దర్శకుడు బాబీ కొల్లి పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం విడుదల చేసిన ప్రత్యేక వీడియో ఇప్పుడు అభిమానులను ఆకర్షిస్తోంది. సెట్స్‌లో దర్శకుడి పనితీరు ఎలా ఉంటుంది?  అనే ఆసక్తికి ఈ వీడియో ఒక చిన్న సమాధానంగా నిలిచింది. చిత్రబృందం విడుదల చేసిన బీహైండ్ ది సీన్స్ వీడియోలో బాబీ కొల్లి పూర్తి కాన్ఫిడెన్స్ తో షూటింగ్‌ చేస్తున్నట్లు    కనిపించింది. ఒకవైపు భారీ యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తూనే, మరోవైపు ప్రతి ఫ్రేమ్‌ను శ్రద్ధగా పరిశీలిస్తూ, యూనిట్ సభ్యులతో చిరునవ్వుతో మెలుగుతున్న ఆయన స్టైల్ అభిమానులను ఆకట్టుకుంటోంది.

ఇటీవల ఈ సినిమాకు సంబంధించి కీలకమైన ఇంటర్వెల్ సీక్వెన్స్ షూటింగ్ పూర్తయిందని సమాచారం. హైదరాబాద్‌లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో రామ్-లక్ష్మణ్ మాస్టర్స్ నేతృత్వంలో చిరంజీవిపై ఒక భారీ యాక్షన్ సీక్వెన్స్‌ షూటింగ్ శరవేగంగా జరిగింది. ఈ ఎపిసోడ్ అనంతరం చిరంజీవి నటనకు, బాబీ కొల్లి రూపొందించిన విజన్‌కు మొత్తం చిత్రబృందం స్టాండింగ్ ఒవేషన్ ఇచ్చినట్లు నిర్మాతలు వెల్లడించారు. ఆ ఒక్క ఎపిసోడ్ సినిమాకు హైలెట్ గా నిలుస్తుందని సమాచారం. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ యాక్షన్ బ్లాక్ థియేటర్లలో విజిల్స్ వేయిస్తుందని యూనిట్ అంతా చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో అనస్వర రాజన్ కథానాయికగా నటిస్తుండగా, నివేదా పేతురాజ్ మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. కథలో ఈ పాత్రలకు కూడా మంచి ప్రాధాన్యం ఉంటుందని సమాచారం. ఇప్పటికే షూటింగ్ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో త్వరలోనే మరిన్ని అప్డేట్స్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.

‘Mega158’ రిలీజ్ డేట్ ను మేకర్స్ ఇంకా ప్రకటించనప్పటికీ, సినీ వర్గాల అంచనాల ప్రకారం ఈ సినిమా జనవరి 2027 సంక్రాంతి కానుకగా థియేటర్లలో విడుదలయ్యే అవకాశం ఉంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ క్రేజీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌కు ఎస్.ఎస్. థమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఈ నెల ఆగస్టు 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ మూవీ టైటిల్‌తో పాటు టీజర్‌ను కూడా విడుదల చేయడానికి చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. ఇక చిరంజీవి అభిమానులు కూడా ఈ మూవీ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా, భారీ యాక్షన్ సీక్వెన్స్, మెగాస్టార్ స్క్రీన్ ప్రెజెన్స్, దర్శకుడి స్టైలిష్ మేకింగ్ కలిసి ‘మెగా158’ను మరో భారీ విజయంగా నిలబెడతాయా అన్న ఆసక్తి అయితే ఇప్పుడు అభిమానుల్లో కనపడుతోంది.