Polimera 3: ‘పొలిమెరా3’ నుంచి అదిరే అప్‌డేట్.. కీలక పాత్రలో బ్లాస్ట్ స్టార్ అర్జున్

Polimera3

Polimera3

Polimera 3: హారర్ థ్రిల్లర్ ఫ్రాంచైజీల్లో ‘పొలిమెరా’ తెలుగు ప్రేక్షకులను బాగానే భయపెట్టింది. గ్రామీణ నేపథ్యం, చేతబడులు, మిస్టరీ ఎలిమెంట్స్ తో రూపొందిన ఈ సిరీస్ మొదటి రెండు భాగాలు మంచి విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు మూడో భాగంపై కూడా థ్రిల్లర్ ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘పొలిమెరా 3’ నుంచి వచ్చిన తాజా అప్‌డేట్ సినిమాపై మరింత హైప్ ను పెంచుతోంది. గత కొన్ని రోజులుగా బ్లాస్ట్ స్టార్ అర్జున్ ఈ మూవీలో కీలక పాత్ర పోషించనున్నారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ఇప్పుడు ఆ ప్రచారానికి తెరదించుతూ చిత్ర బృందం అధికారిక ప్రకటన చేసింది. అర్జున్‌ను ‘పొలిమెరా3’ లోకి తీసుకుంటున్నట్లు వెల్లడించింది. దీంతో ఈ చిత్రంపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయి. ఈ ఫ్రాంచైజీలో ఇప్పటివరకు ప్రధాన పాత్రతో ప్రేక్షకులను ఆకట్టుకున్న సత్యం రాజేష్ మరోసారి కథానాయకుడిగా కొనసాగుతున్నారు. ఆయన సరసన కామాక్షి భాస్కర్ల కథానాయికగా నటిస్తున్నారు.

అంతేకాదు కథను మరింత ఇంటెన్స్ గా కొనసాగించేందుకు కొన్ని కీలక పాత్రల్లో కొత్త ముఖాలను కూడా పరిచయం చేయనున్నట్లు సమాచారం. ఇందులో భాగంగానే అర్జున్ పాత్ర కథలో కీలక మలుపులు తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. హారర్, థ్రిల్లర్, ఫోక్ ఎలిమెంట్స్‌ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న దర్శకుడు అనిల్ విశ్వనాథ్ ఈ మూడో భాగానికీ దర్శకత్వం వహిస్తున్నారు. మొదటి రెండు భాగాల్లో కథను నడిపించిన విధానం ప్రశంసలు అందుకోవడంతో, ఇప్పుడు మూడో భాగంలో మరింత థ్రిల్లర్ కంటెంట్ ను తీసుకురానున్నారని తెలుస్తోంది. వంశీ నడిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వెంకటేశ్వర సినిమాస్ LLP సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. అర్జున్ ఎంట్రీతో ‘పొలిమెరా3’ కథ ఎలాంటి మలుపులు తిరుగుతుంది? ఆయన పాత్ర హీరోకు అండగా నిలుస్తుందా ? లేక ఇందులో ప్రతి నాయకుడి పాత్ర పోషిస్తున్నారా ? అనే ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే చిత్ర బృందం విడుదల చేయనున్న తదుపరి అప్‌డేట్‌ల కోసం వేచి చూడాల్సిందే.