Tollywood: టాలీవుడ్ పై బీజేపీ కన్ను వేసిందా..? అంటే నిజమే అంటున్నారు సినీ, రాజకీయ వర్గాలు. ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఎవరి వ్యూహాలు వారు పన్నుతున్నారు. ఇక పార్టీల పరంగా కలయికలు ఎలా ఉంటాయి అనేది ఎవరికి తెలియని విషయం. సినిమా, రాజకీయాలు పాలు నీళ్లలాంటివి. ఈ రెండు రంగాలు ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ ఉంటారు. ఎన్నికల ప్రచారంలో సినీ ప్రముఖులు కనిపించడం సాధారణమే. అయితే ఈసారి బీజేపీ కొద్దిగా ముందే ఈ ప్లాన్ ను అమలు చేసే పనిలో ఉందని టాక్ నడుస్తోంది. టాలీవుడ్ లోని యంగ్ హీరోలను బీజేపీ ముఖ్య నేతలు కలవడమే అందుకు ఉదాహరణ అని చెప్పుకొస్తున్నారు. మొన్నటికి మొన్న బీజేపీ నేత అమిత్ షా, యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో భేటీ అయ్యి సంచలనం సృష్టించారు. అయితే ఆ భేటీలో కేవలం సినిమాకు సంబంధించిన విషయాలు మాత్రమే చర్చించారని, రాజకీయ నేపథ్యం అస్సలు రాలేదని బీజేపీ నేతలు చెప్పుకొచ్చారు.
అమిత్ షా, ఎన్టీఆర్ కూడా అదే చెప్పుకొచ్చారు. అయితే అస్సలు వీరి మధ్య ఏం జరిగిందో అనేది ఎవరికి తెలియదు. ఇక ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు తాజాగా మరో బీజేపీ నేత మరో యంగ్ హీరోను కలవడానికి సిద్ధం కావడం హాట్ టాపిక్ గా మారింది. రేపు బీజేపీ నేత జేపీ నడ్డా, హీరో నితిన్ తో భేటీ కానున్నారు. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో నితిన్ ను కలవనున్నారు. నితిన్ తో పాటు కొందరు రచయితలు, స్పోర్ట్స్ పర్సన్స్ ను కూడా జేపీ నడ్డా మీట్ అవ్వనున్నారు. ఇక ఈ భేటీల వెనుక ఉన్న అంతర్యం ఏంటి..? మొన్న ఎన్టీఆర్ ను కలవడం సినిమాల విషయమే అయితే ఇప్పుడు నితిన్ కలవడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏంటి..? అని సినీ, రాజకీయ వర్గాల్లో చర్చ మొదలయ్యింది.
