Bigg Boss -6: బిగ్ బాస్ సీజన్ సిక్స్… 105 రోజుల ప్రయాణం పేలవంగా సాగినా… ఆదివారం నాటి క్లయిమాక్స్ మాత్రం ఊహించనవి విధంగా సాగింది. రేవంత్, శ్రీహాన్ చివరకు బరిలో నిలువగా 40 లక్షల క్యాష్ ప్రైజ్ తో శ్రీహాన్ ఆట నుండి స్వచ్ఛందంగా తప్పుకోవడంతో రేవంత్ విన్నర్ అయ్యాడు. అయితే… మొత్తం క్యాష్ ప్రైజ్ యాభై లక్షల లోంచే రన్నర్ కు నలభై లక్షలు ఇవ్వడం అనేది చాలామందికి సమంజసంగా అనిపించలేదు. చిత్రంగా శ్రీహాన్ టాప్ ఫోర్ ఉన్నప్పుడు… డబ్బులకు ఆశపడి అంగీకరిస్తే… తనకు ఓటు వేసిన వ్యూవర్స్ ను మోసం చేసినట్టు అవుతుందని నీతులు చెప్పాడు. అతని తండ్రి కూడా అదే మాటను వల్లెవేశాడు. కానీ అదే ఆఫర్ రూ. 40 లక్షలకు చేరే సరికీ మిత్రులందరూ చెబుతున్నారు కాబట్టి ఆఫర్ ను తీసుకోమని శ్రీహాన్ కు అతని తండ్రి చెప్పడంతో, మరో ఆలోచన లేకుండా శ్రీహాన్ షో నుండి నలభై లక్షలు తీసుకుని క్విట్ అయ్యాడు. మరి అప్పుడు అతనికి ఓటు వేసిన వ్యూవర్స్ గుర్తుకు రాలేదా!? అనేది ఓ ప్రశ్న.
బట్… అసలు కొసమెరుపు ఇది కాదు… ఆట ముగిసి, రేవంత్ ను విజేతగా ప్రకటించిన తర్వాత నాగార్జున ఈ సీజన్ లో ఓట్ల ప్రకారం శ్రీహానే విజేత అనే విషయం ప్రకటించారు. అయితే… నలభై లక్షల కోసం శ్రీహాన్ డ్రాప్ కావడంతో ట్రోఫీ రేవంత్ కు దక్కిందన్నమాట. ఈ ట్విస్ట్ నిజంగా ఎవరూ ఊహించనిది. రేవంత్ కంటే శ్రీహాన్ కే ఎక్కువ ఓట్లు వచ్చాయనేది నమ్మశక్యంగా లేదు అనే వారూ లేకపోలేదు. అది వేరే విషయం. ఏదేమైనా… శ్రీహాన్ చివరి నిమిషంలో డ్రాప్ కావడంతో అతనికి రావాల్సిన పది లక్షలు తగ్గడంతో పాటు కారు, 650 గజాల ప్లాట్ కూడా చేజారిపోయినట్టు అయ్యింది. ఆ రకంగా చూస్తే… రేవంత్ లక్కీ ఫెలో అని చెప్పాలి. అతనికి బిగ్ బాస్ సీజన్ 6 టైటిల్ లో పాటుగా బాలెన్స్ పది లక్షలు, దాదాపు పది లక్షలు విలువ చేసే కారు, ఇరవై ఐదు లక్షలు విలువ చేసే ప్లాట్ దక్కాయి. సో… శ్రీహాన్ గెలిచి, ఓడిపోతే… రేవంత్ ఓడి గెలిచాడు!!