The Revolutionaries OTT: బ్రిటిష్ సామ్రాజ్యాన్ని వణికించిన నలుగురు వీరులు.. ఓటీటీలోకి హై-వోల్టేజ్ పీరియడ్ యాక్షన్  సిరీస్

Therevolutionariesott

Therevolutionariesott

The Revolutionaries OTT: భారత స్వాతంత్ర్య పోరాటం గురించి ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్‌లు వచ్చినప్పటికీ.. చరిత్రలో అంతగా వెలుగులోకి రాని విప్లవకారుల కథలు ఎప్పుడూ ప్రేక్షకుల్లో ప్రత్యేక ఆసక్తిని కలిగిస్తాయి. అలాంటి అరుదైన కథతో ఇప్పుడు ‘ది రివల్యూషనరీస్’ (The Revolutionaries) అనే భారీ హిస్టారికల్ వెబ్ సిరీస్ ఓటీటీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సిరీస్‌కు సంబంధించిన తొలి పోస్టర్‌తో పాటు రిలీజ్ డేట్ ని కూడా ఆఫీషియల్ గా ప్రకటించారు మేకర్స్. మరి ఈ హై-వోల్టేజ్ పీరియడ్ యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్ ఎప్పుడు వస్తుంది ? ఏ ఓటీటీలోకి వస్తోంది ? దీని కథ ఏంటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.

అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్

‘ది రివల్యూషనరీస్’ 2026 సెప్టెంబర్ 11 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ ఏడాది ప్రారంభంలోనే ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించిన ప్రైమ్ వీడియో, ఇప్పుడు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేయడంతో పాటు డిజిటల్ ప్రీమియర్ తేదీని కూడా వెల్లడించింది. చరిత్రలోని రియల్ సంఘటనల నుంచి స్ఫూర్తి పొంది రూపొందించిన ఈ సిరీస్ స్వాతంత్ర్య ఉద్యమంలోని చెప్పని కథలను కొత్త తరానికి పరిచయం చేయబోతోంది. ఈ వెబ్ సిరీస్ ప్రముఖ రచయిత సంజీవ్ సన్యాల్ రచించిన బెస్ట్ సెల్లర్ పుస్తకం ‘రివల్యూషనరీస్: ది అదర్ స్టోరీ ఆఫ్ హౌ ఇండియా వన్ ఇట్స్ ఫ్రీడమ్’ ఆధారంగా తెరకెక్కింది.

బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా సాయుధ పోరాటాన్ని ఎంచుకున్న నలుగురు విప్లవకారుల జీవితాలను ఈ సిరీస్‌లో చూపించనున్నారు. చరిత్ర పుస్తకాలలో పరిమితంగా ప్రస్తావించబడిన ఈ పాత్రలను ఇప్పుడు మరింత విస్తృతంగా తెరపై ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతోంది. సిరీస్‌లో భువన్ బామ్ రాష్ బిహారీ బోస్ పాత్రలో కనిపించనుండగా, రోహిత్ సరఫ్ సచింద్ర నాథ్ సన్యాల్‌గా నటిస్తున్నారు. ఎమ్మే ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై రూపొందుతున్న ఈ సిరీస్‌లో రాష్ బిహారీ బోస్ (భువన్ బామ్), సచింద్ర నాథ్ సన్యాల్ (రోహిత్ సరఫ్), ప్రతిభా లాహిరి (ప్రతిభా రాంటా) మరియు బాఘా జతిన్ (గుర్ఫతే పిర్జాదా) ప్రధాన పాత్రలు పోషించారు. ఈ నలుగురు పాత్రల చుట్టూనే కథ ముందుకు సాగుతుంది.

కథ ఏమిటంటే ?

1857 ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామ వైఫల్యం తర్వాత బ్రిటీష్ క్రూర వలస పాలనను అంతం చేయడానికి ఈ నలుగురు యువకులు సాయుధ ప్రతిఘటన బాట పడతారు. వీరు దాదాపు 15 వేల మంది విప్లవకారులను ఏకం చేసి, బ్రిటీష్ రాజ్‌పై దేశంలోనే అతిపెద్ద సాయుధ దాడికి వ్యూహం రచిస్తారు. కేవలం చారిత్రక సంఘటనలనే కాకుండా, ఆ నాటి విప్లవకారుల మధ్య ఉన్న బలమైన స్నేహం, అచంచలమైన దేశభక్తి మరియు వారు ఎదుర్కొన్న అంతర్గత ద్రోహాలను ఈ సిరీస్ ఎమోషనల్ యాక్షన్ డ్రామాగా ఆవిష్కరించనుంది.

ఇటీవల ఓటీటీ వేదికల్లో హిస్టారికల్ కథలకు మంచి ఆదరణ లభిస్తున్న నేపథ్యంలో ‘ది రివల్యూషనరీస్’పై అంచనాలు మరింత పెరిగాయి. చరిత్రలో మరుగునపడిన వీరుల పోరాటాన్ని ఈ కాలం ప్రేక్షకులకు పరిచయం చేసే ప్రయత్నం చేస్తున్నారు. సెప్టెంబర్ 11 నుంచి ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ ప్రారంభం కానుండటంతో, దేశభక్తి కథలను ఇష్టపడే ప్రేక్షకులకు ఇది మరో ఆసక్తికరమైన ఓటీటీ కంటెంట్ గా మారబోతోంది.