Site icon NTV Telugu

Bhaskarabhatla : నవతరం నాడి పట్టేసిన భాస్కరభట్ల!

Batla

Batla

నవతరం దర్శకుల దృష్టి మొత్తం యువతరాన్ని ఆకట్టుకోవాలన్నదే! అందులో భాగంగానే తమ చిత్రాలలో మోడరన్ థాట్స్ కు తగ్గ దరువులు ఉండాలనీ కోరుకుంటారు. అందుకు తగ్గ పదాలు నిండిన పాటలూ కావాలని ఆశిస్తారు. అలాంటి ఆలోచనలు ఉన్న దర్శకనిర్మాతలకు ‘ఇదిగో…నేనున్నానంటూ’ పాటలు అందిస్తూ ఉంటారు భాస్కరభట్ల. “వచ్చేస్తోంది వచ్చేస్తోంది…” అంటూ బాలకృష్ణ ‘గొప్పింటి అల్లుడు’తో ఆరంభమైన భాస్కరభట్ల పాటల ప్రయాణం ఆ తరువాత భలే ఊపుగా సాగింది. చిరంజీవి ‘ఆచార్య’లో “శానా కష్టం వచ్చిందే…” పాటతోనూ తనదైన మార్కు ప్రదర్శించారు. ఇప్పటికీ తనదైన బాణీ పలికిస్తూ పాటలతో ఆడేసుకుంటున్నారు భాస్కరభట్ల. తెలుగు పలుకులకు పరభాషా పదాలను అనువుగా తొడిగి పాటలు ఒలికించడంలో మేటి భాస్కరభట్ల. ఆ బాణీ అంటే ఎందరికో ఇష్టం. అందువల్లే కొందరు దర్శకులు తాము రూపొందించే చిత్రాలలో అదేపనిగా భాస్కరభట్ల పాటలకు చోటు కల్పిస్తూ ఉంటారు. వారందరికీ ఆనందం పంచుతూనే భాస్కరభట్ల కలం సాగుతూ ఉంది.

అర్చకత్వం ఉన్న కుటుంబంలో 1974 జూన్ 5న జన్మించారు భాస్కరభట్ల రవికుమార్. శ్రీకాకుళంలోని బూరవెల్లిలో మాతామహుల ఇంట జన్మించిన రవికుమార్ కు బాల్యంలోనే తెలుగు సాహిత్యంపై అభిమానం కలిగింది. తాత అరవెల్లి కన్నరాజ గోపాలాచార్యుల వద్ద అభ్యసించిన సాహితీ ప్రక్రియలతో సాహిత్యంపై మరింత మక్కువ పెరిగింది. అదే ఆయనను వార్తలు రాసేందుకు పురమాయించింది. దాంతోనే ‘ఈనాడు’ కాంపౌండ్ లోని సితార సినిమా మేగజైన్ లో ఫిలిమ్ జర్నలిస్ట్ గా మారారు. కొన్నేళ్ళు అక్కడ పనిచేసిన తరువాత ఇది కాదు నా గమ్యం అని తీర్మానించుకున్నారు రవి. సితార సినిమా జర్నలిస్ట్ ఉద్యోగానికి బై బై చెప్పేసి, చిత్రసీమలో గీతరచయితగా ప్రయత్నాలు మొదలెట్టారు. తొలి రోజుల్లోనే చక్రి వంటి సంగీత దర్శకుడు, పూరి జగన్నాథ్ లాంటి దర్శకుడు భాస్కరభట్లను ప్రోత్సహించారు. వారి సినిమాలతోనే భాస్కరభట్ల పాటలకు భలేగా గుర్తింపు లభించింది. “రామసక్కని బంగారు బొమ్మా… రాసలీలకు వస్తావా…” అంటూ కవ్వించాడు. “ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే…” అని పలికించి బులిపించాడు. “చూడొద్దంటున్నా చూస్తూనే ఉంటా…” అని ఉడికించాడు. “లేలేత నవ్వులా… పింగాణి బొమ్మలా…” అంటూ మురిపించారు. “గాల్లో తేలినట్టుందే… గుండె పేలినట్టుందే…” అనేసి ప్రేమికుల నరాలు జివ్వు మనిపించారు. “కృష్ణానగరే మామా… కృష్ణానగరే…” పాటలో నవ్వుల మాటున దాగిన సినీజీవుల కన్నీటి గాథలను ఒలికించారు. ఇలా ఏది చేసినా భాస్కరభట్ల పాటల్లో పైకి వినిపించే పదాల మాటున దాగిన అర్థం కొన్నిసార్లు పెదాలను తడిచేయిస్తుంది. మరికొన్ని సార్లు మనసులనూ తడిచేస్తుంది.

ఇప్పటికే వందలాది పాటలతో సందడి చేసిన భాస్కరభట్ల పాటకు ఇప్పటికీ ఎందరో సినీజనం పట్టాభిషేకం చేస్తూనే ఉన్నారు. కమర్షియల్ లిరిసిస్ట్ గా భాస్కరభట్ల సక్సెస్ రూటులో సాగిపోతున్నారు. ఆయన పాటకు తగ్గ ప్రభుత్వ అవార్డులే ఇంకా దరి చేరలేదు. భాస్కరభట్లకు ఆ ముచ్చట కూడా తీరే రోజు రావాలని ఆశిద్దాం.

Exit mobile version