NTV Telugu Site icon

‘ఆహా!’… బాలయ్య ‘అన్ స్టాపబుల్’ సందడి!

నటసింహ నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా ‘అన్ స్టాపబుల్ యన్.బి.కె.’ టాక్ షో దీపావళి రోజున ‘ఆహా’ ఓటీటీలో ఆరంభమయింది. మొదటి రోజునే బాలకృష్ణ ప్రోగ్రామ్ లో గెస్ట్స్ గా ప్రముఖ నటుడు మోహన్ బాబు, ఆయన కూతురు మంచు లక్ష్మి, తనయుడు మంచు విష్ణు రావడం విశేషమనే చెప్పాలి. ఈ ఎపిసోడ్ యాభై నిమిషాలు ఉంది.

ఎవడాపుతాడో చూద్దాం…

ఆరంభంలో బాలకృష్ణ ఏకపాత్రాభినయం చేస్తున్నట్టుగా తన గురించి జనం ఏమనుకుంటున్నారో వివరిస్తూ తెరపై కనిపించడం ఆకట్టుకుంటుంది. “నా అంతరాత్మకు అంతరాయం ఉండదంటారు –
నా మనస్తత్వానికి మర్మం లేదంటారు –
కోపమెక్కువే కానీ, కపటం తెలియదంటారు –
కానీ కన్ను కదిపిన నాటి నుంచీ కట్టె కాలేదాకా ఈ క్యారెక్టర్ మారదు…” అంటూ మొదలైన ‘యన్.బి.కె. అన్ స్టాపబుల్’, బాలకృష్ణ నటించిన ‘పైసావసూల్’లోని “మామా ఏక్ పెగ్ లా…” పాటతో ఆయన చిందులతో అలరిస్తుంది. ఆయనతో పాటు కాసేపు పూర్ణ కూడా చిందేసి కనువిందు చేస్తుంది. ఇది బాలయ్య నామ సంవత్సరం దీపావళి అంటూ చెప్పారు.
“అనిపించింది అందాం… అనుకున్నది చేద్దాం… ఎవడాపుతాడో చూద్దాం…” అంటూ తనదైన పంచ్ తో మురిపించారు బాలయ్య.

చిరంజీవిపై మోహన్ బాబుకు ప్రశ్న!

తొలి ఎపిసోడ్ లోనే మోహన్ బాబు గెస్ట్ గా రావడం ప్రస్తుత పరిస్థితుల్లో విశేషమనే చెప్పాలి. పైగా ఆయనను ‘చిరంజీవిగారి మీద మీకు నిజంగా ఉన్న అభిప్రాయమేమిటి చెప్పండి?’ అన్న ప్రశ్నకు “చిరంజీవి మంచినటుడు, అద్భుతంగా డాన్స్ చేస్తాడు… నాకు పర్సనల్ గా అతనిమీద ఏ విధమైన చెడు అభిప్రాయం లేదు… అల్లు రామలింగయ్య కూతురు సురేఖను పెళ్ళిచేసుకున్నాడు… ఆమె నాకు సిస్టర్ లాంటిదే కదా… అంటే మన ఇంటి అమ్మాయిని అతడు పెళ్ళి చేసుకున్నాడు… కాబట్టి అతను బాగున్నాడు..” అని సమాధానం మోహన్ బాబు చెప్పడం నిజంగానే అందరిలోనూ ఆసక్తి కలిగిస్తుంది.
తరువాత మోహన్ బాబు ‘రాయల్ సెల్యూట్’ స్టోరీ… చెప్పడం
ఆపై మోహన్ బాబే, బాలయ్యను ప్రశ్నలు అడగడం – ఆకట్టుకున్నాయి.
‘నాలో నీకు నచ్చనిది ఏది?’ అని మోహన్ బాబు, బాలయ్యను ప్రశ్నిస్తే – దానికి ఆయన ‘మీ ముక్కుసూటితనం’ సమాధానం చెప్పడం అలరించింది.

అక్కడా… ‘మా’నే!

మధ్యలో మంచు లక్ష్మి, మంచు విష్ణు ఒకే చోట కూర్చుని బాలయ్య అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వడం కూడా మురిపించింది.
ఇక లక్ష్మి, విష్ణు పాత సంఘటనలను గుర్తు చేసుకోవడం కూడా ఆకట్టుకుంది. చిన్నప్పుడు తాను ఎక్కువసార్లు ‘మంగమ్మగారి మనవడు’లోని “దంచవే మేనత్త కూతురా…” పాటకు డాన్స్ చేసే దాణ్ణని చెప్పి, ఆ పాటకు బాలయ్యతో కలసి లక్ష్మి కాసేపు స్టెప్స్ వేయడం కూడా అలరించింది. ఇదే సందర్భంలో మంచు విష్ణు తమ ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ సలహా సంఘంలో బాలయ్యను, తండ్రి మోహన్ బాబును సభ్యులుగా ఉండమని కోరడం కొసమెరుపు.

చంద్రబాబు చేసిన తప్పు!

ఈ కార్యక్రమంలో తన జయాపజయాలను వివరిస్తూ మోహన్ బాబు -“Success is the public affair, failure is the personal funeral” అన్నారు. ఆ వివరణలోనే ‘చంద్రబాబు నా విషయంలో ఓ తప్పు చేశారు. అది ఇప్పుడు చెప్పడం సబబు కాదు’ అనీ మోహన్ బాబు తెలిపారు. మహానుభావుడు యన్టీఆర్ తనకు క్రమశిక్షణ ఉందని కితాబు నిస్తే, చంద్రబాబు తనకు క్రమశిక్షణలేదని పార్టీ నుండి బయటకు పంపారని మోహన్ బాబు గుర్తు చేసుకున్నారు
‘యన్టీఆర్ స్థాపించిన పార్టీ పగ్గాలు మీరు తీసుకోకుండా, చంద్రబాబుకు ఎందుకు ఇచ్చారు?’ అని మోహన్ బాబు, బాలయ్యను ప్రశ్నించారు. అందుకు బాలయ్య సమాధానంగా “అప్పట్లో ఇందిరాగాంధీపై వారసత్వ రాజకీయాలు ఉండరాదని పోరాటం చేస్తున్నాం. అందువల్ల నేను అప్పుడే వస్తే, అదే తీరు అవుతుందని తీసుకోలేదు” అని వివరించారు. అలాగే మోహన్ బాబు విద్యాసంస్థల్లో కులప్రస్తావన లేకుండా సీట్టు ఇచ్చే విధానాన్నీ చర్చించారు.

పేదబాలలకు చేయూత!

చివరలో పదేళ్ళ అజీజ్, అతని సోదరిని పిలిచారు. వారిలో అజీజ్ సోదరికి బ్రెయిన్ క్యాన్సర్ కు తమ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఉచితంగా చికిత్స అందిస్తున్నట్టు చెప్పారు బాలయ్య. అలాగే అజీజ్ కు విద్యాసాయం చేయమని మోహన్ బాబును కోరారు. అందుకు మరోమాట లేకుండా మోహన్ బాబు అంగీకరించారు. చివరలో మోహన్ బాబు ఈ షో గ్రాండ్ సక్సెస్ సాధించాలని అభిలషించారు.
“నా పేరు మీకు తెలుసు…. నా స్థానం మీ మనసు…” అంటూ ఆరంభంలో చెప్పినట్టుగానే, ముగింపు వచనంగానూ అదే పలికారు బాలయ్య.
చివరలో వచ్చే టైటిల్ కార్డ్స్ సమయంలో బాలయ్య, పూర్ణ ‘సమరసింహారెడ్డి’లోని “నందమూరి నాయకా…” పాటకు స్టెప్స్ వేయడంతో ముగిసింది.

ఈ ఎపిసోడ్ లో బాలయ్య షర్వాణీ వేసుకొని, పైన ఓ శాలువా కప్పుకొని ఆకర్షించేలా కనిపించారు. సాధారణంగా బాలయ్య స్పీచెస్ లో ఆయన మాటల మధ్య ‘ల్యాగ్’ ఉంటుంది. కానీ, ఈ ఎపిసోడ్ లో అదేమీ లేకుండా చక్కగా మెయింటెయిన్ చేశారు. మొదటి ఎపిసోడ్ లోనే అధిక సంఖ్యాకులను ఆకట్టుకొనేలా బాలయ్య సాగారు. మునుముందు ఎపిసోడ్స్ ఏ తీరున అలరిస్తారో చూద్దాం.