Balagam: ప్రపంచంలో ఎవరిని తక్కువ అంచనా వెయ్యకూడదు. ఎవరు ఎప్పుడు ఫేమస్ అవుతారో ఎవరికి తెలియదు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎవరు ఎప్పుడు హిట్ అందుకుంటారో.. ఎవరు ఎప్పుడు ప్లాప్ తెచ్చుకుంటారో తెలియదు. అందుకే అంచనాలను అందలేని ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే అది చలనచిత్ర రంగం. ఒక్క సినిమా .. ఒకే ఒక్క సినిమా సాధారణ జీవితాన్ని గడిపేవారిని సెలబ్రటీలను చేస్తోంది.. స్టార్ డమ్ ను అందుకునేలా చేస్తుంది. అలా ఒక్క సినిమాతో స్టార్లుగా మారిన వారు చాలామంది ఉన్నారు. ఇక ఇప్పుడు ఆ లిస్ట్ లోకి డైరెక్టర్ వేణు వచ్చి చేరాడు. మున్నా సినిమాలో ఒక నార్మల్ కమెడియన్ గా పరిచయమయ్యాడు వేణు. ఈ సినిమా తరువాత టిల్లు వేణుగా స్థిరపడ్డాడు. ఇక జబర్దస్త్ పుణ్యమా అని జబర్దస్త్ వేణుగా మారాడు. తన కామెడీతో ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా ఎంతోమంది మంచి ఆర్టిస్టులను జబర్దస్త్ కు పరిచయం చేశాడు. ఇక్కడివరకు వేణు జీవితం ఒక ఎత్తు అయితే.. డైరెక్టర్ గా ఆయన అడుగు వేయడం మరో ఎత్తు.
బలగం ప్రెస్ మీట్ పెట్టి దిల్ రాజు, జబర్దస్త్ వేణును డైరెక్టర్ గా పరిచయం చేసిన రోజు అందరు షాక్ అయ్యారు. షాక్ కన్నా ముందు లైట్ తీసుకున్నారు. హా, కామెడీ మాత్రమే చేస్తాడు.. ఏం సినిమా తీసి ఉంటాడులే అనుకున్నారు. కామెడీ హీరోతో సినిమా చేస్తున్నాడు.. కామెడీ సినిమానేమో అని మరికొంతమంది అనుకున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్నాడు అంటే సినిమాలో విషయం ఉంది అనుకున్నవారు బలగం సినిమాకు వెళ్లారు. మొదటి రోజు ఎంతో ఆత్రుతతో ఎదురుచూసిన అభిమానులు.. థియేటర్ బయటకు ఏడుస్తూ వచ్చారు. చాలు.. సినిమా హిట్. మౌత్ టాక్ అదిరిపోయింది. కలక్షన్స్ మోత మోగిపోయాయి. చిన్న సినిమాగా రిలీజ్ అయిన బలగం భారీ విజయాన్ని అందుకుంది. రికార్డుల దగ్గరే ఆగిపోతుంది అనుకున్న సినిమా రివార్డులు, అవార్డులు తీసుకొచ్చి పెడుతుంది. లోకల్ గానే కాకుండా ఇంటర్నేషనల్ వేదికలపై కూడా బలగం.. తన బలగాన్ని చూపిస్తుంది. తాజాగా డైరెక్టర్ వేణు మరో అంతర్జాతీయ అవార్డును అందుకున్నాడు. ఉత్తమ దర్శకుడుగా ఆమ్ స్టర్ డామ్ ఇంటర్నేషనల్ అవార్డును అందుకున్నాడు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్ గా మారింది. తన సినిమాకు ఇంత ఆదరణ లభించినందుకు వేణు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపాడు. ఇక ఈ అవార్డు అందుకున్న వేణుకు, చిత్ర బృందానికి అభిమానులు, సినీ ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
