NTV Telugu Site icon

14 షరతులతో ఆర్యన్ కు బెయిల్… అవేంటంటే ?

aryan-khan

aryan-khan

డ్రగ్స్ కేసులో దాదాపు 26 రోజులు జైలులో గడిపిన ఆర్యన్ ఖాన్ ఈరోజు బెయిల్ పై విడుదలై జైలు నుంచి బయటకు వచ్చారు. ఆర్యన్ తో పాటు ఆయన స్నేహితుడు అర్బాజ్ మర్చంట్, మోడల్ మున్మున్ ధమేచా కూడా ఈరోజు జైలు నుంచి బయటకు వచ్చారు. క్రూయిజ్ డ్రగ్స్ పార్టీ కేసులో వీరందరినీ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అక్టోబర్ 3న అరెస్టు చేసింది. ముగ్గురిపై నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్‌స్టాన్సెస్ (ఎన్‌డిపిఎస్) చట్టం కింద కేసు నమోదు చేశారు. వీరితో పాటు మరో 20 మందిని కూడా అరెస్ట్ చేశారు ఎన్సీబీ అధికారులు.

14 బెయిల్ షరతులతో కూడిన ఐదు పేజీల బెయిల్ ఆర్డర్‌ను బాంబే హైకోర్టు జారీ చేసింది. బెయిల్ కోసం ష్యూరిటీగా రూ.లక్ష బాండ్‌ తో పాటు ఒకరి హామీని కూడా తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. న్యాయవాది సతీష్ మనేషిండే ఆర్యన్ బెయిల్ కేసును వాదించగా, నటి జుహీ చావ్లా ఆర్యన్‌కు ష్యూరిటీ ఇచ్చారు. మరోవైపు ఆయన స్నేహితులకు ఎలాంటి ష్యూరిటీ అడగలేదు కోర్టు. అయితే బెయిల్ మంజూరుతో పాటు కోర్టు పెట్టిన షరతులకు సంబంధించి, బెయిల్ ఆర్డర్ ప్రకారం ముగ్గురు నిందితులు ప్రతి శుక్రవారం ఎన్సీబీ ముంబై కార్యాలయంలో హాజరు కావాలి. ఎన్డీపీఎస్ కోర్టు అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లేందుకు వీల్లేదు. దీంతో పాటు తన పాస్‌పోర్టును వెంటనే ఆర్యన్ ప్రత్యేక కోర్టుకు అప్పగించాల్సి ఉంటుంది. కోర్టు ఆదేశం ప్రకారం ఆర్యన్ సహ నిందితులతో టచ్‌లో ఉండకూడదు.

Read Also : జైలు నుంచి ఆర్యన్ ఖాన్ రిలీజ్

14 బెయిల్ షరతులు ఇవే :

  1. కోర్టు ఆదేశాల మేరకు నిందితులు రూ.లక్ష పీఆర్ బాండ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సెక్యూరిటీ డిపాజిట్లతో సమర్పించవచ్చు.
  2. నిందితులపై ఎన్‌డిపిఎస్ చట్టం కింద నమోదైన కేసు లాంటి కార్యకలాపాలకు, దానికి సమానమైన కార్యకలాపాలలో పాల్గొనకూడదు.
  3. నిందితుడు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా తన సహ నిందితుడితో మాట్లాడకూడదు. లేదా ఇలాంటి కార్యకలాపాలలో పాలు పంచుకున్న ఇతర వ్యక్తులతో ఏ విధంగానూ సంబంధాన్ని ఏర్పరచుకోవడానికి ప్రయత్నించకూడదు.
  4. నిందితుడు ప్రత్యేక న్యాయస్థానం విచారణకు విఘాతం కలిగించే ఏ పనీ చేయకూడదు.
  5. నిందితుడు వ్యక్తిగతంగా లేదా ఏ విధంగానూ సాక్షులను ప్రభావితం చేయడానికి లేదా సాక్ష్యాలను తారుమారు చేయడానికి ప్రయత్నించకూడదు.
  6. నిందితులు తమ పాస్‌పోర్టును వెంటనే ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరచాల్సి ఉంటుంది.
  7. ప్రత్యేక కోర్టులో పెండింగ్‌లో ఉన్న పైన పేర్కొన్న చర్యలకు సంబంధించి నిందితుడు ఏ మీడియాలోనూ ఎలాంటి ప్రకటన చేయకూడదు. (ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియాతో సహా).
  8. గ్రేటర్ ముంబైలోని స్పెషల్ ఎన్‌డిపిఎస్ జడ్జి ముందస్తు అనుమతి లేకుండా నిందితులు దేశం విడిచి వెళ్ళకూడదు.
  9. నిందితులు గ్రేటర్ ముంబై నుండి బయటకు వెళ్లవలసి వస్తే, దర్యాప్తు అధికారికి తెలియజేసి, వారి ప్రయాణ వివరాలను దర్యాప్తు అధికారికి అందించాలి.
  10. నిందితులు స్థానికంగానే ఉన్నారని తెలిపేందుకు ప్రతి శుక్రవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల మధ్య ఎన్‌సీబీ ముంబై కార్యాలయంలో హాజరుకావాలి.
  11. ఏదైనా న్యాయమైన కారణం ఉంటే తప్ప నిందితుడు అన్ని తేదీలలో కోర్టుకు హాజరు కావాలి.
  12. నిందితులు ఎప్పుడు పిలిచినా ఎన్‌సీబీ అధికారుల ముందు హాజరు కావాల్సి ఉంటుంది.
  13. విచారణ ప్రారంభమైన తర్వాత దరఖాస్తుదారు/నిందితులు విచారణను ఏ విధంగానూ ఆలస్యం చేయడానికి ప్రయత్నించరాదు.
  14. నిందితుడు ఈ షరతుల్లో దేనినైనా ఉల్లంఘిస్తే వారి బెయిల్ రద్దు కోసం ప్రత్యేక న్యాయమూర్తి/కోర్టుకు నేరుగా దరఖాస్తు చేసుకునే హక్కు ఎన్సీబీకి ఉంటుంది.