‘అవతార్-2’గా జనం ముందు నిలచిన ‘అవతార్ : ద వే ఆఫ్ వాటర్’ చిత్రం మొదటి రోజు నుంచే డివైడ్ టాక్ తో సాగింది. అయితే ఆ సినిమా ప్రీక్వెల్ ‘అవతార్-1’కు ఈ చిత్రానికి దాదాపు 13 ఏళ్ళు గ్యాప్ ఉండడంతో ఎలా ఉన్నా జనం చూసేస్తారని చిత్ర దర్శకుడు జేమ్స్ కేమరాన్ ఆశించారు. అంతేకాదు, ఈ సినిమా ఫ్లాప్ అయితే తరువాత సీక్వెల్స్ ను విడుదల చేయననీ, అసలు తీయబోననీ ప్రేక్షకులను బ్లాక్ మెయిల్ చేశారు జేమ్స్. అతని బాధ చూసి కాబోలు మొత్తానికి అభిమానులు ‘అవతార్-2’ను బాగోలేదంటూనే పదే పదే చూశారు. మొత్తానికి పెట్టిన పెట్టుబడికి నాలుగు రెట్లు రాబడిచూసింది ‘అవతార్: ద వే ఆఫ్ వాటర్’.
‘అవతార్-2’ కంటే మార్వెల్ కామిక్స్ ‘అవెంజర్స్- ది ఎండ్ గేమ్’ వసూళ్ళలో ముందు వరుసలో నిలచింది. దానిని ఫుల్ రన్ లో ‘అవతార్-2’ అధిగమిస్తుందని అందరూ భావించారు. అయితే ఇప్పటికి ‘అవతార్-2’ విడుదలై ఐదు నెలలు పూర్తయింది. జూన్ లో ఈ సినిమా ఓటీటీలో వెలుగు చూడనుంది. ఈ నేపథ్యంలో ఇక ‘అవతార్-2’ ఫుల్ రన్ పూర్తి అయినట్టే అని సినీ పండిట్స్ చెబుతున్నారు. ఈ ఐదు నెలల్లో ‘అవతార్-2’ 2 బిలియన్ల 320 మిలియన్ల వసూళ్ళు చూసింది. 400 మిలియన్లతో రూపొందిన ఈ చిత్రం మంచి లాభాలు చూసినట్టే లెక్క! అయితే ఇదే వ్యయంతో తెరకెక్కిన ‘అవెంజర్స్ – ది ఎండ్ గేమ్’ ఈ సినిమా కంటే దాదాపు 478 మిలియన్లు ఎక్కువగా వసూలు చేసింది.దానిని అధిగమించడం ఇక కుదరని పనే అంటున్నారు సినీ పండిట్స్. జేమ్స్ కేమరాన్ అభిమానులకు ఇది చేదు వార్తే అయినా, ఇప్పటికీ ‘అవతార్-1’ అగ్రపథాన నిలచి, ‘అవెంజర్స్- ది ఎండ్ గేమ్’ కన్నా మిన్నగానే వసూళ్ళు చూసి ఉండడం ఆనందం కలిగిస్తోంది. మరి రాబోయే ‘అవతార్’ భాగాలను జేమ్స్ ఏ తీరున తెరకెక్కిస్తారో? అవి అభిమానులకు ఏ స్థాయి ఆనందాన్ని పంచుతాయో చూడాలి.