Avasraniko Abaddam: మనిషి జీవితంలో నిజానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో అబద్దానికి కూడా అంతే ఇంపార్టెన్స్ ఉందని చెప్పే సందేశాత్మక చిత్రమే ‘అవసరానికో అబద్దం’. త్రిగున్, రుబాల్ షెకావత్ జంటగా ఆయాన్ బొమ్మాళిని దర్శకుడిగా పరిచయం చేస్తూ డాక్టర్ జై యలమంచిలి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా పూజా కార్యక్రమాలు శుక్రవారం రామానాయుడు స్టూడియోలో వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో నిర్మాత దిల్ రాజు, తెలుగు నిర్మాతల మండలి ప్రెసిడెంట్ దామోదర ప్రసాద్, నిర్మాత సురేష్ బాబు, తెలంగాణ పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ దామోదర్ కోలేటి, చిత్ర నిర్మాత సోదరుడు రమేష్ యలమంచిలి, విజయవాడ తూర్పు వై. సి. పి. ఇంచార్జ్ దేవినేని అవినాష్, ఆంధ్రప్రదేశ్ బీజేపీ సెక్రటరీ నాగభూషణం పాతూరి, బీజేపీ నేషనల్ ఫైనాన్సియల్ స్పోక్ పర్సన్ లంకా దినకర్, రాజేంద్ర ఎనిగల్ల, శంకర్ చెన్నంశెట్టి తదితరులు పాల్గొన్నారు. హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దిల్ రాజు క్లాప్ కొట్టగా, దామోదర ప్రసాద్ కెమెరా స్విచ్ ఆన్ చేసారు. నిర్మాత సురేష్ బాబు గౌరవ దర్శకత్వం వహించారు.
అనంతరం దర్శకుడు ఆయన్ బొమ్మాళి మాట్లాడుతూ, ”మహాభారతంలో శ్రీ కృష్ణుడు కొన్ని సందర్భాల్లో అబద్దం ఆడవచ్చు అని చెప్పాడు. దాన్ని బేస్ గా చేసుకుని కమర్శియల్ వేలో రాసుకున్న కథ ఇది. ధర్మం కాపాడాలి అంటే ధర్మరాజు తోనే అబద్ధం ఆడించాలనే స్ట్రాంగ్ క్యారెక్టర్ హీరోది. మణిశర్మ గారు మా సినిమాకు మ్యూజిక్ చేయడం చాలా సంతోషంగా ఉంది. మంచి కథతో చేస్తున్న ఈ సినిమా అన్ని వర్గాల వారికీ కచ్చితంగా నచ్చుతుంది. అన్నారు. నిర్మాతలు కృష్ణమూర్తి యలమంచిలి, డాక్టర్ జై యలమంచిలి మాట్లాడుతూ, ”సినిమా అంటే మాకు చాలా ఇష్టం.ఇదే సినిమా ఇండస్ట్రీలో పెరిగిన వాళ్ళం. ఏ టెంపుల్ కు వెళ్లినా, చర్చి కి వెళ్లినా, మసీద్ కు వెళ్లినా అందరూ ధర్మో రక్షిత రక్షితః అంటాము. ధర్మాన్ని గెలిపించాలి అనే ఒక ఉద్దేశంతో మేము చేస్తున్న ఈ ఒక మంచి ప్రయత్నం ఈ సినిమా. మంచి కథతో వస్తున్న ఈ సినిమా అందరికీ కచ్చితంగా నచ్చుతుంది” అని అన్నారు. హీరో త్రిగున్ మాట్లాడుతూ, ”ఇప్పటి వరకు చాలా క్రాస్ జోనర్ సినిమాలు చేశాను. అలాగే ఆయాన్ బొమ్మాళి చెప్పిన కథ చాలా డిఫరెంట్ గా అనిపించిడంతో ఈ సినిమా చేస్తున్నాను. మా గురువు మణి శర్మగారు నాకు 2022 లో ‘పదములే లేవు పిల్ల’ వంటి బ్లాక్ బస్టర్ సాంగ్ ఇచ్చారు. మళ్ళీ ఆయన ఈ సినిమాకు వర్క్ చేయడం ఆనందంగా ఉంది” అని అన్నారు. ఇలాంటి మంచి సినిమాలో ఛాన్స్ ఇచ్చిన దర్శక నిర్మాతలకు హీరోయిన్ రుబాల్ షెకావత్ ధన్యవాదాలు తెలిపింది.
