చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది.. చిన్న వయస్సులోనే అస్సామీ నటుడు కిషోర్ దాస్ మృత్యువాత పడ్డాడు. అస్సామీ టీవీ సీరియల్స్ లో హీరోగా, నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న కిషోర్ దాదాపు 300కు పైగా మ్యూజిక్ ఆల్బమ్స్ లో నటించి మెప్పించాడు. ఇకపోతే గత కొన్నేళ్లుగా కిషోర్ క్యాన్సర్ తో పోరాడుతున్నాడు. గతేడాది మార్చి నుంచి ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నాడు. ఈ నేపథ్యంలోనే ఇటీవల కరోనా బారిన పడ్డాడు. ఒక పక్క క్యాన్సర్, ఇంకోపక్క కరోనాతో పోరాడి 30 ఏళ్ళ కిషోర్ ఓడిపోయాడు.
కరోనా సోకడంతోనే కిషోర్ మృతి చెందాడని, అతడిని కాపాడడానికి తమ శాయశక్తులా ప్రయత్నించామని వైద్యులు తెలిపారు. కిషోర్ మరణం ప్రస్తుతం అస్సాంలో సంచలనం సృష్టిస్తోంది. పట్టుమని 30 ఏళ్లు కూడా దాటకుండానే కిషోర్ మృత్యువాత పడడం అతని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం అతడి అంత్యక్రియలు చెన్నైలోనే నిర్వహించనున్నారు. కరోనా సోకడంతో అతడి స్వస్థలానికి బాడీని పంపించబోయేది లేదని వైద్యులు తెలిపారు. దీంతో తమ అభిమాన నటుడు చివరి చూపుకు కూడా అభిమానులు నోచుకోలేకపోవడం విచారకరం. ఇక కిషోర్ మరణవార్త విన్న పలువురు ప్రముఖులు అతడికి తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.
