కొన్ని రోజుల క్రితం బాలీవుడ్ నటి దీపికా పదుకొణె ఆసుపత్రిలో చేరిన వార్త ఎంత హల్‌చల్ సృష్టించిందో అందరికీ తెలుసు! ఆ వెంటనే డిశ్చార్జ్ అయ్యింది కానీ, ఆమె ఆరోగ్యంపై పూర్తి స్పష్టత రాలేదు. ఈ నేపథ్యంలోనే తాజాగా ప్రాజెక్ట్ కే నిర్మాత అశ్వినీ దత్ ఆమె ఆరోగ్యంపై క్లారిటీ ఇచ్చారు. దీపికాకి బీపీ ఇష్యూస్ ఉన్నాయని, అందుకే హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యిందన్నారు. అయితే.. గంటలోపే ఆమె డిశ్చార్జ్ అయ్యిందని, తిరిగి షూటింగ్‌లో పాల్గొందని వెల్లడించారు. అంతేకాదు.. ప్రస్తుతం అమితాభ్ బచ్చన్, దీపికాలపై సన్నివేశాలు షూట్ చేస్తున్నామని కూడా వెల్లడించారు. చూస్తుంటే, చిత్రబృందం వీరిద్దరి పార్ట్‌లను త్వరగా షూట్ చేసేలా పక్కా ప్రణాళికలు నిర్వహించుకున్నట్టు తెలుస్తోంది.
కాగా.. భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సై-ఫై సినిమాలో ప్రభాస్ సూపర్ పవర్స్ ఉన్న హీరోగా కనిపించనున్నట్టు తెలిసింది. అశ్వత్థామ స్ఫూర్తితో అమితాభ్ బచ్చన్ పాత్రని డిజైన్ చేయగా, ఆయన కూతురిగా దీపికా నటిస్తోంది. ప్యాన్ వరల్డ్ సబ్జెక్ట్‌తో రూపొందుతుండడంతో, ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా భారీఎత్తున విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ చిత్రాన్ని 2024లో రిలీజ్ చేయనున్నారు. మరోవైపు, ప్రభాస్ ‘సలార్’ షూట్‌లోనూ బిజీగా ఉన్నాడు. కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్. ప్రస్తుతం తొలి భాగం షూటింగ్‌ని శరవేగంగా జరుపుతున్నారు. వచ్చే ఏడాది సమ్మర్‌లో సలార్‌ని రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
అటు.. ప్రభాస్ ఈ గ్యాప్‌లో మరో సినిమా చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే, భారీ సినిమా కాకుండా ఓ సాధారణ మూవీ చేయాలనుకున్నాడు. అందుకే, దర్శకుడు మారుతితో చేతులు కలిపాడు. రాజా డీలక్స్ అనే టైటిల్‌ని ఈ చిత్రానికి పరిశీలిస్తున్నారు. త్వరలోనే సెట్స్ మీదకి వెళ్ళనున్న ఈ సినిమా.. పూర్తి కామెడీ ఎంటర్టైనర్‌గా తెరకెక్కనుంది. ఇందులో హారర్ ఎలిమెంట్స్ కూడా ఉండనున్నట్టు సమాచారం.
