NTV Telugu Site icon

Antha Mana Manchike Movie : యాభై ఏళ్ళ ‘అంతా మన మంచికే’

Antha Mana Manchike

Antha Mana Manchike

(ఏప్రిల్ 19న ‘అంతా మన మంచికే’కు 50 ఏళ్ళు)
మహానటి, బహుముఖ ప్రజ్ఞాశాలి భానుమతి రామకృష్ణ 1953లోనే ‘చండీరాణి’తో దర్శకురాలిగా మెగాఫోన్ పట్టారు. ఆ తరువాత దాదాపు 19 ఏళ్ళ వరకు ఆమె దర్శకత్వం ఊసు ఎత్తలేదు. 1972లో స్వీయ దర్శకత్వంలో తమ భరణీ పిక్చర్స్ పతాకంపై ‘అంతా మన మంచికే’ అనే చిత్రాన్ని నిర్మించి, నటించారు భానుమతి. ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, మాటలు, సంగీతం, దర్శకత్వం భానుమతి నిర్వహించారు. ఈ సినిమాలో కృష్ణ ఓ ప్రధాన పాత్ర ధరించారు. 1972 ఏప్రిల్ 19న ‘అంతా మనమంచికే’ విడుదలయింది.

ఈ చిత్రం కథ ఏమిటంటే – సావిత్రి సంగీతం పాఠాలు చెబుతూ, చెల్లిని, తండ్రిని పోషిస్తూ ఉంటుంది. తండ్రి మరణించాక, చెల్లెలి పెళ్ళి బాధ్యత తీసుకుంటుంది. ఆమె చెల్లెలు ఆ ఊరి షావుకారు కొడుకు రఘును ప్రేమిస్తుంది. అది నచ్చని షావుకారు సావిత్రిని పలు ఇబ్బందుల పాలు చేస్తాడు. సావిత్రిని మోసం చేసి జైలుకు కూడా పంపిస్తారు. అన్నిటినీ దిగమింగుకొని చెల్లెలి పెళ్లి చేయాలన్నదే ధ్యేయంగా సావిత్రి ఉంటుంది. అయితే సావిత్రి చెల్లెలిని రఘు చేసుకోవడానికి అతని కన్నవారు అడ్డు పడతారు. షావుకారు కూతురును పెళ్ళాడతానని ఓ మోసగాడు మోసం చేస్తాడు. రఘు చెల్లెలిని మోసం చేసినవాడికి తగిన బుద్ధి చెప్పి పెళ్ళి జరిపిస్తుంది సావిత్రి. దాంతో షావుకారు కూడా సావిత్రి మంచితనం తెలుసుకుంటాడు. చివరకు ఆమె చెల్లెలిని తన కోడలుగా సంతోషంగా చేసుకోవడంతో కథ ముగుస్తుంది.

ఇందులో సూర్యకాంతం, ఛాయాదేవి, కృష్ణ, కృష్ణంరాజు, నాగయ్య, నాగభూషణం, ధూళిపాల, పద్మనాభం, మిక్కిలినేని, టి.పద్మిని, ఋష్యేంద్రమణి, బేబీ రాణి, బేబీ పద్మ, సాక్షి రంగారావు, ముక్కామల, రమాప్రభ, లీలారాణి, జగ్గారావు తదితరులు నటించారు. ఈ చిత్రానికి భానుమతి రాసిన మాటలకు సినిమాకు అనువుగా మాటలు డి.వి.నరసరాజు సమకూర్చారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి, దాశరథి, ఆరుద్ర పాటలు పలికించారు. భానుమతి పర్యవేక్షణలో సత్యం సంగీతం సమకూర్చారు.

“నీవేరా నా మదిలో… తిరుమలవాసా…”, “నేనే రాధనోయి గోపాలా…”, “ఆనందం… మధురానందం…”, “మాట చాలదా…మనసు చాలదా…”, “నవ్వవే ఓ చెలీ…” వంటి పాటలు ఆకట్టుకున్నాయి. ఈ పాటలతో పాటు కొన్ని శాస్త్రీయ సంగీత గీతాలు సైతం ఈ చిత్రంలో చోటుచేసుకొన్నాయి. భానుమతి దర్శకత్వంలో రూపొందిన తొలి చిత్రం ‘చండీరాణి’ తెలుగు, తమిళ, హిందీ భాషల్లో రూపొంది ఏక కాలంలో విడుదలై విజయం సాధించగా, ఈ సినిమా ఆమెకు నిరాశ కలిగించిందనే చెప్పాలి.