NTV Telugu Site icon

Annu Kapoor: ఆమిర్ తెలియదన్నాడు.. అడ్డంగా బుక్కయ్యాడు

Annu Kapoor Trolled Over Am

Annu Kapoor Trolled Over Am

Annu Kapoor Gets Brutally Trolled Over Aamir Khan Issue: స్టార్ హీరోల గురించి ఎవరికైనా తెలియకుండా ఉంటుందా? చిన్న పిల్లలకు సైతం ఫోటోలు చూపించి ఎవరని అడిగితే, ఫలానా స్టార్ హీరోల పేర్లు చెప్పేస్తారు. అలాంటిది.. 40 సంవత్సరాల నుంచి సినీ పరిశ్రమలో ఉన్న సీనియర్ నటుడు అన్నూ కపూర్‌కి ఆమిర్ ఖాన్ ఎవరో తెలియదట! ఇదేదో ఆయన కామెడీగా చెప్పింది కాదు, నిజంగానే తనకు ఆమిర్ ఖాన్ ఎవరో తెలియదని ఓ ప్రెస్‌మీట్‌లో చెప్పాడు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు బాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారాయి. నెటిజన్లు ఆయనపై ధ్వజమెత్తుతున్నారు.

సహాయ నటుడిగా, కమెడియన్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అన్నూ కపూర్.. క్రాష్ కోర్స్ అనే వెబ్ సిరీస్‌లో ఓ కీలక పాత్రలో నటించారు. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన సందర్భంగా, మేకర్స్ ఒక ప్రెస్‌మీట్ ఏర్పాటు చేశారు. ఇందుకు అన్నూ కూడా హాజరయ్యారు. ఈ నేపథ్యంలోనే ఓ రిపోర్టర్.. ‘‘సర్, ఆమిర్ ఖాన్ నటించిన ‘లాల్ సింగ్ చడ్డా’ విడుదలవుతోంది కదా, దానిపై మీ అభిప్రాయం ఏంటి?’’ అని ప్రశ్నించాడు. అందుకు వెంటనే.. ‘‘ఇంతకీ ఆ సినిమా ఏంటి? సాధారణంగా నేను సినిమాలు చూడను కాబట్టి, ఆ సినిమా గురించి నాకు తెలియదు’’ అని అన్నాడు. పక్కనే ఉన్న ఆయన మేనేజర్ ‘నో కామెంట్స్’ అని మీడియాకి సమాధానిస్తుండగా.. ‘‘ఇది నో కామెంట్స్ అని సమాధానం చెప్పాల్సిన ప్రశ్న కాదు’’ అని అన్నూ చెప్పాడు.

అంతేకాదు.. ‘‘నేను నా సినిమాలు సహా ఇతరులు నటించిన సినిమాలేవీ అస్సలు చూడను. నిజం చెప్పాలంటే, మీరు అడుగుతున్న ఆ నటుడెవరో కూడా నాకు తెలీదు. అలాంటప్పుడు ఆయన గురించి నేనెలా మాట్లాడగలను’’ అని అన్నూ చెప్పుకొచ్చాడు. ఈ వీడియో కాస్త నెట్టింట్లో వైరల్ అవ్వడంతో.. నెటిజన్లు ఆయనపై సీరియస్ అవుతున్నారు. బాలీవుడ్ స్టార్ అయిన ఆమిర్ ఖాన్ ఎవరో తెలియనప్పుడు, సినీ ఇండస్ట్రీలో ఎందుకు ఉన్నావు’’ అంటూ ప్రశ్నిస్తున్నారు. సినిమాలు చూడవు, ఆమిర్ ఎవరో తెలీదు.. మరి ఇండస్ట్రీలో ఎందుకున్నావు?’’ అని మరికొందరు నిలదీస్తున్నారు. చూస్తుంటే, ఈ వ్యాఖ్యలు ఇండస్ట్రీలో ఊహించని పరిణామాలకు దారి తీస్తున్నట్టు కనిపిస్తోంది.