Anna Reshma Rajan Locked Inside Telecom Company By Staff: నటీనటులకు ప్రేక్షకుల నుంచి ఎంత ప్రేమాభిమానాలు దక్కుతాయో ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. బయట ఎక్కడైనా తారసపడితే చాలు.. వారితో కలిసేందుకు, ఒక ఫోటో దిగేందుకు తహతహలాడుతారు. కానీ, ఇక్కడ ఓ మలయాళ నటికి మాత్రం అందుకు భిన్నంగా చేదు అనుభవం ఎదురైంది. సిమ్ కార్డ్ కొనేందుకు ఒక షోరూమ్‌కి వెళ్తే.. అక్కడి సిబ్బంది ఆమెతో గొడవకి దిగడమే కాకుండా స్టోర్‌లో బంధించింది. తీవ్ర కలకలం రేపిన ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే.. ‘అంగమలి డైరీస్’ ఫేమ్ నటి అన్నా రేష్మ రాజన్ గురువారం ఒక సిమ్ కార్డ్ కొనేందుకు దగ్గర్లో ఉన్న ఒక టెలికాం కంపెనీ ఆఫీస్‌కి వెళ్లింది. అయితే.. తాను నటి కావడంతో, పబ్లిక్ ప్లేస్‌లో అందరూ గుమిగూడుతారన్న ఉద్దేశంతో మాస్క్ వేసుకొని అక్కడికి వెళ్లింది. అయితే.. సిమ్ తీసుకునే విషయంలో అన్నాకు, సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. దీంతో.. కోపంతో రగిలిపోయిన సిబ్బంది, ఆ నటికి స్టోర్ లోపల ఉంచేసి, తాళం వేసేసింది.
సిబ్బంది వ్యవహార శైలితో ఖంగుతిన్న ఆ అమ్మడు.. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరువురి మధ్య గొడవను పరిష్కరించారు. ఈ వ్యవహారంపై అన్నా రాజన్ మాట్లాడుతూ.. ‘‘ఓ సిమ్ కార్డ్ కోసం నటిగా కాకుండా సాధారణ మహిళగా ముఖానికి మాస్క్ పెట్టుకొని ఓ టెలికాం కంపెనీకి వెళ్లాను. సిమ్ కార్డు తీసుకునే క్రమంలో వారికి, నాకు మధ్య గొడవ నెలకొంది. కోపంతో వాళ్లు నన్ను లోపలే బంధించి, తాళం వేశారు. తర్వాత ఇలా చేసినందుకు వాళ్లు క్షమాపణలు చెప్పడంతో.. నేను కేసు వెనక్కి తీసుకున్నాను’’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే.. సిబ్బందికి, నటికి మధ్య ఏ విషయంలో గొడవ జరిగిందన్న దానిపై పూర్తి క్లారిటీ లేదు. కాగా.. 2017లో ‘అంగమలి డైరీస్’తో తెరంగేట్రం చేసిన అన్నా రాజన్, ఆ తర్వాత ‘వేలిపడింతె పుస్తకం’, ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ సినిమాల్లో నటించింది.
