తెలుగు సినిమా సంగీతాన్ని కొన్నేళ్లుగా దేవిశ్రీ ప్రసాద్, తమన్ ఏలుతున్నారు. ఏ పెద్ద సినిమా చూసినా వాళ్లిద్దరే ఉంటారు. అయితే, దేవిశ్రీ హీరోగా మారటం వల్లనో ఏమో కానీ రాక్‌స్టార్ హవా తగ్గింది. తమన్ బిజీగా ఉన్నా, టాప్ ప్లేస్ కి పోటీ ఇవ్వలేకపోతున్నాడు. హీరోల మధ్యనే కాదు, మ్యూజిక్ డైరెక్టర్స్ మధ్య కూడా రెమ్యునరేషన్ వార్ నడుస్తోంది. ఇండియాలో ఎక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటున్న మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే, మూడేళ్ల క్రితం వరకు రెహమాన్ అని చెప్పేవారు. ఈ ఆస్కార్ విన్నర్ మ్యూజికల్ హిట్స్ ఇచ్చి చాలా కాలమైనా, ఇంతకాలం కేవలం బిజిఎమ్ (BGM)తో మాత్రమే క్రేజ్‌ను కంటిన్యూ చేశాడు. మ్యూజిక్ తో పాటు రెమ్యునరేషన్ పరంగా అనిరుధ్, రెహమాన్‌ను దాటేశాడు. వరుస మ్యూజికల్ హిట్స్ తో అనిరుధ్ అదరగొట్టేస్తున్నాడు. ‘విక్రమ్’ సినిమాకు అనిరుధ్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌కు ఆడియన్స్ ఫిదా అయ్యారు. తమిళ మ్యూజిక్ ప్రస్తుతం అనిరుధ్ చుట్టూనే తిరుగుతోంది. ఇప్పుడు ఇది తెలుగు సినిమాలకు పాకింది. తమిళ తంబీలకే కాదు, తెలుగు హీరోలకు కూడా అనిరుధ్ కావాలి.
ఫ్లాప్ మూవీ ‘అజ్ఞాతవాసి’తో అనిరుధ్ టాలీవుడ్‌లోకి అడుగు పెట్టాడు. ఆ తర్వాత మ్యూజిక్ ఇచ్చిన ‘గ్యాంగ్ లీడర్’ నిరాశ పరిచినా, ‘జర్సీ’ సక్సెస్ అయింది. ఎట్టకేలకి ఎన్టీఆర్ ‘దేవర’తో మరో ఆఫర్ ఇస్తే, ‘చుట్టమల్లే’ అంటూ టాలీవుడ్ ని చుట్టేశాడు. రెహమాన్ ఒక్కో సినిమాకు 10 నుంచి 15 కోట్లు ఛార్జ్ చేస్తుంటే, అనిరుధ్ మాత్రం 25 కోట్లు తీసుకున్నాడట. సినిమా సినిమాకు రెమ్యునరేషన్ పెంచేసినా, అనిరుధ్ వెనకాలే పడుతున్నారు. తెలుగు క్రేజీ ప్రాజెక్ట్స్ ఈ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ చేతుల్లోనే ఉన్నాయి. 10, 15 కోట్లు తీసుకునే అనిరుధ్ కి తెలుగు మేకర్సే రెమ్యునరేషన్ పెంచేశారా అనిపిస్తోంది. ఏ క్రేజీ ప్రాజెక్ట్ చూసినా అనిరుధ్ పేరే కనిపిస్తోంది.
గాడ్ ఆఫ్ వార్ కథతో రూపొందే ఎన్టీఆర్ – త్రివిక్రమ్ మూవీ కోసం అనిరుధ్‌ను తీసుకున్నారు. త్రివిక్రమ్, అనిరుధ్ కాంబోలో వచ్చిన ‘అజ్ఞాతవాసి’ ఫ్లాప్ అయినా, తన తొలి పాన్ ఇండియా మూవీ కోసం సెంటిమెంట్‌ను పక్కన పెట్టేసి అనిరుధ్‌ను తీసుకున్నాడు గురూజీ.
ఇక లోకేష్ కనగరాజ్ అయితే, అనిరుధ్‌ను తప్ప మరో మ్యూజిక్ డైరెక్టర్ వైపు చూడడు. ‘కూలీ’ తర్వాత లోకేష్ హీరోగా నటిస్తున్న డీసీ మూవీతో పాటు, త్వరలో తీయబోయే అల్లు అర్జున్ మూవీకి కూడా అనిరుధే మ్యూజిక్ డైరెక్టర్. నాని నటిస్తున్న హై బడ్జెట్ మూవీ ‘పారడైజ్’కు అనిరుధ్ మ్యూజిక్ ఇస్తున్నాడు. మూడేళ్లుగా ప్రతి ఏడాది అనిరుధ్ చేతిలో 10 సినిమాలు ఉంటున్నాయి. టైమ్‌కి ట్యూన్స్, బిజిఎమ్ ఇవ్వకుండా ఇబ్బంది పెడతాడన్న విషయం ఇండస్ట్రీలో అందరికీ తెలిసినా, అనిరుధే కావాలంటున్నారు. ముఖ్యంగా తెలుగు దర్శక నిర్మాతలు క్రేజీ ఆఫర్స్ ఇచ్చి, అనిరుధ్ రెమ్యునరేషన్‌ను పాతిక కోట్లకు తీసుకెళ్ళిపోయారు అన్న టాక్ నడుస్తోంది. విజయ్ హీరోగా నటించిన చివరి మూవీ ‘జననాయగన్’కు అనిరుధ్ మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే ‘జైలర్ 2’తో పాటు, రజినీకాంత్ హీరోగా కమల్ హాసన్ నిర్మించే ‘ధర్మన్’ చిత్రంతో పాటు, నెల్సన్ దర్శకత్వంలో ఇద్దరు సూపర్ స్టార్స్ కలిసి నటించే క్రేజీ ప్రాజెక్ట్ కూడా అనిరుధే తీసుకున్నాడు. ‘జవాన్’లో అనిరుధ్ వర్క్‌కి ఇంప్రెస్ అయిన షారుఖ్, ‘కింగ్’ మూవీ కోసం ఏరి కోరి అనిరుధ్‌నే తీసుకున్నాడు. ఇంతమంది స్టార్స్ వెనకాల పడుతుంటే, అనిరుధ్ రెమ్యునరేషన్ పాతిక కోట్లకు చేరింది. మరీ పెద్ద సినిమా అయితే 30 కోట్లు కూడా డిమాండ్ చేస్తున్నాడట.

