Film Federation: ఫెడరేషన్ అధ్యక్షుడిపై విమర్శలపై 23 క్రాఫ్ట్స్ సీరియస్

Tfi

Tfi

తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయిస్ ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేనిపై కావాలని లేనిపోని నిందలు వేస్తూ, సినీ పరిశ్రమలో వివాదాలు సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని 23 క్రాఫ్ట్స్ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్‌లో ఫెడరేషన్ ఆధ్వర్యంలో అత్యవసర విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఫెడరేషన్ సెక్రటరీ రాజేంద్ర ప్రసాద్, కోశాధికారి వెల్లంకి శ్రీనివాస్‌లతో పాటు 23 క్రాఫ్ట్స్ అధ్యక్షులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రొడక్షన్ యూనియన్ ప్రెసిడెంట్ కృష్ణ మాట్లాడుతూ.. ఫెడరేషన్‌ను, దాని అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దుష్ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు.

సుమలత దేవి అసత్య ప్రచారాలను ఖండిస్తున్నాం

డ్యాన్సర్స్ అసోసియేషన్ వివాదంలో ఫెడరేషన్ అధ్యక్షుడు అనిల్ వల్లభనేనిపై సుమలత దేవి చేస్తున్న వ్యక్తిగత ఆరోపణలు అత్యంత దారుణమని ప్రొడక్షన్ యూనియన్ ప్రెసిడెంట్ కృష్ణ మండిపడ్డారు. డ్యాన్సర్స్ అసోసియేషన్ సమస్య తలెత్తినప్పుడు ఫెడరేషన్ తరఫున అందరికీ ఆమోదయోగ్యమైన, న్యాయబద్ధమైన సూచనలు మాత్రమే చేశామని గుర్తుచేశారు. కానీ సుమలత దేవి కావాలని ఫెడరేషన్‌పై బురద చల్లుతూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. డ్యాన్సర్ల సమావేశంలో సుమలత దేవికి మద్దతుగా కేవలం 12 మంది చేతులెత్తితే, దాదాపు 250 మంది డ్యాన్సర్లు ఆమెకు వ్యతిరేకంగా నిలబడ్డారనే విషయాన్ని స్పష్టం చేశారు.

వ్యక్తి కంటే వ్యవస్థే ముఖ్యం.. తిరగబడితే పరిస్థితులు వేరేలా ఉంటాయి

సినీ పరిశ్రమలో ఏ ఒక్క వ్యక్తి కంటే కూడా వ్యవస్థే ముఖ్యమని, అందరూ కలిసిమెలిసి ప్రశాంతంగా పనిచేసుకుంటున్న సమయంలో ప్రాంతాల పేర్లతో విభాగాలు, విభేదాలు సృష్టించడం సరికాదని కృష్ణ స్పష్టం చేశారు. ఆంధ్రా, తెలంగాణ యూనియన్లతో ఫెడరేషన్ ఎప్పుడూ సమన్వయంతో కలిసికట్టుగానే పనిచేస్తుందని చెప్పారు. ఇప్పటికైనా అనవసర విమర్శలు, అసత్య ప్రచారాలు మానుకుని అందరూ ఒకే చోట కూర్చొని మాట్లాడుకోవాలని సూచించారు. తాము ఓపికతో ఉన్నామని, ఒకవేళ ఫెడరేషన్ కార్మికులంతా తిరగబడితే పరిణామాలు వేరేలా ఉంటాయని తీవ్రంగా హెచ్చరించారు.

సినిమా కార్మికులకు సీఎం రేవంత్ రెడ్డి అండ.. కలసికట్టుగా పనిచేస్తున్నాం

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ కార్మికుల సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని స్పష్టమైన భరోసా ఇచ్చారని కృష్ణ తెలిపారు. ప్రభుత్వం నుంచి సినీ కార్మికులకు ఇంత మంచి మద్దతు లభిస్తున్న సమయంలో, కొందరు స్వార్థ ప్రయోజనాల కోసం ఫెడరేషన్ మీద బురద చల్లడం దారుణమన్నారు. ఇప్పటికైనా అసత్య ప్రచారాలు ఆపి, సినీ కార్మికుల సంక్షేమం కోసం అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని పిలుపునిచ్చారు.