NTV Telugu Site icon

Rajasekhar: పాతికేళ్ళ ‘శివయ్య’

Shivayya

Shivayya

డాక్టర్ రాజశేఖర్ యాంగ్రీ యంగ్ మేన్ గా సాగుతున్న రోజులవి. ఆయన నటించిన ‘అన్న’ తరువాత వరుస పరాజయాలు పలకరించాయి. ఆ సమయంలో ‘మా ఆయన బంగారం’ ఊరటనిచ్చింది.అయితే ఆ పై ఆయనకు మంచి విజయాన్ని అందించిన చిత్రం ‘శివయ్య’ అనే చెప్పాలి. సురేశ్ ప్రొడక్షన్స్ పతాకంపై ఆర్.సురేశ్ వర్మ దర్శకత్వంలో డి.రామానాయుడు ఈ చిత్రాన్ని నిర్మించారు. 1998 మార్చి 27న ‘శివయ్య’ జనం ముందు నిలచింది.

‘శివయ్య’ కథాకమామిషు ఏమిటంటే- జ్యోతి, పూర్ణ అనే అన్నదమ్ములు రౌడీయిజం చేస్తూ సాగుతున్న పట్నంలో శివయ్య అడుగుపెడతాడు. తన చెల్లెలిని కాలేజ్ లో చదివిస్తూ తాను ఏదైనా వ్యాపారం చేసుకోవాలని భావిస్తాడు. శివయ్యకు ఆశ్రయమిచ్చిన బాబు కూతురు శిరీష, శివయ్యపై మనసు పారేసుకుంటుంది. ఓ అమ్మాయిని నడివీధిలో బలవంతం చేస్తున్న పూర్ణను శివయ్య చితకబాదుతాడు. తమ్ముణ్ణి కొట్టాడని శివయ్యపైకి జ్యోతి వస్తాడు. వాడినీ బాదేస్తాడు శివయ్య. అప్పుడు అక్కడ ఉన్న అందరూ వచ్చి, తమకు జ్యోతి, అతని తమ్ముడు పూర్ణ చేసిన అన్యాయాల గురించి ఏకరువు పెడతారు. జ్యోతికి గుడ్డలూడదీసి, గుండు కొట్టిస్తాడు శివయ్య. మార్కెట్ లో జనం కష్టాలు చూసిన శివయ్య, ఓ స్థలం తీసుకొని, అక్కడ అందరికీ కొట్లు ఏర్పాటు చేసుకొనేలా చేస్తాడు. పగబట్టిన జ్యోతి, పూర్ణ శివయ్య చెల్లెలును ఎత్తుకెళ్ళి అతని కళ్ళముందే రేప్ చేస్తారు. అదే ఊరికి రోజా అనే ఇన్ స్పెక్టర్ వస్తుంది. గతంలో ఆ రోజా, శివయ్య ప్రేమించుకుంటారు. అయితే ఇంట్లో తండ్రి తన చెల్లి కూతురును చేసుకోమని చెప్పడంతో శివయ్య అలాగే చేస్తాడు. కానీ, శివయ్య భార్య నిత్యం అతడిని అనుమానిస్తూఉంటుంది. చివరకు నిజం తెలుసుకుంటుంది, అతని భార్య కాన్పులో మరణిస్తుంది. తన చెల్లెలి అవమానానికి తన చుట్టూ ఉన్నవాళ్ళే కారణమని శివయ్య నోటీసులు పంపుతాడు. అందరూ కోర్టుకు వెళ్ళాల్సి వస్తుంది. తమ కళ్ళ ముందే అన్యాయం జరుగుతున్నా, పట్టించుకోని వీళ్ళే అసలు దోషులని కోర్టులో అంటాడు శివయ్య. ఒకరికి ఒకరు సాయం చేసుకోకపోవడంతోనే రౌడీలు పుట్టుకు వస్తున్నారని శివయ్య చెబుతాడు. అందరిలోనూ చైతన్యం వస్తుంది. అది తెలిసి కాలనీపై దాడిచేస్తారు జ్యోతి మనుషులు. దాంతో కాలనీవాసులు వాడి ఇంటిపైకి దాడికి వెళతారు. జ్యోతి, పూర్ణ, అతని అనుచరులను కోర్టుకు ఈడుస్తారు. వారికి కోర్టు ఉరిశిక్ష విధిస్తుంది. నష్టపోయిన వారికి వారి ఆస్తులు జప్తుచేసి, తద్వారా ఆర్థిక సాయం అందించాలనీ ఆదేస్తుంది. అందరూ తమ తప్పు తెలుసుకుని శివయ్యను క్షమించమంటారు కాలనీ జనం. రోజాతో శివయ్య పెళ్ళిజరపాలనుకుంటారు. దాంతో కథ ముగుస్తుంది.

ఇందులో మోనికా బేడీ, సంఘవి, శ్రీహరి, అట్లూరి పుండరీకాక్షయ్య, రవిబాబు, రాజా రవీంద్ర, చిట్టిబాబు, రజిత, నరసింహరాజు, మోహన్ రాజ్, చలపతిరావు, గిరిబాబు, కృష్ణవేణి, రమాప్రభ, ఏవీయస్, జయప్రకాశ్ రెడ్డి, గుండు హనుమంతరావు, శివపార్వతి, బెంగళూరు పద్మ నటించారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే పోసాని కృష్ణమురళి సమకూర్చారు. ఎమ్.ఎమ్.శ్రీలేఖ సంగీతం రూపొందించిన ఈ చిత్రానికి సి.నారాయణరెడ్డి, జొన్నవిత్తుల, చంద్రబోస్ పాటలు పలికించారు. ఇందులోని “మొదటిసారి ముద్దు పెడితె ఎలా ఉంటది…”, “నడిచే దేవుడు…”, “ఓ రంగనాథ…”, “ఎక్కడుందిరా…”, “ట్వంటీఫస్ట్ సెంచరీ…” అంటూ సాగే పాటలు అలరించాయి. ఈ చిత్రం మంచి విజయం సాధించి, అనేక కేంద్రాలలో శతదినోత్సవం చూసింది. ఈ సినిమాకు ముందు డైరెక్టర్ సురేశ్ వర్మకు ఆట్టే విజయాలు లేవు. ఈ చిత్ర విజయంతో సురేశ్ వర్మ తరువాత మరికొన్ని చిత్రాలు రూపొందించారు. ఈ సినిమా కథతో రామానాయుడు తనయుడు డి.సురేశ్ బాబు హిందీలో సునీల్ శెట్టి హీరోగా ‘ఆఘాజ్’ చిత్రం నిర్మించారు.