నటి రాశికి క్షమాపణలు చెబుతూ అనసూయ భరద్వాజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. గతంలో అనసూయ ఒక టీవీ షోలో రాశి గురించి అనకూడని మాటలు అనేసింది. ఒక స్కిట్లో భాగంగా రాశి ఫలాలు అనాల్సింది రాశి గారి ఫలాలు అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది/ అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని రాశి విమర్శించింది. ఇలా చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటూ ప్రశ్నించింది. ఈ నేపథ్యంలో తాజాగా అనసూయ తన సోషల్ మీడియా వేదికగా స్పందించింది. కొన్నేళ్ల క్రితం ఒక కామెడీ షోలో నటి రాశి గారిపై వచ్చిన ‘డబుల్ మీనింగ్’ డైలాగుల విషయంలో ఆమె స్పందిస్తూ, రాశికి తన హృదయపూర్వక క్షమాపణలు తెలియజేశారు. సుమారు మూడేళ్ల క్రితం ఒక టీవీ షోలో భాగంగా చేసిన స్కిట్‌లో, అనసూయ నోటి వెంట రాశి గారిని ఉద్దేశించి ద్వంద్వార్థం వచ్చే డైలాగులు వచ్చాయి. అప్పట్లో ఆ డైలాగులు రాసిన రచయితలు, దర్శకులను తాను నిలదీయలేకపోయానని, అది తన వైఫల్యమేనని అనసూయ అంగీకరించారు.
Also Read: Sai Soujanya : భరతనాట్యంతో ఆకట్టుకున్న త్రివిక్రమ్ భార్య సౌజన్య!
“అప్పటికి నాకున్న పరిస్థితుల్లో వారిని ప్రశ్నించేంత శక్తి నాకు లేకపోవచ్చు, కానీ అది ఖచ్చితంగా పొరపాటే” అని ఆమె పేర్కొన్నారు. మనిషి కాలక్రమేణా మారుతూ ఉంటారు అనడానికి తానే నిదర్శనమని అనసూయ అన్నారు. ఆ షోలో జరిగిన ఘటన తర్వాత ఆమె తన ప్రయాణాన్ని మార్చుకున్నారని, మహిళల గౌరవం కోసం నిలబడటం నేర్చుకున్నారని తెలిపారు. డబుల్ మీనింగ్ మాటలను ఖండించడం, అలాంటి షోల నుండి బయటకు వచ్చేయడం, మహిళల భద్రత మరియు హక్కుల గురించి గళమెత్తడం నేర్చుకున్నానని అన్నారు. ఈ మార్పులన్నీ తాను ఒక వ్యక్తిగా ఎదిగానని చెప్పడానికి నిదర్శనాలని ఆమె వివరించారు.
Also Read: Chiranjeevi : చిరంజీవికి సర్జరీ?
ప్రస్తుతం మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించే వారిపై, ట్రోలర్స్ పైన అనసూయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఆమెను టార్గెట్ చేస్తూ పాత వీడియోలను బయటకు తీసి ‘హేట్ క్యాంపెయిన్’ నడుపుతున్న వారిపై ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తనను కించపరచడానికి చేస్తున్న ఈ ప్రయత్నాలు రాశికి కూడా ఇబ్బందికరంగా ఉండవచ్చునని ఆమె భావించారు. షో నిర్వాహకులు లేదా రచయితలు క్షమాపణ చెబుతారో లేదో తనకు తెలియదని, కానీ ఆ మాటలు తన నోటి నుండి వచ్చాయి కాబట్టి, నైతిక బాధ్యత వహిస్తూ రాశి గారిని క్షమించమని కోరారు అలాగే మహిళల శరీరాల పైన, వారి గౌరవం పైన నిర్మించే తప్పుడు కథనాలను ప్రశ్నించేంత బలం ఇప్పుడు తనకు ఉందని ఆమె ఈ సందర్భంగా స్పష్టం చేశారు. “గతాన్ని మార్చలేను కానీ, భవిష్యత్తులో అలాంటి తప్పులు జరగకుండా చూసుకోగలను” అనే సందేశాన్ని అనసూయ ఈ పోస్ట్ ద్వారా ఇస్తూ రాశి ఈ విషయాన్ని అర్థం చేసుకుని తనకు మద్దతుగా నిలుస్తారని ఆశిస్తున్నట్లు ఆమె తన పోస్ట్‌ను ముగించారు.
