Site icon NTV Telugu

Amma: అమ్మ గొప్పతనాన్ని చాటే ‘అమ్మ’

Amma

Amma

అమ్మ అంటే ఆలనా, ఆప్యాయత, అనురాగం. అలాంటి అమ్మ విలువను గుర్తు చేస్తూ రూపొందిన సందేశాత్మక షార్ట్ ఫిల్మ్ ‘అమ్మ’. ఏఏఆర్ ఫిల్మ్ మేకర్స్ సమర్పణలో, ‘నాట్యమార్గం’ సహకారంతో తెరకెక్కిన ఈ చిత్రం మదర్స్ డే సందర్భంగా మే 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రముఖ నృత్యకారిణి అభినయశ్రీ ఇంద్రాణి దవలూరి ఈ చిత్రంలో ‘అమ్మ’ పాత్రలో మెప్పించనున్నారు. గతంలో ఆమె నటించిన అందెల రవమిది చిత్రం విడుదలకు ముందే పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను సొంతం చేసుకుంది. తాజాగా ‘అమ్మ’ షార్ట్ ఫిల్మ్‌లోనూ ఆమె ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమా విడుదల సన్నాహాల్లో ఉన్న సందర్భంగా ఇంద్రాణి మాట్లాడుతూ, “అమ్మ అంటే నిస్వార్థ ప్రేమ. అలాంటి అమ్మ కథను సందేశాత్మకంగా చూపించే చిత్రమే మా ‘అమ్మ’,” అని అన్నారు.

ఈ షార్ట్ ఫిల్మ్‌కు కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం అందించిన హరీష్ బన్నాయ్ మాట్లాడుతూ, “మన కష్టానికి కన్నీరు కార్చే అమ్మకే మనం బాధ కలిగిస్తే ఆమె ఆవేదన ఎలా ఉంటుంది? కొవ్వొత్తిలా కరిగి మనకు దారి చూపే అమ్మకు మనం ఏమిచ్చి ఋణం తీర్చగలం? ఇదే మా చిత్రం యొక్క సారాంశం,” అని తెలిపారు. ఈ చిత్రంలో ఇంద్రాణి దవలూరితో పాటు సాంబి, సుధా కొండపు, రీనా బొమ్మసాని తదితరులు నటించారు. సంగీతం కె.వి. భరద్వాజ్ అందించగా, సినిమాటోగ్రఫీ కార్తీక్ కళ్లూరి సమకూర్చారు. హరీష్ బన్నాయ్ దర్శకత్వంలో రూపొందిన ‘అమ్మ’ షార్ట్ ఫిల్మ్, అమ్మ గొప్పతనాన్ని, త్యాగాన్ని హృదయస్పర్శిగా ఆవిష్కరిస్తూ ప్రేక్షకులను కట్టిపడేయనుంది. మే 11న విడుదల కానున్న ఈ చిత్రం ఇప్పటికే మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. అమ్మ ప్రేమ, త్యాగం గురించి సందేశాత్మక కథనంతో ఈ షార్ట్ ఫిల్మ్ అందరి మనసులను తాకనుంది.

Exit mobile version