ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫాన్స్ అందరూ ‘పుష్ప ది రూల్’ కోసం వెయిట్ చేస్తుంటే, ‘పుష్ప ది రైజ్’ ఊహించని షాక్ ఇస్తోంది. 2021 డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకి వచ్చిన ‘పుష్ప ది రైజ్’ సినిమా ఒక తెలుగు మూవీకి ఇంత రీచ్ ఉంటుందా అనే రేంజులో ఆశ్చర్యపరచింది. క్రికెటర్ల నుంచి హాలీవుడ్, బాలీవుడ్ సెలబ్రిటిల వరకూ ప్రతి ఒక్కరూ ‘జుఖేగా నహి సాలే’ అనే డైలాగ్ చెప్పి గడ్డం కింద చెయ్ పోనిచ్చిన వాళ్ళే. అంతటి ఇంపాక్ట్ క్రియేట్ చేసిన ‘పుష్ప’ సినిమాని కేరళలో రీరిలీజ్ చేస్తున్నారు. కేరళ అల్లు అర్జున్ ఫాన్స్… పుష్ప పార్ట్ 1 విడుదలై ఏడాది అవుతున్న సంధర్భంగా ఈ మూవీని స్పెషల్ షోస్ వేసుకోని చూడడానికి సిద్ధమయ్యారు. తెలుగులో కూడా పుష్ప పార్ట్ 1 రీరిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. పుష్ప పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్న వాళ్లకి పార్ట్ 1 మళ్లీ రిలీజ్ అవుతుండడమే సర్ప్రైజ్ అనుకుంటే, ఇంతకన్నా పెద్ద సర్ప్రైజ్ ఇచ్చింది మైత్రి మూవీ మేకర్స్.
సుకుమార్ డైరెక్ట్ చేసిన ఈ ఎర్ర చందనం స్మగ్లర్ కథని, పార్ట్ 2తో పాన్ వరల్డ్ స్థాయికి తీసుకోని వెళ్ళడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నారు. అందుకు తగ్గ గ్రౌండ్ ప్రిపేర్ చేయడానికి ‘పుష్ప ది రైజ్’ సినిమాని రష్యాలో రిలీజ్ చేస్తున్నారు. డిసెంబర్ 8న రష్యాలో ‘పుష్ప ది రైజ్’ సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఈ మూవీ ప్రమోషన్స్ కోసం పుష్ప కాస్ట్ అండ్ క్రూ రష్యా వెళ్లనున్నారు. డిసెంబర్ 1న మాస్కోలో, డిసెంబర్ 3న సెయింట్ పీటర్స్బర్గ్ లో ప్రెస్ మీట్స్ మరియు ఫ్యాన్ మీట్స్ ని నిర్వహించనున్నారు. ఏడాది క్రితం రిలీజ్ అయిన మూవీని ఇప్పుడు రష్యాలో రిలీజ్ చేయడం అనేది మాస్టర్ ప్లాన్ అనే చెప్పాలి. అక్కడ ‘పుష్ప ది రైజ్’ మంచి హిట్ అయితే, పార్ట్ 2 ‘పుష్ప ది రూల్’ పాన్ వరల్డ్ సినిమా అవ్వడం గ్యారెంటీ.