Bhookailas: 65 ఏళ్ళ ‘భూకైలాస్’!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలుగు చిత్రసీమలో అతిరథ మహారథులు అనదగ్గ నటీనటులు నటించిన అపురూప చిత్రాలు ఈ నాటికీ ప్రేక్షకులను పరవశింపచేస్తూనే ఉన్నాయి. అలాంటి పౌరాణిక చిత్రం ‘భూకైలాస్’. ఈ సినిమా ప్రతి మహాశివరాత్రి నాడు ఏదో ఒక చోట ప్రదర్శితమవుతూ ఉంటుంది. కనీసం బుల్లితెరపై అయినా ‘భూకైలాస్’ దర్శనమివ్వక మానదు. కర్ణాటకలో సుప్రసిద్ధ శైవక్షేత్రం గోకర్ణం వెలసిన విధంబు ఎట్టిదో తెలుపుతూ ఈ చిత్రం రూపొందింది. ఇందులో భక్తునిగా రావణుడి దీక్ష, పట్టుదల మనకు కళ్ళకు కట్టినట్టు చూపించారు. రావణబ్రహ్మగా యన్.టి.రామారావు నటించిన ‘భూకైలాస్’లో నారదునిగా ఎ.నాగేశ్వరరావు అభినయించారు. ఈ ఇద్దరు మహానటులు ఇందులో వరుసకు తాత,మనవడు కావడం విశేషం! అవును మరి… నారదుడు, లెక్క చూస్తే రావణుడికి తాత అవుతాడు. 1958 మార్చి 20న ‘భూకైలాస్’ విడుదలై, విజయం సాధించింది. రిపీట్ రన్స్ లోనూ ‘భూకైలాస్’ తన సత్తా చాటుకుంది.
విశ్వవసు బ్రహ్మ, కైకసి దంపతుల పెద్దకొడుకు రావణబ్రహ్మ. అతని బలపరాక్రమాలకు ఇంద్రుడు జడుసుకుంటాడు. రావణబ్రహ్మకు అంత బలం కలగడానికి ఆయన తల్లి కైకసి నిత్యం సైకతలింగంతో పూజ చేయడమే అని నారదుడు తెలుపుతాడు. దాంతో సైకతలింగాన్ని ఓ సారి సముద్రుని సాయంతో ధ్వంసం చేస్తారు దేవతలు. సాక్షాత్తు పరమశివుని ఆత్మలింగాన్నే తీసుకువస్తానని తల్లితో చెప్పి బయలు దేరతాడు రావణుడు. అయితే ఆత్మలింగం రావణుడు సాధిస్తే, కైలాసం చీకటవుతుందని భావించిన పార్వతిదేవి, నారదుని ఆశ్రయిస్తుంది. నారదుడు మాయోపాయంతో రావణుడు ఆత్మలింగం కోరకుండా, పార్వతీదేవినే కోరుకొనేలా చేస్తాడు. భోళాశంకరుడు భక్తుడు కోరగానే తన అర్ధాంగినే దానమిస్తాడు. పార్వతీదేవిని తీసుకొని వెళ్తున్న రావణుడికి ఆమె కాళికగా దర్శనమిస్తుంది. దాంతో శివుడు తనను మోసం చేశాడని భావిస్తాడు. మళ్ళీ కైలాసం వెళ్ళి పార్వతీదేవిని ఇవ్వమని అంటాడు రావణుడు. నారదుడు వచ్చి, అసలు పార్వతి పాతాళంలో ఉందని చెప్పడంతో అక్కడకు వెళ్ళి మయాసురుని కూతురు మండోదరిని చేపడతాడు. ఆమెనే పార్వతిగా భావిస్తాడు. లంకకు తీసుకువెళతాడు రావణుడు. అక్కడకు వెళ్ళాకే అసలు విషయం తెలుస్తుంది. తాను ఎంత తప్పు చేశానో కూడా అర్థమవుతుంది. మళ్ళీ తల్లి, భార్య అనుమతితో తపస్సుకు బయలుదేరతాడు రావణుడు. ఈ సారి అతని భక్తికి మెచ్చి కోరుకున్న ఆత్మలింగాన్ని శివుడు ప్రసాదిస్తాడు. దానిని తీసుకొని వస్తూండగా, అది లంకకు చేరరాదనే నెపంతో నారదుడు, విఘ్నేశ్వరుని ఆశ్రయిస్తాడు. విఘ్నేశ్వరుడు ఓ బాలుని రూపంలో పశువుల కాస్తూ రావణుడుకి కనిపిస్తాడు. అదే సమయంలో సంధ్యావందనం చేయడానికి వెళ్తూ రావణుడు ఆ బాలకునికి శివలింగం ఇచ్చి, ఎట్టిపరిస్థితుల్లోనూ దానిని నేలపై పెట్టరాదని అంటాడు. తాను మూడు సార్లు పిలుస్తానని, ఈ లోగా రాకపోతే, లింగాన్ని కింద పెడతానని చెబుతాడు బాలుడి రూపంలో ఉన్న గణేశుడు. సరే అని సంధ్యావందనం చేయడానికి నీటిలోకి వెళతాడు రావణుడు. ఈ లోగా మూడుసార్లు పిలుస్తాడు గణేశుడు. రావణుడు వచ్చేలోగా శివుని ఆత్మలింగాన్ని కింద పెట్టేస్తాడు. సంధ్యావందనం చేసుకొని వచ్చిన రావణుడు బాలుడిపై కోపగించుకున్నాడు. కానీ, లాభం లేదు. లింగాన్ని పెకిలించే ప్రయత్నం చేస్తాడు రావణుడు. వల్ల కాలేదు. దాంతో ఆత్మాహుతికి పాల్పడతాడు. కైలాసపతి కరుణించి, రావణుడి కారణంగా వెలసిన ఆ క్షేత్రం సుప్రసిద్ధమవుతుందని, ‘భూకైలాసం’గా ప్రసిద్ధి చెందుతుందని చెప్పి అనుగ్రహిస్తాడు. అలా కర్ణాటకలోని గోకర్ణంలో ‘భూకైలాస్’ వెలసింది. ఇప్పటికీ భక్త జనకోటిని ఈ శైవక్షేత్రం అలరిస్తూనే ఉంది.
Also Read
- SlumDog Movie Teaser: 'మా బతుకులతో ఆడుకుంటే వదలం'.. గూస్బంప్స్ తెప్పిస్తున్న పూరీ 'స్లమ్‌డాగ్' టీజర్!
- Ram Charan: ఈ సినిమాలో ఆయన నటన చూసి నాకు కంట్లో నీళ్లు వచ్చాయి: రామ్‌చరణ్
- Ravi Shankar : ఈ సినిమాను చరణ్ తన ఒంటి కాలుతో నెక్స్ట్ లెవెల్‌కి తీసుకెళ్లారు: మైత్రీ రవిశంకర్
- Buchi Babu: నేను ఎలా నమ్మానో చరణ్ కూడా అలాగే నమ్మాడు.. ‘పెద్ది’ క్లైమాక్స్‌పై బుచ్చిబాబు ఎమోషనల్!
ఇందులో మండోదరిగా జమున, పార్వతిగా బి.సరోజాదేవి, శివునిగా నాగభూషణం, మయబ్రహ్మగా యస్వీరంగారావు, కైకసిగా హేమలత, కుంభకర్ణునిగా మహంకాళి వెంకయ్య నటించారు. ఇందులో “రాముని అవతారం…” పాటలో సీతగా విజయనిర్మల కనిపించారు. ఇక ప్రఖ్యాత నృత్యతార హెలెన్ “సుందరాంగ అందుకోరా…” అనే గీతంలో నర్తించారు. విఖ్యాత కార్టూనిస్ట్ ఆర్.కె.లక్ష్మణ్ సతీమణి కమలా లక్ష్మణ్ సుప్రసిద్ధ నర్తకి. “మున్నీట పవళించు… నాగశయనా…” అంటూ సాగే పాటలో నృత్యంతో ఆకట్టుకున్నారు. ఈ చిత్రానికి మాటలు-పాటలు సముద్రాల రాశారు. ఇందులోని “దేవదేవ ధవళాచల మందిర…”, “నీలకందరా దేవా…”, “తగునా వరమీయ…” అంటూ సాగే పాటలూ ఎంతగానో మురిపించాయి. ఈ సినిమాలోని పద్యాలు సైతం ఆకట్టుకున్నాయి. ఆర్.సుదర్శనం, ఆర్.గోవర్ధనం సంగీతం సమకూర్చిన ఈ సినిమాకు ఛాయాగ్రహణం మాధవ్ బుల్ బులే నిర్వహించారు. కె.శంకర్ దర్శకత్వంలో ఏవీయమ్ అధినేత మెయ్యప్పన్ ఈ చిత్రాన్ని నిర్మించారు.
‘భూకైలాస్’ షూటింగ్ సమయంలోనే కన్నడలో రాజ్ కుమార్ రావణబ్రహ్మగా ‘భూకైలాస’ చిత్రాన్నీ నిర్మించారు. ఆ సినిమా ఈ చిత్రానికంటే ముందు 1958 ఫిబ్రవరి 5న విడుదలయింది. తెలుగులో టాప్ స్టార్స్ నటించడం వల్ల వారి కాల్ సీట్స్ అడ్జెస్ట్ కావడంలో కొంత జాప్యం జరిగింది. అందువల్లే 1958 మార్చి 20న తెలుగు ‘భూకైలాస్’ విడుదలయింది. రెండు భాషల్లోనూ ఈ సినిమా విజయం సాధించింది. తమిళంలోనూ ఈ తెలుగు వెర్షన్ ను అనువదించి విడుదల చేశారు. ఈ చిత్రానికి ముందు 1940లో ఎస్.ఎస్.ఎస్.నాటకమండలి రచనతో రూపొందిన ‘భూకైలాస్’ నాటకం ఆధారంగా ఇదే టైటిల్ తో ఓ సినిమా తెరకెక్కింది. సరస్వతీ సినీ ల్యాబ్ నిర్మించిన ఈ చిత్రం బలిజేపల్లి లక్ష్మీకాంత కవి పాటలు-మాటలతో తెరకెక్కింది. ఆ చిత్రానికి సుందరరావ్ నాద్ కర్ణి దర్శకత్వం వహించారు. అందులో ఆర్.సుబ్రహ్మణ్యం శివునిగా, ఎమ్.వి.సుబ్బయ్యనాయుడు రావణునిగా, ఆర్.నాగేంద్రరావు నారదునిగా నటించారు. ఈ ప్రింట్ కూడా ఇప్పుడు యూ ట్యూబ్ లో లభిస్తోంది. అయితే అన్నిటి కన్నా మిన్నగా యన్టీఆర్ నటించిన ‘భూకైలాస్’ కే ఆదరణ ఉండడం గమనార్హం!
యన్టీఆర్ తొలిసారి రావణబ్రహ్మగా నటించిన చిత్రమిది.ఈ సినిమాలో యన్టీఆర్ నటనకు జనం జేజేలు పలికారు. అయితే కన్నడలో రాజ్ కుమార్ కూడా రావణబ్రహ్మగా బాగా చేశారని వినిపించడంతో యన్టీఆర్ ఛాలెంజ్ గా తీసుకున్నారు. తన అభిమాన పాత్ర అయిన రావణబ్రహ్మను అందరి మనసుల్లో నిలచిపోయేలా చేయాలని భావించారు. తత్ఫలితంగానే ‘సీతారామకళ్యాణం’లో రావణబ్రహ్మగా నటించారు. ఆ సినిమాలో యన్టీఆర్ అభినయం అగ్రతాంబూలం అందుకుంది. ఆ తరువాత “శ్రీకృష్ణసత్య, శ్రీరామపట్టాభిషేకం, బ్రహ్మర్షి విశ్వామిత్ర” చిత్రాలలోనూ రావణునిగా నటించారు యన్టీఆర్.
ఇందులో తొలిసారి నారదునిగా నటించిన అక్కినేని నాగేశ్వరరావు, అదే యేడాది రూపొందిన ‘శ్రీకృష్ణమాయ’లోనూ నారద పాత్రను పోషించారు.
తాజావార్తలు
-
HDFC Bank MCLR Hike: కస్టమర్లకు షాకిచ్చిన హెచ్డీఎఫ్సీ బ్యాంక్.. మరింత భారంగా EMIలు
-
Vaibhav Sooryavanshi: ‘వైభవ్ సూర్యవంశీ డకౌట్ అవుతాడు’.. కపిల్ దేవ్ సంచలన వ్యాఖ్యలు..
-
Vaibhav Sooryavanshi: ఐపీఎల్ సంచలనంపై అశ్విన్ ప్రశంసల వర్షం.. భవిష్యత్తు సూపర్ స్టార్
-
Kerala: “దీపం” వెలిగించడంపై రచ్చ.. వివాదంలో ముస్లిం మహిళా ఎమ్మెల్యే
-
TG EAPCET 2026 : విద్యార్థులకు అలర్ట్.. టీజీ ఎప్‌సెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ విడుదల
ట్రెండింగ్
-
Protein Powder : ప్రోటీన్ పౌడర్ తీసుకోవడం సురక్షితమేనా? ఈ విషయం తెలుసుకోకుండా వాడకండి..!
-
Manav Suthar Record: అరంగేట్ర స్పిన్నర్ మానవ్ సుతార్ అరుదైన రికార్డు.. ఈ శతాబ్దంలోనే ‘ఒకే ఒక్కడు’!
-
Harmanpreet Kaur: ‘నేను రిటైర్ అవ్వాలనుకుంటున్నారా?’.. రిపోర్టర్ కు ధోనీ స్టైల్లో మహిళా కెప్టెన్ కౌంటర్.!
-
Birth Rate: భారత్‌లో పడిపోతున్న జననాల రేటు.. విద్యావంతులు తక్కువ మంది పిల్లలను కనడమే కారణమా.?
-
Sugar Cravings Control : తీపి తినాలనే కోరికా..? ఈ చిట్కాలతో మీ స్వీట్ క్రేవింగ్స్‌కు చెక్ పెట్టండి.!