NTV Telugu Site icon

రివ్యూ: అలాంటి సిత్రాలు (ఓటీటీ)

నటీ నటులు: శ్వేతా పరాశర్, ప్రవీణ్ యండమూరి, యష్ పూరి, తన్వి ఆకాంక్ష, రవివర్మ, అజయ్
మ్యూజిక్: సంతు ఓమ్ కార్,
సినిమాటోగ్రఫీ: కార్తీక్ సాయికుమార్
నిర్మాతలు: సుప్రీత్ కృష్ణ, లొక్కు శ్రీవరుణ్, రాహుల్ రెడ్డి
దర్శకత్వం: సుప్రీత్.సి.కృష్ణ
స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాం: జీ 5

జర్నలిస్ట్ గా కెరీర్ ఆరంభించి సినిమా బిజినెస్ లో పండిపోయిన రాఘవేంద్రరెడ్డి తొలిసారి నిర్మాతగా మారి తీసిన సినిమా ‘అలాంటి సిత్రాలు’. కొత్తవారితో తీసిన ఈ సినిమా జీ 5లో స్ట్రీమింగ్ అవుతోంది. రాగ్, పల్లవి, దిలీప్, యశ్ జీవితంలో ఎదురైన సంఘటనలు, వారి భావోద్వేగాల సమహారమే ఈ సినిమా ఇతివృత్తం.

కథ విషయానికి వస్తే రాగ్ (యష్ పూరి) 23 ఏళ్ల గిటార్ ప్లేయర్. పల్లవి (శ్వేత పరాశర్) అనే వేశ్య పట్ల ఆకర్షితుడవుతాడు. దిలీప్ (ప్రవీణ్ యండమూరి) ఒక చిన్న రౌడీ. ఒంటరి తండ్రి. తన పాత పద్ధతులను విడనాడి కొత్త జీవితానికి ప్రయత్నిస్తుంటాడు. పల్లవి ఇతనిని అతిగా ప్రేమిస్తుంటుంది. గుణ (దయానంద్ రెడ్డి) దిలీప్ కొత్త జీవితానికి సహాయం చేస్తుంటాడు. ఇక సనాతన కుటుంబానికి చెందిన యామిని (తన్వి ఆకాంక్ష) కిక్ బాక్సర్ యష్ (అజయ్) తో ప్రేమలో పడుతుంది. యశ్ కి కోచ్ గా రవివర్మ వ్యవహరిస్తూ తన విజయం కోసం పాటుపడుతుంటాడు. ఈ పాత్రల మధ్య ఉన్న బంధం ఏమిటి? వీరందరూ వారి వారి సమస్యలను అధిగమించి అనుకున్నది సాధిస్తారా!? అన్నది చూడవచ్చు.

నటీనటుల విషయానికి వస్తే దిలీప్ గా నటించిన ప్రవీణ్ యండమూరి చక్కటి ప్రదర్శన చేశాడని చెప్పవచ్చు. ఇతడు నవీన్ చంద్రను పోలి ఉండటం కలసి వచ్చే అంశం. అలాగే ఇతర పాత్రధారులు కూడా తమ తమ పాత్రలకు న్యాయం చేశారనే చెప్పాలి. హీరోయిన్ గా నటించిన తన్వి, వేశ్యపాత్రలో కనిపించిన పల్లవికి మంచి భవిష్యత్ ఉంటుందని చెప్పాలి. సంతూ ఓంకార్ సంగీతం… కార్తీక్ సాయి కుమార్ సినిమాటోగ్రఫీ చక్కగా ఉన్నాయి.

అయితే దర్శకుడు సుప్రీత్.సి.కృష్ణ ఎంచుకున్న కథ… దానికి అతను సమకూర్చుకున్న కథనం మాత్రం ఇంప్రెసీవ్ గా లేకపోవడంతో పాత్రల పరిచయం, వారి సమస్యలను చూపించటానికే ఇంటర్వెల్ అయింది. ఆ తర్వాత కూడా సూటిగా స్పష్టంగా కథను నడిపించలేక పోయాడు. వేశ్యను స్ఫూర్తిగా తీసుకునే రాగ్, తన తండ్రి సెకండ్ ఫ్యామిలీని అంగీకరించలేని వాడిగా చూపించటం… యశ్ ని చంపవలసిన దిలీప్ ఎంతో భవిష్యత్ ఉందని చెప్పి హెచ్చరించి తనను ప్రేమించిన పల్లవిని అంగీకరించలేకపోవడం వంటి లూప్ హోల్స్ సినిమాలో చాలా ఉన్నాయి. వాటన్నింటినీ సరిచేసుకుని గ్రిప్పింగ్ గా కథ నడిపి ఉంటే ‘అలాంటి సిత్రాలు’ మంచి సినిమాగా నిలిబడి ఉండేది.

ప్లస్ పాయింట్స్
నటీనటుల నటన
నిర్మాణ విలువలు

మైనస్ పాయింట్స్
కథలో డొల్లతనం
స్లోగా నడిచే ప్రథమార్ధం
ఆకట్టుకోని కథనం

రేటింగ్: 2.25 / 5

ట్యాగ్ లైన్: ‘సిత్రాలు’ ఏవీ లేవు!

Show comments