Site icon NTV Telugu

హోలీకి వస్తానంటున్న ‘బచ్చన్ పాండే’!

రెండు రోజుల క్రితం అక్షయ్ కుమార్ నటిస్తున్న ‘బచ్చన్ పాండే’ మూవీ సెట్ లో అగ్ని ప్రమాదం జరిగింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఆ చేదు ఘటన నుండి వెంటనే బయటకు వచ్చిన ఈ చిత్ర బృందం ఇప్పుడీ సినిమాను హోలీ కానుకగా మార్చి 18న థియేటర్లలో విడుదల చేస్తున్నట్టు తెలిపింది. మూవీ హీరో అక్షయ్ కుమార్ ఈ విషయాన్ని తెలియచేస్తూ, నయా పోస్టర్ ను ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేశాడు. కరోనా కరణంగా గత యేడాది డిసెంబర్ లో విడుదల కావాల్సిన ఈ సినిమాను మార్చి 4కు వాయిదా వేశారు. అయితే తాజా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని అదే నెల 18న రాబోతున్నట్టు అక్షయ్ తెలిపాడు. ‘యాక్షన్, కామడీ, రొమాన్స్, డ్రామా… లోడింగ్ దిస్ హోలీ’ అంటూ అక్షయ్ ఆ పోస్ట్ లో పేర్కొన్నాడు.

కృతి సనన్ హీరోయిన్ గా నటిస్తున్న ‘బచ్చన్ పాండే’లో జాక్విలిన్ ఫెర్నాండేజ్ కీలక పాత్ర పోషిస్తోంది. ఫర్హాద్ సామ్జీ దర్శకత్వంలో సాజిద్ నడియాద్ వాలా ఈ సినిమాను నిర్మిస్తున్నాడు. గతంలో ఇది అజిత్ ‘వీరమ్’కు రీమేక్ అనే ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత సిద్ధార్థ్ ‘జిగర్తాండ’కు రీమేక్ అని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దర్శక నిర్మాతలు మాత్రం అధికారికంగా ఈ విషయాన్ని కమిట్ కావడం లేదు. అయితే… మూవీ పోస్టర్స్, ఇప్పటికే విడుదలైన కొన్ని వర్కింగ్ స్టిల్స్ చూసిన వాళ్ళు ‘జిగర్తాండ’ రీమేక్ అనే విషయాన్ని ధృవీకరిస్తున్నారు. విశేషం ఏమంటే… ఇప్పటికే ‘జిగర్తాండ’ మూవీ తెలుగులో ‘గద్దలకొండ గణేశ్‌’ పేరుతోనూ, కన్నడలో ‘జిగర్తాండ’ పేరుతోనూ రీమేక్ అయ్యింది. మరి హిందీలో హోలీకి విడుదల కాబోతున్న ‘బచ్చన్ పాండే’ ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.

Exit mobile version