NTV Telugu Site icon

అక్షయ్ భారీ విరాళంతో… పాడుబడిన పాఠశాలకు ‘కోటి’ మెరుగులు!

అక్షయ్ కుమార్ మరోసారి తన దాన గుణం చాటుకున్నాడు. అంతే కాదు, దేశం పట్ల తన భక్తిని కూడా ఆయన మరోసారి ప్రపంచం ముందు సగర్వంగా ప్రదర్శించాడు. పోయిన సంవత్సరం కరోనా కారణంగా ఇండియా ప్రమాదంలో ఉంటే భారీగా విరాళం ప్రకటించిన ఖిలాడీ స్టార్ ఈ సారి బీఎస్ఎఫ్‌ జవాన్ల కోసం స్పందించాడు. అదీ చదువుకు సంబంధించిన గొప్ప పని కోసం కోటి రూపాయల విరాళం అందించాడు. కాశ్మీర్ లో బీఎస్ఎఫ్ నడిపే ఓ స్కూల్ కోసం అక్కీ ఆర్దిక సాయం అందించాడు. జూన్ లో కాశ్మీర్ కి వెళ్లిన అక్షయ్ కుమార్ బీఎస్ఎఫ్ జవాన్లతో కొంత సేపు గడిపాడు.

రియల్ హీరోస్ ని కలుసుకోవటం సంతోషంగా ఉందంటూ ట్వీట్ కూడా చేశాడు. అయితే, కాశ్మీర్ లోనే ఓ పాఠశాల భవనం పాడుబడి కనిపించటంతో ఆయన దాని పునర్ నిర్మాణం కోసం కోటి రూపాయలు అప్పుడే విరాళంగా ప్రకటించాడు. తాజాగా బీఎస్ఎఫ్ తమ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో సదరు స్కూలు నిర్మాణానికి సంబంధించిన శిలా ఫలకం ఫోటోను షేర్ చేసింది. అక్షయ్ కుమార్ పేరు కూడా ‘పద్మ శ్రీ’తో సహా మనం ఫౌండేషన్ స్టోన్ పై చూడవచ్చు. న్యూ స్కూల్ బిల్డింగ్ పేరుని ‘హరీ ఓం భాటియా ఎడ్యుకేషన్ బ్లాక్’గా వ్యవహరించనున్నారు. అక్షయ్ తండ్రి పేరు హరీ ఓం భాటియా! వరుసగా చిత్రాలు చేస్తోన్న అక్షయ్ కుమార్ ప్రస్తుతం ‘బచ్చన్ పాండే’తో బిజీగా ఉన్నాడు. ఆయన నటించిన ‘బెల్ బాటమ్, పృథ్వీరాజ్, రక్షా బంధన్, రామ్ సేతు’ కూడా రానున్న కాలంలో అలరించనున్నాయి…