సురేందర్ రెడ్డి, అఖిల్ అక్కినేని కాంబోలో రూపొందుతోన్న ‘ఏజెంట్’ సినిమా మళ్లీ వాయిదా పడనున్నట్టు కొన్ని రోజుల నుంచి వార్తలొస్తున్నాయి. చాలాకాలం నుంచి సెట్స్ మీదే ఉన్న ఈ సినిమా.. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఆగస్టు 12వ తేదీన విడుదల చేయాలని మేకర్స్ ఫిక్స్ చేశారు. షూటింగ్ జాప్యం వల్లే వాయిదాలు తప్పలేదని, ఈసారి తప్పకుండా చెప్పిన తేదీకే సినిమాని విడుదల చేస్తామని బల్లగుద్ది మరీ చెప్పారు. కానీ, తప్పని పరిస్థితుల్లో మళ్లీ సినిమాను ఆగస్ట్ నుంచి షిఫ్ట్ చేస్తున్నారని తెలిసింది.
రీసెంట్ గా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోన్న సాక్షి వైద్య ఫస్ట్ లుక్ పోస్టర్ లో విడుదల తేదీని మెన్షన్ చేయకపోవడంతో.. ఈ వాయిదా ప్రచారం ఊపందుకుంది. అప్పట్నుంచి ఈ సినిమాని ఎప్పుడు రిలీజ్ చేస్తారా? అనే ప్రశ్న మిస్టరీగా మారిపోయింది. ఇప్పుడు ఆ మిస్టరీ దాదాపు వీడినట్టే కనిపిస్తోంది. సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ‘ఏజెంట్’ను సెస్టెంబర్ 30వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారట! ఆలోపు సినిమా పనులన్నీ పూర్తవుతాయని తెలుస్తోంది. అంతేకాదు, ఆ సమయంలో పోటీగా భారీ చిత్రాలేవీ లేవని గ్రహించి, ఆ సేఫ్ తేదీకి ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. అయితే, దీనిపై ఇంకా అధికార ప్రకటన రావాల్సి ఉంది.
కాగా.. స్పై యాక్షన్ త్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు భారీ బడ్జెట్ కేటాయిస్తున్నారు. ఇందులో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా కోసం అఖిల్ సూపర్ మేకోవర్ చేశాడు. తన బాడీని పెంచడంతో పాటు లుక్ పరంగా చాలా ఛేంజెస్ చేసుకున్నాడు. ఈ చిత్రాన్ని ఎకే ఎంటర్టైన్మెంట్స్, సురేందర్ 2 బ్యానర్స్ పై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. వరుసగా వాయిదాలు పడుతూ వస్తోన్న ఈ చిత్రం.. సెప్టెంబర్ 30వ తేదీకైనా వస్తుందో లేదో చూడాలి.
